బ్రహ్మాది పిపీలిక పర్యంతం (గల్పిక)

బ్రహ్మాది పిపీలిక పర్యంతం (గల్పిక)….అన్యార్ధ కధ

—————————————————————————————————————————-
అనగనగా సత్య యుగం లో ఆదిశంక అనే చీమ తన ‘తర్కవల్మీకం’ అనే పుట్ట లో తన భార్యా పిల్లలతో సుఖం గా ఉండేది. గట్టు మీద ఉన్న పుట్ట పక్కనే ‘భవం’ అనే నది పారుతుండేది. ఆ చీమలన్నిటికీ ఆ పుట్ట, దాని ముందు నదిలోని నీళ్ళూ, ఇవే ప్రపంచం. వాటి జీవితం లో వేరే ఏ ప్రదేశాన్నీ అవి చూసి ఉండలేదు.

మామూలు గా ‘పడతి చిక్కిన నడుము లా ఉండే ‘భవం’ కి వరద వచ్చి, పుట్ట పాదాల వరకూ నీరు చేరింది. ఆదిశంక కు భయం వేసింది.మిగిలిన చీమలు వెనుకనుంచీ చూస్తుంటే, ఆదిశంక నీటిలో తన కాలిని పెట్టి నీటి స్వభావం ఏమిటా అని పరీక్షించింది.తామెవరూ చేయలేని పని చేయగలిగినందుకు, మిగిలిన చీమలు ఆదిశంక వైపు వినమ్రతతో చూశాయి.

ఆదిశంక మొదట, “ఈ నది తన పుట్టని ముంచి వేస్తే పరిస్థితి ఏమిటా?” అని భయపడింది. కానీ, రెండు రోజుల్లోనే వరద తగ్గి నీరు వెనుకకు మళ్ళింది. కానీ చీమ ఆలోచనలు మాత్రం వెనుకకు మళ్ళలేదు. పుట్టలోపలి ‘తత్వం’ అనే మూలలో ‘చింతన’ అనే ఎండుటాకు మీద కూర్చొని, ఆలోచించసాగింది.

“ఈ నది ఎక్కడినుంచీ వచ్చింది? ఎలా వచ్చింది? భవం మొదలు ఏంటి? ఈ నది నీటితోనే మొదలైనదా? లేక పుట్టలా మట్టి తో మొదలైనదా? ఒక వేళ ఈ పుట్టలా మట్టి తో మొదలైతే, మట్టి నీరులా ఎలా మారుతుంది? అసంభవం కదా? సరే నది నీటి తోనే మొదలైతే ఆ నీరు ఎలా వచ్చింది. అంటే నది మొదలుకి ముందు నీరు ఉండాలి కదా? ఆ నీటి కి ముందు ఇంకా నీరు ఉండాలి కదా..చూడబోతే ఈ నదికి కి జన్మ స్థానం ఉండటం అసంబధ్ధం గా తోస్తున్నదే..! ఈ నది ఎక్కడ అంతమౌతుంది? నది పుట్టుక లానే, అంతం కూడా ఒక చిక్కువీడని ప్రశ్నే కదా..!ఈ నది కి ‘ఆది’ ఎలా లేదో ‘అంతం’ కూడా అలానే లేదనుకుంటా..? అలానే, నదికి ఆవలి ఒడ్డు కూడా, నా చీమ కంటికి లీలా మాత్రం గా కనపడుతుంది కానీ,ఆ ఒడ్డు నిజం గా అలా లేదనుకొంటా..! ”
ఈ ఆలోచనల తోనే చీమ ముసలిదైపోయింది. చనిపోయే ముందు ఆ చీమ తన సంతానాన్ని పిలిచి తన ఆలోచనలన్నిటినీ వారితో పంచుకొన్నది. ఆదిశంక పట్ల ఎంతో గౌరవం కల ఆ చీమలు, ఆ ఆలోచనలను జాగ్రత్త గా తమ మది లో నిక్షిప్తం చేసుకొన్నాయి. ఆ ఆలోచనలను తమ ముందు తరాల చీమలకి అందించటం మొదలుపెట్టాయి.

నది లోకి రక రకాల కొత్త నీరు వస్తూ ఉంది వెళ్తూ ఉంది. పుట్ట లో తర తరాల చీమలు జనిస్తున్నాయి, గతిస్తున్నాయి. యువ పిపీలికం ‘నవశంక’ తరం రానే వచ్చింది. అప్పటికి ఆదిశంక ఆలోచనలు పుట్టపైని ఎండుగడ్డి పరకలపై గ్రంధస్థమై పోయి ప్రామాణికాలుగా నిలిచాయి. ఆదిశంక ని గొప్ప రిషి గా భావించి, ‘శ్రీ శ్రీ ఆది శంక’ గా కీర్తించ సాగారు పుట్ట జనులు. కానీ, చీమలకి మాత్రం ఇప్పటికీ ఆ పుట్టే లోకం.
ఒకానొక రోజు నవశంక మీమాంసా విలోలుడై నదిలోకి చూస్తుండగా, ‘ఛాందసి’ అనే పాము పుట్టలోకి ప్రవేశించటానికి ప్రయత్నించసాగింది. పామునుంచీ ఎలా తప్పించాలా అని నవశంక సంశయిస్తుండగా, ‘ప్రశ్నం’ అనే గద్ద, ఆ పాము ని తన గోళ్ళ తో పట్టుకొని, దూరం గా వదిలి వేసింది.

పాము నుంచీ తన వల్మీకాన్ని కాపాడినందుకు నవశంక , ప్రశ్నం కి తన కృతజ్ఞత తెలిపాడు. అప్పటి నుంచీ గద్దా చీమా మంచి మిత్రులైపోయారు.ఓ రోజు గద్ద నవశంక ను తన రెక్కలపై కూర్చోపెట్టుకొని ఆకాశ విహారం చేసింది. అక్కడికి కొంచెం దూరం లోని ‘భవం నది’ జన్మస్థానం కి కూడా తీసుకొని వెళ్ళింది. నది జన్మస్థానం చూసి చీమ ఆశ్చర్యపోయింది. అప్పటి దాకా తన పుట్ట తప్ప వేరే లోకం తెలియని చీమ, అక్కడి పర్వతాలను చూసి నమ్మలేకపోయింది. మొదట ఆ కొండలూ, వాటి మీది మబ్బులూ, ఆ వర్షమూ, జలపాతాలూ, పిల్ల కాలువలూ, అవన్నీ కలిసి నది గా ఏర్పడటమూ, ఇవన్నీ చూసి, అది ఒక మాయ ఏమో అనుకొంది. తమ మూల పురుషుడైన శ్రీ శ్రీ ఆదిశంక పిపీలికం ఊహించిన దానికి విరుధ్ధం గా, “నది కొండల మధ్య నుంచీ పుడుతుండనే”, విషయాన్ని జీర్ణించుకోక తప్పలేదు, నవశంక కి.

ప్రశ్నం చివరికి నవశంక ని పుట్టమీద వదిలి పెట్టి, తన దోవన తాను చక్కా పోయింది.

పుట్ట కి తిరిగి వచ్చిన నవశంక, పుట్ట వాసులకు నది కొండలలో పుడుతుందన్న విషయాన్ని వివరించటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. “తమ పుట్టకి కొన్ని కోట్లుపెద్దదైన పుట్ట” నుంచీ నది పుడుతుందని నవశంక చెప్పాడు. పుట్ట పురజనులలో ఒక కుర్ర చీమ, తమ పుట్ట మట్టి తో అంత పెద్ద పుట్ట ఉండటం అసాధ్యమనీ , అది కూలిపోతుందనీ నవశంక మాటలను తిప్పికొట్టింది. అప్పుడు నవశంక ఆ ‘మహా వల్మీకం’ (కొండను), మట్టి తో చేయబడలేదని చెప్పింది. పుట్ట లోని మట్టి తప్ప వేరే పదార్ధం తెలియని పుట్ట జనులు నవశంక మాటలను నమ్మ లేదు. పైగా, “శ్రీ శ్రీ ఆదిశంకా పిపీలికుడు కంటే నువ్వు గొప్ప వాడివా, ఆయనే నదికి ఆదీ అంతం లేదని చెప్పాడు”, అని నవశంక ను పరిహసించాయి.
నవశంక, “నేను ఆదిశంక గొప్పతనాన్ని ప్రశ్నించటం లేదు. ఆదిశంక తర్కం గొప్పదే. కానీ అప్పటికి ఆయనకు పరిజ్ఞానం అందు బాటు లో లేదు. అందువలన ఆయన శుధ్ధ తర్కం ఉపయోగించవలసి వచ్చింది. కానీ నాకు గద్ద తో ప్రయాణించటం వలన పరిజ్ఞానం లభించింది. పరిజ్ఞానాన్ని, తర్కాన్నీ కలిపితే జ్ఞానం పెరుగుతుంది. ఆదిశంక ఈ రోజులలో జీవించి ఉన్నట్లైతే ఆయన తర్కం, ఇప్పటి పరిజ్ఞానం ఉపయోగించి అద్భుతాలు చేసి ఉండేవాడు. పరిజ్ఞానం లేని తర్కం పరిమితమయినది”, అని వల్మీక జనులను సమాధాన పరచబోయాడు. కానీ కుర్ర పిపీలికం మాత్రం, “అయితే, నీ జ్ఞానం తో, కొండలు, వర్షమూ, మబ్బులూ ఎక్కడి నుంచె వచ్చాయో చెప్పు చూద్దాం”, అని తన్ తన ముంగాళ్ళను పెడసరం గా ఎత్తి నవశంక ను వెక్కిరించింది. నవశంక, “అవన్నీ తెలియాలంటే, ప్రశ్నం వాళ్ళ, స్నేహితుడు, ‘పుష్పకం’ అని ఒక అంతరిక్ష విహారి ఉంది. ఈ సారి అతని తో విహరించి, తరువాత నీ ప్రశ్న కు సమాధానం చెబుతాను అని పుట్టలోని తన మూల కు నిష్క్రమించింది.