వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.