ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా….

   ఓ.. ఓ.. ఓ.. ఓ.
సాకీ. కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
| కల్లా కపటం |

ప.      ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చ.      నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
ముల్లుగర్ర నువు చేత బట్టుకుని
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని
| ఏరువాకా సాగారో |

చ.      పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు గురిసె
| పడమట దిక్కున |

వాగులు వంకలు వురవడి జేసె
ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసె
| ఏరువాకా సాగారో |

చ.      కోటేరును సరిజూసి పన్నుకో
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలు తప్పక కొంద వేసుకో
యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో
| ఏరువాకా సాగారో |

చ.      పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులొ మేడలు కట్టేవారు
బ్యాంకులొ డబ్బు దాచేవారు
ఈ శక్తిని గమనించరు వారు
| ఏరువాకా సాగారో |

చ.      పల్లెటూళ్ళలో చెల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు
| ప్రజాసేవయని |
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు
| ఏరువాకా సాగారో |

చ.      పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే
ఓట్లు గుంజి నిను మరచేవాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవో
| నీవే దిక్కని |

రోజులు మారాయ్! రోజులు మారాయ్!
మారాయ్! మారాయ్! రోజులు మారాయ్!
| ఏరువాకా సాగారో |


“రోజులు మారాయ్”, సినిమా లోని ఈ పాట లో, వహీదా రహమాన్ నర్తించింది. ఆమె మొదటి screen appearance కూడా.ఈ పాట లో ఆమె హావ భావాలు కొంచెం అతి (exaggerated) గా ఉన్నా, ఆ రోజులలో పబ్లిక్ లో డాన్స్ చేసేవాళ్ళు అలానే హావ భావాలు చూపించేవారనుకొంటా! ఈ పాట చాలా popular. ఇందులో ప్రకృతి వర్ణన, వాతావరణ చిత్రణ, రాజకీయ విసుర్లు, సామాజిక చింతన,వ్యవసాయ దారుల పట్ల అభిమానం, అన్నీ ఉన్నాయి. అయినా, దీని లోని కొన్ని పదాల అర్ధం చాలా మందికి తెలియదనిపించి ఈ పోస్ట్ రాస్తున్నాను.


కల్లా కపటం కానని వాడా

లోకం పోకడ తెలియని వాడా

మిగతా సమాజం తో పోలిస్తే, రైతు ఇప్పటికీ ఇలానే ఉన్నాడు.


 

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా

>  ఏరువాక కి సాగరో , అని రైతుని ఉత్సాహపరుస్తున్నట్లు గా ఉంది.ఏరువాక పౌర్ణమి (జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి-సుమారు గా జూన్ లో వస్తుంది) నుంచీ రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టే వారు . ఆరోజు ఒక చిన్న ఉత్సవ సభ పెట్టి,ఎడ్లకు పూజ చేసి, తరువాత పనులు మొదలు పెట్టే వారు. దీనిని మామూలు జనాలు “ఈరా పౌర్నం”, అనటం నా చిన్నప్పటి జ్ఞాపకం.


నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

పాటలోని ఆశావాదం ఎలా ఉన్నా, వాస్తవం లో కష్టమంతా పెరిగిపోయింది.


నవధాన్యాలను గంపకెత్తుకుని

కొసరాజు మెట్ట వ్యవసాయం గురించి రాసినట్లున్నారు. మాగాణి వ్యవసాయం లో వరివిత్తనాలనే తీసుకొని వెళ్తారు. అప్పటికి అప్పికట్ల లో కాలువలు రాలేదేమో!


చద్ది యన్నము మూటగట్టుకుని

పొలానికి పొద్దున్నే బయలుదేరేవాడు రైతు. అప్పటి కట్టెల పొయ్యిలో పొద్దున్నే భోజనం సిధ్ధం చేయలేరు కాబట్టీ, రాత్రి వండిన అన్నమే మూటగట్టుకొనే వాడు.


ముల్లుగర్ర నువు చేత బట్టుకుని…ములుగర్ర వేరు, చర్నాకోల వేరు. చర్నా కోలకు చివర తాడు ఉంటుంది

 


ఇల్లాలును నీ వెంటబెట్టుకుని


పడమట దిక్కున వరద గుడేసె

మనకి నైఋతీ ఋతు పవనాలతో వర్షాలు మొదలవుతాయి. అవి పడమటి దిక్కునుంచీ వస్తాయి. కాబట్టీ చంద్రుడి చుట్టూ వరద గుడి పడమటి దిక్కులో వేస్తుంది.దీనినే “చంద్రుడి చుట్టూ గూడు కట్టింది”, అని కూడా అంటారు. వరద గుడి అంతే తెలియని వారికోసం ఇక్కడ: వరద గుడి


ఉరుముల మెరుపుల వానలు గురిసె

వాగులు వంకలు వురవడి జేసె


ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసె


కోటేరును సరిజూసి పన్నుకో…… కోటేరు అంటే నాగలి. నాగలి కర్ర ముక్కు దూలం లా ఉంటె, నాగలి ముక్కు (నక్కు, పలుగు), వంపు తిరిగి నాసికాగ్రం లా ఉంటుంది. అందుకే కోటేరు లాంటి ముక్కు అంటారు.

నాగలిని కాడికి సరిగ్గా మధ్య లో కట్టాలి..


యెలపట దాపట యెడ్ల దోలుకో

ఎలపటెద్దు – కుడి చేతి వైపు ఉండే ఎద్దు.
దాపటెద్దు- ఎడమ చేతి వైపు ఉండే ఎద్దు.


సాలు తప్పక కొంద వేసుకో

నాగటి చాలు లో కొంద వేసుకోమంటున్నాడు…కొంద అంటే ఏమిటో తెలియదు. చాలు లో కొంత విత్తనం వేసుకోమంటున్నాడా..?


యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో


  పొలాలమ్ముకుని పోయేవారు

  టౌనులొ మేడలు కట్టేవారు

  బ్యాంకులొ డబ్బు దాచేవారు

   ఈ శక్తిని గమనించరు వారు

……. కానీ వాళ్ళే బాగుపడ్డారు.  ఆ సినిమా తీసిన వాళ్ళూ, రాసిన వాళ్ళూ అందరూ ఇలాంటోళ్ళే . ఎవరికి తగ్గ పని వాళ్ళు చూసుకోవాలి గా..


         పల్లెటూళ్ళలో చెల్లనివాళ్ళు

         పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు

         ప్రజాసేవయని అరచేవాళ్ళు

         ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు

……చాకిరి చేయకపోతేనేం, పైరవీ ల లో చాకిరీ చేసి పైకెదిగారు.


        పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే

         ఓట్లు గుంజి నిను మరచేవాళ్ళే

         నీవే దిక్కని వత్తురు పదవో

         రోజులు మారాయ్! రోజులు మారాయ్!

         మారాయ్! మారాయ్! రోజులు మారాయ్!

…… పాపం అప్పుడు మారాయ్ అనుకొన్నాడు. ఇ ప్పటి దాకా మారలేదు.

A bit more about the song is here: http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/her-big-ticket-to-stardom/article17534519.ece

The song itself is here (Telugu):

Inspired by this Telugu song:

In Tamil :

Another Tamil Song (MGR Movie):

In Hindi:

Another Hindi: