విశ్వపరిణామం లో నియమాలు, శాస్త్రవేత్తల దేవుడు

“ఐన్ స్టీన్” మహాశయుడు “హైజెన్ బర్గ్” యొక్క అనిశ్చితి సిధ్ధాంతం గురించి, “దేవుడు పాచికలు వేయడు”, అని అన్నట్లు చెబుతారు. ఇక్కడ “ఐన్ స్టీన్” మాట్లాడేది ఆస్తికుల దేవుడి గురించి కాదనీ, విశ్వం లోని నియమాలనే ఐన్ స్టీన్ దేవుడి గా పరిగణిస్తున్నాడనీ తరువాత ఆయన వ్యాఖ్య కు భాష్యం చెప్పడమైనది.
విశ్వ నియమాల సంగతి కొస్తే..
విశ్వం యొక్క రహస్యాల గురించి ఆలోచించే వారు అడిగే రెండు ప్రశ్నలు
1.”ఫలానా విషయం ఎలా జరుగుతుంది?”
2.”ఫలానా విషయం ఎందుకు జరుగుతుంది?”
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రక్రియ లో శాస్త్రవేత్తలు ప్రకృతి ని పరిశీలించి పరిశోధిస్తారు. ఈ పరిశోధనలో విశ్వం పని తీరుని తెలిపే అనేక సూత్రాలూ, నియమాలూ పుడతాయి. ఇవన్నీ విశ్వం యొక్క స్వభావాన్ని విశదీకరించేవే.
“ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్న కి సైన్స్ ఎలాగొలా తంటాలుపడి సమాధానం చెప్తుంది. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం.(ఇక్కడ ఎందుకు అంటే “ప్రయోజనం లేక పర్ పస్ ఏమిటి?” అని కాదు. ప్రయోజనాలు మనుషులకూ జీవులకూ ఉంటాయి. ఏ వ్యక్తిత్వమూ లేని విశ్వానికి ఒక పర్పస్ ఉండదు).
ఎందుకు విశ్వం ఇలానే ఉంది? ఎందుకు వేరే సవా లక్ష విధాలుగా లేదు? గురుత్వాకర్షణ ఎందుకు ఉంది? ఎలెక్ట్రాన్లూ ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ అలానే ఎందుకు ఉన్నాయి..? ఉదాహరణ కు న్యూట్రాన్లు ప్రోటాన్లచుట్టూ ఎందుకు తిరగవు..? మొదలైన ప్రశ్నలు ఈ “ఎందుకు?” ప్రశ్నలు. వీటన్నిటికి విశ్వం “ఎలా” మొదలైంది అన్న ప్రశ్న లో సమాధానం ఉండవచ్చు. ప్రాధమిక స్థాయిలో “ఎందుకు?” అనే ప్రశ్నకు, ఉన్నత స్థాయి లో “ఎలా?” అనే ప్రశ్న సమాధానం ఇస్తుంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ, శాస్త్రవేత్తలు ప్రాధమిక స్థాయిలో ఒక నియమాన్ని కనిపెడతారు. తరువాత ఈ నియమం ఎందుకు అలానే పని చేస్తుంది అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం గా ఉన్నత స్థాయి లో ఎక్కువ సార్వజనీన మైన ఇంకొక నియమం వెలుగులోకి వస్తుంది. ఈ నియమాల స్థాయి పెరుగుతూ పోయి ఏ బిగ్ బాంగ్ అనబడే ఎయిర్ పోకెట్ కో కొట్టుకొని ఆగిపోతాయి.

ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెబితే బాగా అర్ధమవ్వ వచ్చు..
“మనిషి కి ఆలోచనా శక్తి ఎందుకు ఉంది?” అనేది ఒక ప్రాధమిక ప్రశ్న.
“జీవపరిణామం లో భాగం గా ఏర్పడింది”- జవాబు.
“జీవపరిణామం ఎందుకు జరిగింది?”
“అనేక కారణాలు..క్లుప్తం గా..యాదృచ్చిక జన్యమార్పుల వలన జరిగింది”
“జన్యు మార్పులు ఎందుకు జరుగుతాయి?”
“అనేక విధాలు..సూర్య రశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు జన్యు పదార్ధాన్ని ప్రభావితం చేయటంవలన జన్యు మార్పులు జరుగుతాయి”
“సూర్య రశ్మి వలన జన్యువులు ఎందుకు మారుతాయి?”
“స్థిరత్వం కోసం. స్థిరత్వం అనేది ఈ విశ్వ నియమం కదా!”
“స్థిరత్వమే ఎందుకు ఈ విశ్వ నియమం అయింది. అస్థిరత్వం ఎందుకు ఈ విశ్వ నియమం కాలేదు?”
“నీ తలకాయ! అడ్డగోలు గా మాట్లడకు. నీ చొప్పదంటు ప్రశ్నలూ..నువ్వూ..!”.

పైన ప్రశ్నలన్నీ “ఎందుకు” ప్రశ్నలే. ఈ ఉదాహరణ లో, దిగువ స్థాయి లో ఎందుకు ప్రశ్నలకి పై స్థాయి లో “ఎలా పనిచేస్తుందో చెప్పటం” ద్వార జవాబు ఇవ్వటం గమనించ వచ్చు. “సృష్టి అలానే ఎందుకు ఉంది?, ఇంకా అనేక విధాలుగా ఎందుకు లేదు?” అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం రావటం లేదు. “సృష్టికి సంబంధించిన పై స్థాయి నియమం సృష్టి ఇతరమైన అనేక విధాలు గా ప్రవర్తించటాన్ని నిరోధిస్తోంది”, అనే ఒక విషయం మాత్రం పరోక్షం గా అర్ధమౌతోంది. కాబట్టీ ఈ “ఎందుకు?” కి అసలైన సమాధానం కోసం మనం “మనిషి తెలివి” నుంచీ బిగ్ బ్యాంగ్ వరకూ పోవలసి వచ్చింది. కానీ “ఈ ప్రపంచం ఈ నియమాల ద్వారానే ఎందుకు నడుస్తోంది?”, అన్న ప్రశ్న కు సమాధానం దొరక్లేదు. కొంచెం పై స్థాయి లో చూస్తే, ఈ నియమాలన్నీ విశ్వాన్ని కొంచెం మెరుగు గా వర్ణించే వివరణలే! ఈ విశ్వం ఎందుకు ఉంది అనే ప్రశ్నకు సమాధానాలు కావు. “ఈ నియమాల ప్రకారమే విశ్వం ఎందుకు పని చేయాలి?”, అనే ప్రశ్నకు సమాధానాలు అసలే కావు.చివరికి ఏ నియమాలూ పని చేయని సింగులారిటీ(బిగ్ బ్యాంగ్ ఆది స్థితి) కి చేరుకోవలసి  వస్తుంది!

చివరిగా, “విశ్వం ఏమీలేని స్థితి నుంచీ పుట్టింది” అని ఈ మధ్య కాలం లోని కొందరు శాస్త్రవేత్తల వాదన. ఎందుకంటే “సం థింగ్” అనేది “న థింగ్ కంటే” స్థిరమైనది అట. ఏమీ లేని “న థింగ్” లో స్థిరత్వం అనే నియమం మాత్రం ఎందుకు ఉంటుంది? ఒక వేళ అటువంటి నియమం ఉంటే, అది ఎందుకు ఉంది  ( ఎవరో ఆ నియమాన్ని శాసనం చేసినట్లు)? ఏమీ లేని స్థితి లో, “స్థిరత్వం నుంచీ ఇంకా అస్థిరత్వం వైపుకి పోవచ్చు కదా?” ఏమీ లేని స్థితి స్థిరమైనది ఎందుకు కాదో, ఏదో ఉన్న స్థితి ఎందుకు స్థిరమైనదో ఈ శాస్త్రవేత్తలు చెప్పరు. “తాడు దొరికింది గేదేను కొనమన్నట్లు”, స్థిరత్వ సిధ్ధాంతం ఉంది కాబట్టీ దానిని సృష్టి జననానికి అన్వయించినట్లుంది.

నాకు వచ్చిన ఈ సందేహాలలో కొన్నైనా తప్పు అయే అవకాశం ఉంది. తప్పు అయితే అదేమిటో వివరిస్తారు కదా?