చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?

ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..

మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి  ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి.  అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి.  కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది.  వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్.  అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.

ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).

మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు  దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్.   వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!