వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.

26 thoughts on “వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన”

  1. సింపుల్‌గా చెప్పారు. ఈపాటి జ్ఞానం, మన్‌మోహన్ సింగ్, చిదంబరాలకు ఎందుకు లేదు? వాల్ మార్ట్ దభ్భుకు అమ్ముడుపోయారనే కదా?

    మెచ్చుకోండి

  2. నా అనుమానం వాళ్ళిద్దరూ కూడా మొహమాటానికి పోయి ఉంటారు. (not able to stand up for a seemingly small issue with mighty US. There may be benefits expected in other fields from US). లేక పోతే, వినియోగదారుల, మధ్యతరగతి దృక్కోణానికి కన్విన్స్ అయి ఉంటారు.

    మెచ్చుకోండి

  3. సంస్కరణ వీరులుగా వాల్‌మార్ట్ ఇచ్చే మెడల్స్‌కి కక్కుర్తి పడేవుంటారు. ఇందులో సాధక బాధకాలు విస్తృతంగా చర్చించకుండా, ప్రపంచంలో వీరినుంచి జరుగుతాయి అని చెప్పబడుతున్న ఇంఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన సంఘటనలు వున్నాయా? అమెరికాలో వీరికి వ్యతిరేకత ఎందుకు తలెత్తింది? ఇండియాలో లాబీ చేయడానికి అమెరికాలో చేతులు తడపడం ఏమిటి? డైరెక్టుగా స్విస్ బేంకుల్లోకి నగదుబదిలీ జరిగిందా?

    మెచ్చుకోండి

  4. చక్కటి విషయాన్ని అందరికీ అర్ధం అయ్యేలా చెప్పారు… మీరు చెప్పింది అక్షరాలా నిజం. కొన్నాళ్ళకి మనదేశంలో అందరూ గుమస్తాలూ, కూలీలే మిగులుతారు… మన ప్రభుత్వం డబ్బుకి కక్కుర్తి పడి దేశ ప్రయోజనాల్ని అమ్మేసిందనే విషయాన్ని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు.

    మెచ్చుకోండి

  5. నేను ప్రస్తుతం యఫ్.డి.ఐ.కి వ్యతిరేకం. ముందర ప్రభుత్వం చట్టంలో సంస్కరణలు తేవాలి. కోర్ట్ ల సంఖ్య పెంచాలి. కేసుల పరిష్కారానికి కాలపరిమితి నిర్ణయించాలి/విధించాలి. ఆ తరువాత సంస్కరణలు అమలు జరపాలి. లేకపోతే మనదేశం లో రోజుకొక 2జి కుంభకోణాలు జరుగుతూంటే , మన వంద మంది సుబ్రమణ్య స్వాములు లేరు.

    ఈ బ్లాగులో కొన్ని వ్యాఖ్యలు రాశాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

    http://kbhaskaram.blogspot.in/2012/12/blog-post_4.html

    మెచ్చుకోండి

  6. ఆ బ్లాగ్ లో మీ ఈ వాక్యం బగుంది: “అసలికి ప్రపంచలో ఇప్పుడు ఎక్కడైనా గ్లోబలైసేషన్ పేరు వినిపిస్తున్నాదా?”
    గ్లోబల్ కాపిటల్ వరద నీరు లాంటిది. దాన్ని అదుపు చేసి వరద నీరు ఉపయోగ పడేటట్లు గా ఆనకట్ట కట్టలేక పోతే, మొత్తం దేశాన్నే ముంచేస్తుంది.

    మెచ్చుకోండి

  7. “..వీరినుంచి జరుగుతాయి అని చెప్పబడుతున్న ఇంఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన సంఘటనలు వున్నాయా?”

    న్యూయార్క్ టైంస్, మెక్సికో లో వాల్ మార్ట్ అవినీతి గురించి వ్యాసం రాసింది (అలా రాయటానికి ఏ లాబీయింగ్ కారణమో తెలియదు.. కానీ). దానినుంచీ వాల్మార్ట్ వలన అక్కడ పెంపొందిన ఇంఫ్రా స్ట్రక్చర్ కంటే, జరిగిన నష్టాలే ఎక్కువని అనిపించింది.

    మెచ్చుకోండి

  8. టెక్నాలజీ మనుషులని మింగేస్తోందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అందుకే… సైన్సు పెరగొచ్చేమో తప్ప టెక్నాలజీ పెరగకూడదని నా వ్యక్తిగత భావన.

    మెచ్చుకోండి

  9. టెక్నాలజీ అంటే నాకూ పడి చావదు. (శంకరాభరణం “దాసు” గొంతు లో..ఊహించుకొండి). దాని వలన ఇష్టం లేని అనేక సబ్జెక్ట్ లు కాలేజీ రోజుల్లో చదవాల్సి వచ్చింది. జాబ్ లో ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకుండా టెక్నాలజీ తో పాటు మన నాలెడ్జీ అప్డేట్ చేసుకోవాలి. కంపెనీలు తమ లాభాల కోసం ఏదొ ఓ కొత్త టెక్నాలజీ ని తెస్తూనే ఉంటాయి…కానైతే, టెక్నాలజీ లేకుంటే ఈ కామెంటు పెట్టలేక పోయే వాడిని..నాకిష్టమైన పుస్తకాలు చదవలేక పోయే వాడిని.నాకొచ్చిన జబ్బులకి చిన్నప్పుడే టపా కట్టేవాడిని
    నేను పాపికొండల్లో రేడియో సిగ్నల్ కూడా అందని స్థితి లో కొంత సమయం గడిపాను. నన్ను నమ్మండి చాలా బోరింగ్ గా ఉంటుంది. మనం అసలు టెక్నాలజీ యే లేని రోజుల్లో పుట్టి ఉంటే, అప్పుడు మన మనస్థత్వం కూడ అందుకు తగ్గట్టు గా ఉండి , ఏ సమస్యలూ తలెత్తేవి కావేమో! కానీ, ప్రస్తుతానికి మనం టెక్నాలజీ లో పీక లోతుల్లో కూరుకుపోయాం! According to me we are at a point of no return

    మెచ్చుకోండి

  10. కిరాణా కొట్టువాడు శనగనూనెలో కలిపే నూనె (ఇది ఏదైనా కావచ్చు జంతువుల కొవ్వులతో సహా), అరకేజీ పప్పులో 50 గ్రాముల రాళ్ళురప్పలు, బియ్యంలో బెడ్డలూ, పుచ్చు వంకాయలూ, పురుగుపట్టిన ఆకుకూరలూ… ఇత్యాదులేవీ అసలు పులుసులో లేకుండా పోయినట్టున్నాయే!

    మెచ్చుకోండి

  11. ఇంట్లో ఎలుకలు ఉన్నాయి గదా అని ఇల్లు తగలబెట్టుకొంటారా? కిరాణా కొట్టువాడు అంత కల్తీ చేస్తూంటే తూనికలు కొలతల శాఖ చర్యలు తీసుకో వచ్చుగదా!

    మెచ్చుకోండి

  12. కిరాణా దుకాణాలన్నీ కల్తీ చేస్తాయనీ, వాల్మార్త్ లో కల్తీ ఉండదనీ మరీ అంత బ్లాక్ అండ్ వయిట్ లో చెప్పలేమండీ. వాల్ మార్ట్ కూడా కల్తీ చేస్తుంది.పైగా కల్తీ కికూడా ముక్కు పిండి లీగల్ గా డబ్బులు వసూలు చేస్తుంది. కిరాణా వాడు పట్టుపడ్డాడంటే వాడి తిప్పలు చెప్పలేము. ఈ లింకులు చూడండి:
    http://factsanddetails.com/china.php?itemid=2262catid=9
    http://alt.walmart.narkive.com/ZUp5KaqG/wal-mart-continues-to-sell-adulterated-fowl-and-beef
    అలానే కిరాణా దుకాణాలలో కూడా కాస్త ఎక్కువ ధర కి నాణ్యమైన సరుకులు దొరుకుతాయి.
    ఆయనే లేని ఇంట్లోకి మాంచి డబ్బులున్న కాసనోవా వస్తే ఏమవుతుందో ఊహించండి. కాసనోవా అనేది మెక్సికోలోనూ, అమెరికాలోనూ తేలిపోయింది. ఓ సారి కాసనోవా వాల్మార్ట్ కావచ్చు, ఇంకోసారి బెస్ట్బయ్ కావచ్చు.
    శ్రీరాం గారు, “ఆయన వచ్చిన తరువాత, ఈయన్ని రానిద్దాం అంటున్నారు”.(ఆయన్ని రానిమ్మని బ్లాగుల్లో నా లా రాసిపారేయటం తేలికే. కానీ ఆయన వచ్చేలా చేయటం చాలా కష్టం)

    ఇక పోతే వాల్మార్ట్ ఉన్నా చిన్న దుకాణాలు ఉంటాయి. నాలుగైదు రూపాయలకి ఆ రోజు పొయ్యి లో పిల్లి లేవటానికి సరిపడా వీళ్ళే చిన్న మొత్తాల్లో అమ్ముతారు (పల్లెల్లో బస్తీల్లో). క్రెడిట్ హిస్టరీలూ, జాబ్ లూ చూడకుండా పైసా లేనివాడికి అప్పులు ఇస్తారు.ఒక్కోసారి ఇచ్చిన అప్పులు తిరిగి రావు. ఆ రిస్క్ ని హెడ్జ్ చేయటానికి కొంతమంది కల్తీ చేస్తారు.(కొంతమంది కల్తీ కి అంతే ఉండదనుకోండి. అలాంటి వాడి వ్యాపారం త్వరలోనే దివాళా తీస్తుంది) వాల్మార్ట్ ఇలాంటి కొనుగోలు దారులని బయటే ఉంచుతుంది, కాబట్టీ, చిన్న చిన్న కిరాణా దుకాణాలూ వాటి కల్తీ, వాల్ మార్ట్ వచ్చిన తరువాత కూడా కొనసాగుతాయి.
    ఓ ముప్పై యేళ్ళ కింది నుంచే మనకి సూపర్మార్కెట్లూ, హోల్సేల్ మార్కెట్లూ ఉన్నాయి. వాటిల్లో కల్తీ లేని సరుకే దొరుకుతుంది. పాకెట్లు అంత ఆకర్షణీయం గా ఉండక పోవచ్చు. అడ్డమైన ప్రిసర్వేటివ్లూ కలిపిన పాక్డ్ ఫుడ్ అంతగా దొరకక పోవచ్చు. కానీ నాణ్యత పరవాలా.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి