తెలుగు భాష ఎందుకు అంతరించిపోబోతోంది?

తెలుగు భాష – RIP

—————————————————————————————————————–

ఓ టీవీ చానల్ లో ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు ఎంత సేపు మాట్లాడగలరు అనే విషయం పై ఓ పోటీ జరుగుతోంది.
అందులో ఏ ఒక్కరు కూడా పట్టుమని పది సెకండ్లు కూడ మాట్లాడ లేకపోయారు.
ఆ ప్రోగ్రాం చూసి ఓ ఇద్దరు మిత్రులు చర్చించుకొంటున్నారు:
రామాయ్: పరిస్థితి ఈ రకం గా ఉంటే కొన్నాళ్ళ కి తెలుగు భాష అంతరిచిపోతుందేమో అని భయం గా ఉంది.
కిట్టాయ్: ఏమీ దిగులు అవసరం లేదు. పరిణామమనేది అన్ని భాషలకూ సహజం. ఒక భాష అనేది ఇతర భాషలలోని పదాలను కలుపుకొని పోతే నే ఆ భాష పరిపుష్టమౌతుంది.ఇంగ్లీషుని చూడ రాదూ, ప్రపంచం లోని అన్ని భాషల పదాలనూ తన లో కలుపుకొని ఎలా వృధ్ధి చెందినదో!  ఓ విధం గా చూస్తే ఇతర భాషల లో ని పదాలు చేర్చుకొనని భాష మృత భాష అవుతుంది. అది వాడుకలోంచీ పోతుంది.
రామాయ్: కిట్టాయ్, నువ్వు చెప్పే విషయాలన్నీ నిజమే!  కానీ, అవేమీ తెలుగు కి వర్తించవు. ఇంగ్లీషు భాష ప్రపంచాన్నేలే క్రమం లో కొన్ని ఇతర భాషల పదాలను కలుపుకొని పరిపుష్టమయింది. కానీ తెలుగు భాష ప్రపంచాన్ని ఏలటం లేదు. అధికారం డబ్బు ల ప్రవాహం వలన తెలుగు భాష విస్మరించబడుతోంది.
ఒక భాష వృధ్ధిలో కి వచ్చే క్రమం ఇలా ఉంటుంది:
1. మొదట కొద్ది మంది మాట్లాడే నోటి భాష గా మొదలవుతుంది.
2. తరువాత పరిధి విస్తృతమై, జనాల ఆలోచనలలో ఆ భాష కు భాగం ఏర్పడుతుంది. ఈ స్థితి లో అలిఖిత మైన పాటలూ, కథలూ సృష్టించబడతాయి.
3. ఆ పై ఆ భాష అక్షర బధ్ధమై, ఆ భాష లో లిఖిత వాంజ్మయం సృష్టించబడుతుంది.
4. శాస్త్ర సాంకేతికాలలో ఆ భాష స్థానం సంపాదించుతుంది.
5. ఇతర భాషలను ప్రభావితం చేసి, తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది.
6. ఆ భాష సమాజం లోని ప్రజల రోజు వారీ మనుగడకి అవసరం కాబట్టీ, దీర్ఘ కాలం వర్ధిల్లుతుంది.
తెలుగు భాష కు పైన చెప్పిన ఐదో పాయింట్ వర్తించదు కాక వర్తించదు. ఇంగ్లీషు భాష ను తెలుగు కలుపుకొని పోవటం లేదు. ఇంగ్లీషు భాషా ప్రవాహం లో తెలుగు కొట్టుకొని పోతోంది.
అదే ఇంగ్లీషు భాషని తీసుకొంటే పైన చెప్పిన 5,6 స్టేజీ ల లో ఉన్నట్లు స్పష్టమౌతోంది.

ఇక, ఓ భాష అంతరించిపోబోయే క్రమం పైన చెప్పిన క్రమానికి సరిగ్గా వ్యతిరేకం గా  ఇలా ఉంటుంది.
1. మొదట ఆ భాష ను ఉపయోగించి మనుగడ సాగించటం కష్టమౌతుంది.
2. ఆ భాషను వదిలి మనుగడ కోసం వేరే భాషల ను నేర్చుకొనటం వలన, వేరే భాషల అజమాయిషీ ఆ భాష పై ఎక్కువవుతుంది.
3. నెమ్మది గా శాస్త్ర సాంకేతికాల నుంచీ ఆ భాష కనుమరుగౌతుంది.
4. ఆ భాష లో ఉండే సాహిత్యాదులు దిగ నాసిల్లటం మొదలౌతుంది.
5. జనాలు ఆ భాషను వదిలి, ఆలోచన చేయటానికి కూడా ఇతర భాషలను ఆశ్రయిస్తారు.
6. ఆ భాషలో రాయటం అంతరిస్తుంది.
7. ఆ భాషని చదవటం, ఆ తరువాత మాట్లాడటం మానేస్తారు.

తెలుగు, మొదట చెప్పిన ఆరు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా, లేక తరువాత చెప్పిన ఏడు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా?   తరువాతి ఏడు పాయింట్ల క్రమాన్ని అనుసరిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే తెలుగు అంతరించిపోయే దిశ లో అడుగులేస్తోందన్న మాట.అంతరించటం ఖాయం, “ఎప్పుడు అంతరిస్తుంది?” అన్నదే ప్రశ్న. అన్ని భాషలూ, పది వేల ఏళ్ళ కో, నలభై వేల ఏళ్ళ కో, ఎప్పుడో అప్పుడు అంతరించేవే. కానీ, తెలుగు, సమీప భవిష్యత్తులోనే అంతరించబోతోంది.
ప్రస్తుతానికి యువ తరం లో చాలా మందికి తెలుగు లో రాయటం రాదు. ఇంకొంతమందికి చదవటం రాదు, ఇంగ్లీషు పదాలు లేకుండా మాట్లాడటం రాదు. పట్నాలలో ఉండే చాలా మంది ఆలోచించటం కూడా ఇంగ్లీషులోనే చేస్తున్నారు. తెలుగు భాషలో గత కొన్ని దశాబ్దాలు గా వచ్చిన గొప్ప రచనలు కనపడటం లేదు.  ఇక ముందు పరిస్థితి ఇంకా దిగజారబోతోంది అని తెలుస్తూనే ఉంది. తెలుగు భాషా, సంస్కృతీ ప్రమాణాలు నానాటికీ దిగజారే దిశలోనే వెళ్తున్నాయి. అదే ఆంగ్ల భాష ని తీసుకొంటే, ఆ భాషలో ఇంకా ముందు ముందు ఆధునిక సాహిత్యమూ, సాంకేతిక గ్రంధాలూ వెలువడతాయని చెప్ప వచ్చు. ప్రపంచం లో ఇంకా ఎక్కువ మంది ఆ భాషని నేర్చుకోబోతున్నారని చెప్పవచ్చు. తెలుగు భాష గురించి అలా చెప్ప గలమా? తెలుగు భాష పైన చెప్పిన 7 వ పాయింట్ దిశ గా వేగం గా అడుగులు వేస్తోంది. ఈ స్థితి ని “పైన చెప్పిన ఏడు పాయింట్లకీ పైన ఉన్న”, ఆరు పాయింట్ల లో, ఐదవ పాయింట్(తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది) తో పొరపడటం, భ్రమల లో కాలం గడపటమే! తెలుగు ఇంగ్లీషుని కలుపుకొని పరిపుష్టమౌతోందనుకోవటం, మధ్య తరగతి ఉష్ట్ర పక్షులు తమ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి చేసుకొనే ఓ ఆత్మ వంచన మాత్రమే. వాస్తవాన్ని ఎదుర్కొనటానికి ఒప్పుకోని ఒక  బాధ్యతానిరాకరణ మాత్రమే!
కిట్టాయ్: బాగా పొడుగుగానే ఉపన్యాసం ఇచ్చావు కానీ, ఇంతకీ తెలుగు భాష అంతరించకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో నువ్వే చెప్పు.
రామాయ్: భాష అంతరించటం లేక వృధ్ధి చెందటం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఒక భాషని, అది మాట్లాడే జనాల మద్దతు లేకుండా బలవంతం గా బ్రతికించటం చాలా కష్టం. ప్రయాణాన్ని మొదటి అడుగుతో మొదలు పెట్టినట్లే, రిపేరీ ని కూడా పైన చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిదైన మనుగడ తో మొదలుపెట్టాలి. ఓ భాష మాట్లాడటం వలన మనిషి మనుగడ పెరిగితే ఆ భాష వృధ్ధి మొదలౌతుంది. ప్రభుత్వాలు ఆ దిశలో చట్టా లు చేయాలి. మేక మీదికి లంఘించిన పులిలా ఇతర భాషలను తింటున్న పరాయి భాష (English)ని నిషేధించాలి.ఇది మరీ “అతి” అనవద్దు. తీవ్రమైన పరిస్థితులలో తీవ్రమైన పరిష్కారాలే అవసరమౌతాయి.   ఇతర భాషలను నేర్చుకోవటాన్ని నిషేధించకపోయినా, వ్యవహారం లో వాటి వాడకాన్ని నిషేధించాలి.తెలుగు భాషలోని ఆంగ్ల పదాలను నెమ్మది గా ఏరి వేయాలి.  ఎందుకంటే పరిస్తితి చాలా తీవ్రం గా ఉంది. నిషేధా నికి తక్కువైన ఏ చర్య ను ఐనా  సమర్ధించే ప్రజల, ప్రభుత్వాల (మన భాషను నిలబెట్టటం లో ఉన్న) చిత్తశుధ్ధిని శంకించాల్సి వస్తుంది. లేక వారివి పై పై కాలక్షేపపు మాటలు అనుకోవలసి వస్తుంది.  లేక అర్ధం లేని అమాయకపు ఆశావాదం అనుకోవాల్సి వస్తుంది.  ఇంకా మన పిల్లల ను విధి గా  తెలుగు మాధ్యమం లో చదివించాలి.

కిట్టాయ్: మరి ఒకప్పుడు సంస్కృతం కూడా, ఇప్పటి ఇంగ్లీషులా తెలుగు ని ప్రభావితం చేసినదే కదా? అలానే ఉర్దూ…. ఏ భాష అధికారం లో ఉంటే ఆ భాష ప్రభావం సహజం అనుకొంటా.
రామాయ్: సంస్కృతం వంటి భాషలు, ఇంగ్లీషులా, ఎప్పుడూ ఎక్కడా బజార్లలో వాడబడలేదు.సంస్కృతం, ఉర్దూ భాషల ప్రభావం ఉన్నా, జనాలెపుడూ ఆయా భాషలలో ఆలోచించలేదు.  కానీ, ఈ రోజు అనేక మంది పట్నపు జనాలు ఇంగ్లీషులోనే ఆలోచిస్తున్నారు. వారికి తెలుగు లో ఆలోచించటం రాదు. ఓ భాష చనిపోవటానికి ఇది ముఖ్యమైన ముందు శకునం.
కిట్టాయ్: మొత్తానికి తెలుగు భాషని బతికించాలని పెద్ద పెద్ద కలలే కంటున్నావు, ప్రభుత్వ బళ్ళ లోనే ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతూ ఉంటే, ఇంకా ఇవన్నీ అయ్యే పనులేనా? ఆ..ఈ తెలుగు  ఛానల్ మార్చి,  స్టార్ టీవీ పెట్టు “బోల్డ్ అండ్ బ్యూటిఫుల్” వస్తుంది.

తా.క. :  ఈ టపా నేనే రాసిన ఓ ఇంగ్లీషు వ్యాసాన్ని నేనే తెలుగు లోకి అనువాదం చేసుకోలేని స్థితి లో నాలో నాపై కలిగిన ఓ ఆక్రోశానికి ఫలితం.