జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..

ఈ టపా ఇంతకు ముందు నేను విశ్వం యొక్క కారణం,పుట్టుకా వగైరా ల గురించి రాసిన టపాలకు

http://wp.me/pGX4s-iR

http://wp.me/pGX4s-rB

) కొనసాగింపు.

1.ఈ భౌతిక ప్రపంచానికి ఆవల అధి భౌతిక ప్రపంచం (metaphysical world) ఉంటుంది.భౌతిక ప్రపంచం యొక్క నియమాలు పనిచేయటం మానివేసినచోటినుంచీ అధిబౌతిక ప్రపంచం ఉనికి మొదలౌతుంది.  ఈ భౌతిక ప్రపంచ మూలాలు ఆ అధి భౌతిక ప్రపంచం లో నే ఉంటాయి. అయితే ఈ అధి భౌతిక ప్రపంచం మన ఊహల కు అందనిది. దాని గురించి ఆలోచించాలంటే “కాలం లేకపోవటం, కారణం లేక పోవటం,ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతలూ(డైమెన్షన్స్)” లాంటి భౌతిక ప్రపంచానికి ఉన్న మినహాయింపుల సహాయం తో ఆలోచించాలి. అయితే మన ఆలోచనా, ఊహా ఈ మినహాయింపులు అనే గోడ కి కొట్టుకొని ఆగిపోతాయి. ఈ గోడ ఆవల ఏమి ఉందో మన ఊహ కు అందదు. ఇక, దానిని అనుభవించటం కలలోని మాట.

అధిభౌతిక ప్రపంచం లో రెండు స్థాయిలు ఉంటాయి. ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతల(డైమెన్షన్స్)  తో ఏర్పడిన మొదటి స్థాయి ఒకటీ, మనం చూసే భౌతిక ప్రపంచం లోని, మరియూ మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం లోని విషయాలకు ఆవల ఉండే రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం ఇంకొకటి. ఈ రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం స్థల కాలాల కూ అన్ని కొలతలకూ అతీతమైనది.

2. మనకు తెలిసిన అనేక మంది మహానుభావులు, ఋషి సమానులు పరిపూర్ణ సత్యాన్ని ప్రత్యక్షం గా అనుభవించామని చెప్తారు. ఇలా అనుభవించటం “నేను” అనే దానిని వదులుకోవటం ద్వారా సాధ్యపడుతుందని చెప్తారు. ఉదాహరణ కి ఆధునిక కాలం లో జిడ్డు కృష్ణమూర్తి, యూ జీ కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారు ఇలాంటి అనుభవాలు పొందబడిన వారి గా నమ్మబడ్డారు. వీరు అహాన్ని అధిగమించటం ద్వారా మనం రోజు వారీ చూసే భౌతిక సత్యాన్నే విశిష్టమైన రూపం లో చూడగలిగారు అనిపిస్తుంది. వీరికి కలిగిన అనుభవాలను భవిష్యత్తు లో, వేరే పధ్ధతుల్లో, భౌతిక ప్రేరేపణల ద్వారా, అంటే, శస్త్ర చికిత్సల వలన నో, జన్యు మార్పులు చేయటం వలననో, లేక మందులు కనిపెట్టటం వలననో” సాధించవచ్చేమో!

3.నేను అనేది గడిచిన కాలం లోని ప్రతిబింబాల(images) తో చేయబడిన ఆలోచనల సమూహం. నేను లేనప్పుడు, భౌతికమైన వాస్తవాన్ని చూసేటపుడు, ఈ  ప్రతిబింబాలు అడ్డు రాని స్వఛ్ఛమైన భౌతిక వాస్తవికత అనుభవంలోకి వస్తుంది. నేను అనేది లేనపుడు భూత కాలమూ, భవిష్యత్ కాలమూ ఉండవు. కేవలం వర్తమానం మాత్రమే అనుభవం లోకి వస్తుంది. మన చేతన అనే టార్చ్ వెలుతురు లో వర్తమానానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. దీని వలన, ‘నేను లేని స్థితీ లో మానసిక మైన కాలం ఉండదు. ఐతే ఈ ‘నేను లేని స్థితీ లో కలిగిన అనుభవాలు అధిభౌతికమైనవి కావు. భౌతిక అనుభవాలే ఆలోచనల అడ్డులేకుండా కలుగుతాయి. దీని వలన ఆ భౌతిక అనుభవాలకు ఒక విశిష్టత చేకూరుతుంది.మనిషి మామూలు చేతన లో ఉండగా ఇటువంటి అనుభవాలు కలుగవు. మామూలు చేతన పరిధి విస్తరించినపుడే ఈ అనుభవాలు కలుగుతాయి. అందువలన మనం వీటిని అధి-చేతన అనుభవాలు అనవచ్చు.

4. ఈ మహానుభావులకు కలిగిన అబుభవాలు కారణం లేనివి (acausal) గా చెప్పబడతాయి (మన విశ్లేషణ లో “విశ్వమూ, క్వాంటం ఫ్లక్చ్యుయేషన్స్” మొదలైనవి కారణం లేనివి గా తేలినట్లు).  దీనిని బట్టి ఆ అనుభవాలు అధి భౌతికమైన కారణాల వలన కలిగాయనిపిస్తుంది. అయితే, ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ “‘నేను’ ని వదిలిన మహానుభావులు” వారి అనుభవానికి కారణమైన అధి భౌతిక ప్రపంచాన్ని చూడలేదేమో! ఎందుకంటే అధిభౌతిక ప్రపంచం లో కార్య కారణ సంబంధాలు (మనము అనుభవించే విధం గా) ఉండవు. కాలం ఉండదు. కానీ మనిషికి సంబంధించిన ప్రక్రియలైన చూడటం, అనుభవించటం, ఇంద్రియానుభవాలూ, చేతనా అన్నీ అధి భౌతికమైనవివి కాదు. అవి కార్య-కారణ సంబంధాల పరిధి లోనే ఉంటాయి. భౌతిక స్థాయి లో మనిషి అణువులూ, ఎలక్ట్రాన్లూ మొదలైన వాటి తో తయారు చేయబడ్డాడు. ఇవన్నీ భౌతికమైన కాలానికీ, కార్య కారణ సంబంధాలకు లోబడే ఉంటాయి. వాటిలో అధిభౌతికత లేదు.అధిభౌతిక మైన విషయాలు మన కాలానికి లోబడి ఉండవు. కా బట్టీ ఈ మహా పురుషుల అనుభవాలు అలౌకికమైనవీ, అసాధారణమైనవీ అయినా అధి-భౌతిక మైనవి కాక పోవచ్చు.కానీ ఈ అనుభవాలకు ప్రేరణ మాత్రం అధిబౌతిక ప్రపంచం లో ఉంటుంది.

5. ఈ అధి భౌతికమైన విషయాలను తన ప్రత్యక్ష ఇంద్రియానుభవం లోకి తెచ్చుకొనే అవకాశం మనిషి కి రాకపోవచ్చు. ఒక బాక్టీరియాకు కామం, మోహం, ప్రేమా వంటివి ఎప్పటికైనా తెలుస్తాయా?

6.ఈ ఋషులలో కొంత మంది అద్భుతాలను చేస్తారు. వీరికి అయిన సత్యదర్శనం లానే, ఈ అద్భుతాలకు కూడా ప్రేరణ అధిభౌతిక ప్రపంచం లోనే ఉండవచ్చు.ఈ అధి భౌతిక ప్రపంచం పైన చెప్పిన మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం మాత్రమే. రెండవ స్థాయి అధిభౌతిక ప్రపంచాన్ని స్పృశించటం కూడా మానవులకు సాధ్యం కాదు.

ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ అద్భుతాలన్నీ (గాలి లో తేలటం, భవిష్యత్తును చెప్పటం మొదలైనవి) భౌతిక ప్రపంచం లో జరిగేవే. ఒకప్పుడు అద్భుతాలుగా కనిపించేవి, సైన్స్ వృధ్ధి చెందిన తరువాత మామూలు విషయాలయ్యాయి (ఉదా: గాలి లో ప్రయాణం చేయటం). అదే విధం గా, వచ్చే కాలం లో,సైన్స్ “ఇలాంటి వాటిని కూడా సంభవమే” అని నిరూపించవచ్చు.

కాబట్టీ శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృధ్ధి చెందినా, ‘అధి-భౌతిక’ ప్రపంచాన్ని మనిషి అనుభవం పరిధి లోకి తీసుకొని రావటం సంభవం కాకపోవచ్చు. అలా అని శాస్త్ర విజ్ఞానం అంతా దండుగ అని కాదు. భౌతిక పరిధి లో ఉన్న అనేక విషయాలు శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ మన దైనందిన అనుభవం లో అవగాహన లో కి వస్తాయి.