పాపులర్ తెలుగు టపాలు రాయటం ఎలా? : కొన్ని సూత్రీకరణలు

ఈ కింది సూత్రీకరణలు మీకు ఇంతకు ముందే తెలిస్తే, ఈ టపా ని skip చేసేయండి. “చదవకుండా ఎలా తెలుస్తాయి?” అంటారా?   తీరా చదివిన తరువాత..”అబ్బే! ఇవన్నీ మాకు ముందే తెలుసు”, అనొద్దు మరి.. .. 🙂

1. తెలుగు బ్లాగులను ఒక సీరియస్ సబ్జెక్ట్ లా చదివే వారు చాలా తక్కువ ఉంటారు. “ఆఫీస్ లో బోర్ కొట్టినపుడో, ఇంట్లో ఉబుసు పోకో, బ్లాగులు ఫాలో అవ్వటం అలవాటయ్యో, ఉద్యోగాలలోంచీ రిటైర్ అయ్యో,  ప్రభుత్వోద్యోగాల్లో ఉండో, పెద్దతనం లో తమ పిల్లల తో పాటు అమెరికా చేరో,” ఈ బ్లాగులను చదివే వారే ఎక్కువ. సీరియస్ సబ్జెక్ట్ లు(ఫిలాసఫీ, సైన్సూ, టెక్నాలజీ, ఇంజినీరింగూ, సామాజిక శాస్త్రం, మన్నూమశానం.. ) నేర్చుకోవాలంటే అందుకు కాలేజీలూ, యూనివర్సిటీలూ ఉన్నాయి. బ్లాగులు దానికి వేదిక కాదు. కాబట్టీ, టపాలు సరదా గా వీలైనంత మందిని అలరించేవి గా, లైట్ రీడింగ్ కి ఉపయోగపడేవి గా , కాలక్షేపానికి పనికి వచ్చేవి గా ఉంటే ఎక్కువ మంది చదువుతారు.
ఒక వేళ ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి వచ్చినా దానిని sugar coated pill లా సరదా గా చెప్పాలి.
2. ఏ భాషా బ్లాగులలో అయినా sex sells. నేరు గా సెక్స్ రాస్తే సంకలినులు బ్లాగులను పీకేస్తాయి. కాబట్టీ, ఇండైరెక్ట్ గా సెక్స్ “గురించి” రాసిన ఏ టపా ని అయినా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
3. controversial విషయాల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు. తెలుగు సమాజం లో caste అనేది ఒక incendiary thing. అలానే తెలంగాణా, రిజర్వేషన్లూ, హిందూత్వ ల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు.
4. నలుగురి imagination లోనూ నానుతున్న current event గురించి కూడా చదువుతారు. ఉదా: డర్టీ పిక్చర్.
5. ఎక్కువ మంది పాఠకుల కి సంబంధించిన విషయాలని కూడా పాఠకులు చూస్తారు. స్త్రీ పురుష సంబంధాలు సమాజం లో దాదాపు నూరు శాతం జనాలని కవర్ చేస్తాయి. కాబట్టీ వీటిని గురించి కూడా చదువుతారు.

6. పాపులర్ బ్లాగర్ గా పేరు తెచ్చుకొన్న వారి టపాలకి minimum guarantee ఉంటుంది, సూపర్ స్టార్ ల సినిమాల కి మినిమం కలెక్షన్లు వచ్చినట్లు గా (సూపర్ స్టార్ బ్లాగర్ ల కి , ఈ టపా లో చెప్పిన మెజారిటీ విషయాలను పాటించటం వలన ఆ స్టార్-డం వస్తుంది.)

7.తెలుగు బ్లాగ్లోకం అసలు తెలుగు లోకానికి ఒక sample లాంటిది. ఐతే, ఇక్కడ చదువు కొన్నవారు ఎక్కువ.  కాబట్టీ, అసలు తెలుగు లోకం లో జనాదరణ ఉన్న చాలా విషయాలకి బ్లాగ్ లోకం లో కూడా జనాదరణ ఉండే అవకాశం ఎక్కువ.  ఉదహరణకి సినిమా గాసిప్పులూ, క్రికెట్ కబుర్లూ,రాజకీయాలు. కాకపోతే, కొంచెం క్లాస్ సినిమాలూ, క్రికెట్ గురించి కొంచెంలోతైన విశ్లేషణలూ.

8. అసలు విషయం ఉన్న కథలూ, టపాలకి కూడా ఆదరణ ఎక్కువ.

9. రేటింగ్స్ ఎక్కువ వచ్చిన టపా కి కామెంట్సూ, హిట్సూ ఎక్కువ వస్తాయని చెప్పనవసరం లేదు కదా?

10. అమ్మాయిల బ్లాగులకి (వయసు మళ్ళిన అమ్మాయిలు కాదండీ) అబ్బాయిల బ్లాగుల కన్నా కొంచెం రద్దీ ఎక్కువ. ఎందుకో చెప్పనవసరం లేదు.

11. నాలా “వేసినటపానే జనాలు చదివే వరకూ మళ్ళీ వేయటం” వలన వాటిని ఎక్కువ మంది చదివే అవకాశం ఎక్కువ.

12. తెలుగు బ్లాగులు చదివే వారిలో చాలా మంది తమ సొంత బ్లాగులు కూడా నడుపుతారు. దీనిలో నాకు కొంత conflict of interest కనపడుతుంది. దీని వలన పక్కవాడి టపా బాగున్నపటికినీ, మన మొదటి అభినందన కొంత ఆలశ్యం అవ్వవచ్చు.

13. పై పాయింట్ వలన, ఒక్క సారి పక్కవాడి టపా ని మెచ్చుకొంటే, తరువాత అతను మన టపా ని మెచ్చుకొంటాడు. ఈ రకం గా పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు. ఇక సామాజిక వర్గాల పరం గా, అభిప్రాయాలూ, సిధ్ధాంతాల పరం గా,లింగపరం గా, ప్రాంతపరం గా,ఊరి పరం గా,వయసు పరం గా ఏర్పడే గ్రూప్ ల సంగతి చెప్పనవసరం లేదు. ఈ గ్రూపుల్లో ఉంటే కామెంట్స్ వలన బ్లాగ్ పాపులారిటీ పెరుగుతుంది.

14.టపా వేసే టైం ని బట్టి కూడా టపా కి స్పందనలు ఉంటాయి. ఏ అర్ధ రాత్రో, సంకురాత్రి రోజో వేసే టపా ని ఎవరు చదువుతారు, చెప్పండి?

ఇక కామెంట్లూ, హిట్స్ విషయానికి వద్దాం.
1.టపా పేరు ఆసక్తికరం గా ఉంటే, హిట్స్ ఎక్కువగా ఉంటాయి.
2. టపా లో జనాలను ఆకట్టుకొనే విషయం ఉంటే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి.
3. వారాంతాలలో కామెంట్స్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పాఠకులకి తీరిక ఎక్కువ గా ఉండటం వలన అనుకొంటా!

4. ఇతరుల టపాలకి కామెంట్స్ పెట్టని వాళ్ళ టపాలకి కామెంట్స్ వచ్చే అవకాశం తక్కువ కదా!

5. కామెంట్స్ ఎక్కువ వచ్చిన టపాకి ఇంకా ఎక్కువ కామెంట్సూ, హిట్సూ వస్తాయి (courtesy: maalika,koodali comments section), హిట్ టాక్ వచ్చిన సినిమాకే ప్రేక్షకులు వెళ్ళినట్లు. (కాకి రెట్టేసినట్లు “good”, “interesting” అని కామెంటేసి మళ్ళీ తిరిగి చూడని వారి కామెంట్లు దీనికి మినహాయింపు.)
6. కొన్ని niche బ్లాగులు చదవటానికి ఆయా విషయాలలో పాండిత్యం అవసరం. వాటికి, సత్యజిత్ రే, సినిమాలకి ఉన్నట్లు, niche రీడర్స్ ఉంటారు.

7. కామెంట్లు రాసిన వారికి కొంచెం మర్యాద చేస్తే వాళ్ళు మళ్ళీ కామెంటుతారు.  మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి. దానికి response రాదు. ఎందు కంటారు? బడుగు జీవుల మాటలను ఎవరైనా పట్టించుకొంటారా?

పైన చెప్పిన సూత్రాలు కాకుండా మీకు ఏమైనా తోస్తే, కామెంటండేం? పైన చెప్పిన విషయాలు తప్పయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అలా భావిస్తే నిర్మొహమాటం గా చెప్పేయండి.

PS: బ్లాగు చర్చల్లోని అభిప్రాయాలనూ, వాదాలనూ, రాతలనూ, ఆవేశ కావేశాలనూ సీరియస్ గా తీసుకొను వాడు “దున్నపోతై పుట్టున్!”. ఎందుకంటారా? చూడుడు: ఈ టపా లో మొదటి పాయింట్.బ్లాగర్లకు రాజకీయ నాయకులకు ఉన్నంత విశ్వసనీయత కూడా ఉండదు.రాజకీయ నాయకులైతే వారి పేర్లు తెలుస్తాయి. వారి  ఊరు ఏమిటో తెలుస్తుంది. దీని వలన వారు కొంచెం (చాలా కొంచెం)బాధ్యత గా ఉండాల్సి వస్తుంది. మారు పేర్ల వెనుక దాకునే ఊరు లేని బ్లాగర్లకి ఈ మాత్రం విశ్వసనీయత కూడా ఉండదు.