ఈ కథ లో ఒక లోపం ఉంది..ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!

ఈ కథ లో ఒక లోపం ఉంది అది ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!

బాగుపడిన మనుషులు…కథ……………………

కొత్తగా కట్టిన వంతెన పక్క బస్సు దిగి, ఎడమ వైపుకి నడవ సాగాడు రామారావు. రేవు మీది నుంచీ తేమ గాలి సాగింది. సులాబీ దిగితే అన్నీపూల మొక్కల నర్సరీలే.  హైదరాబాదు మురికి వాయువులు అలవాటైన రామారావు కి, మొక్కల గాలి తగిలి ప్రాణం లేచి వచ్చింది. ఆ గాలికి, మనసుకూ ఇంద్రియాలకూ శరీరానికీ ఒక స్వస్థత చేకూరుతుంది. అతని మనసు చుట్టూ ఉన్న వాతావరణానికి అంతకుముందులేని సున్నితత్వంతో స్పందించసాగింది.
నీటిపారుదల శాఖ బంగళాలనూ వాటి ముందున్న ఫిరంగిబొమ్మనీ దాటుకొని, పాడుబడిన ఎత్తిపోతల పధకాన్ని దాటుకొని, ముందుకు వెళ్తే వచ్చింది  చిన్నప్పటి బడి. అతను వెంటనే బడి లోనికి వెళ్ళకుండా కాసేపు చుట్టూ కలియ తిరిగాడు. బడి పక్కనే కరకట్ట. దాని అవతల కృష్ణమ్మ, తెల్లటి ఇసుక మధ్య మధ్య న సన్న సన్నటి నీటి పాయలతో, చిక్కి శల్యమైపోయింది. పైన, అక్కడక్కడా ఉన్న మబ్బులకి రేవు లో కొంత ఇసుక చలవ గా సేదతీరుతోంటే, మరికొంత వేడి గా మెరుస్తోంది.స్కూలు మునుపటిలాలేదు..చాలా మార్పు వచ్చింది.. స్కూలు మెయిన్ బిల్డింగ్ పక్కన అదనం గా రెండు భవనాలు వచ్చాయి. పిల్లలు మాత్రం తక్కువ గా కనపడుతున్నారు. గ్రౌండ్ లో వాలీ బాల్ కోర్ట్ లో పిచ్చి మొక్కలు మొలిచాయి.
బళ్ళో కి వెళ్ళి హెడ్ మాస్టరుకు పరిచయం చేసుకొని వాకబు చేస్తే అభిరాం గాడు ఇంకా రాలేదని తేలింది. హెడ్మాస్టర్ అటెండర్ ని పిలిచి రామారావు బ్యాగ్ ని తీసుకెళ్ళి రూం లో పెట్టమన్నాడు.

హైదరాబాదు నుంచీ అతను త్వరగానే రాగలిగాడు.అభిరాం బెంగుళూరు నుంచీ చేరటానికి సమయం పడుతుందికదా..! చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నా కాలప్రవాహంలో పడి, అభిరాం బెజవాడ లో ‘సీ యే’ చేస్తే, రామారావు వైజాగులో ఇంజినీరింగు చేశాడు. తరువాత ఉద్యోగాన్వేషణలో అభిరాం బెంగుళూరుకీ రామారావు హైదరాబాదుకీ చేరారు. ఐతే, అన్ని ప్రవాహాలూ సముద్రంలోకే అన్నట్లు ఇద్దరూ ‘ఐ టీ’ రంగం లోనే స్థిర పడ్డారు.

వారిద్దరికీ స్కూల్లోనే రెండు గదులు ఏర్పాటు చేశామని చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు.రామారావు స్కూల్లో రెండు కంప్యూటర్లకి డబ్బులిస్తే, అభిరాం  స్కూలు లైబ్రరీ భవనానికి విరాళమిచ్చాడు. “ఆమేరకి హెడ్మాస్టర్ నా పై శ్రధ్ధ చూపిస్తున్నాడులే” అనుకొన్నాడు రామారావు.
ఆటెండర్ కి వయసు మీద పడింది. అతను బ్యాగు ని ఎత్త లేక అవస్థ పడుతుంటే, “నే పట్టుకుంటానులే తాతా!” అని రామారావు తీసుకొన్నాడు.

“అటెండర్ ని ఎక్కడో చూసినట్లేఉంది..ఆ… ఇతని పేరు ఆశీర్వాదం కాదూ..,అప్పుడే ఎంత ముసలాడయిపోయాడు! చిన్నప్పుడు బాస్కెట్ బాలు కోర్ట్ పర్యవేక్షణ చూసుకొనేవాడు. అప్పుడప్పుడూ తను కూడా తమ ఆటలోఓచెయ్యి వేసి, “ఇలా చులాగ్గా ఎగిరి..అలా వొదిలెయ్యాలి బాబూ!” అని చూపించేవాడు”.

“ఏం అశీర్వాదం బాగున్నావా?”
“ఆ..ఏదో..బాగున్నాను బాబూ” అని “మీరు ఏ బాచీ బాబూ?” అని అడిగాడు.
“నీకు అభిరాం గుర్తుండాలే..నేను వాడి బాచే… “ఇంతకీ స్కూలెలా ఉంది ఆశీర్వాదం?”, రామా రావు భోగట్టా చేశాడు..
“ఎనకటి కన్నా చానా తగ్గిపోలా..! ఊళ్ళో పిల్లలందరూ ప్రైవేటు కాన్వెంటులకి పోతున్నారు..మీరున్నప్పుడు సందడి వేరు.అప్పుడున్న మేస్టర్లెవరూ ఇప్పుడ్లేరు. చానా వరకూ రిటైర్ అయ్యిపోయారు..కొంతమంది ట్రాన్సిఫరయ్యిపోయారు.”.

రామారావు ఆలోచనల లో పడిపోయాడు…. “నిజమే స్కూల్ మారిపోయింది..ఆశీర్వాదం మారిపోయాడు నేను మారిపోయాను. కానీ స్కూలును చూస్తే గతం లోకి వెళ్ళి మళ్ళీ ఆ జీవితాన్ని గడిపిన అనుభూతి. ..కానీ ఇది అనుభూతే…! మారిన స్కూలుని చూసినందువలన..మారిన నాలో పెల్లుబికిన జ్ఞాపకాల ప్రభావం…నేను స్కూలులో చదివినప్పటి వాస్తవం ఎప్పుడో కాల గర్భంలో కలిసి పోయింది. అది మళ్ళీ రావటం అసంభవం…!”
అశీర్వాదం గది తలుపు తెరిచి  వెళ్ళిపోయాడు. క్లాస్ రూం లో బల్లలన్నీ ఒక పక్కకు నెట్టి దాన్ని ఒక గది లా చేయించినట్లున్నాడు ప్రధానోపాధ్యాయుడు. పక్కనే ఎక్కడి నుంచో రెండు మంచాలు తెచ్చి వేశారు.

రామా రావు ఎడమ పక్క ఉన్న మంచం మీద వెల్లకిలా పడుకొంటే పాత జ్ఞాపకాలు కమ్ముకొన్నాయి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

అభిరామూ రామారావూ ఇదే స్కూల్లో పదో తరగతి వరకూ చిదివారు. అభిరాం డాడీ   ‘పీడబ్ల్యూడీ’ లో ఇంజనీరు. వాళ్ళు సులాబీ పక్కన క్వార్టర్లో ఉండేవాళ్ళు . వాడి నాన్న జీపులో తిరిగేవాడు. ఆయన ఎప్పుడూ ధీమాగా, ప్రశాంతం గా ఉండే వాడు. ఆయనకి పై రాబడి ఎక్కువని రామారావు కి వాళ్ళ  రైతుల ఇళ్ళలో అనుకోవటం ఆ వయసులోనే  గుర్తు. అభిరాం అమ్మ చాలా నైసు గా ఉండి  చాలా తక్కువ గా మాట్లాడేది. ఆమె కి ఊళ్ళో ఏవరి తోనూ పరిచయాలు ఉన్న దాఖలాలు తక్కువ. ఆ గ్రామం లో ఉండే రైతు కుటుంబాల ఆడవాళ్ళ తో పరిచయాల కోసం ఆమె కి ఏమంత ఆసక్తి కూడా ఉండేది కాదనుకొంటాను.
రామారావు నాన్న ఓ చిన్న రైతు.  వాళ్ళ అమ్మ ఇంటి పనులు చూసుకొనేది.
స్వభావం లో అభీ  ఉత్తర ధృవమైతే రాము దక్షిణ ధృవం. అభీ కి ఆటలూ సరదాలూ ఎక్కువ. స్కూల్లో నలుగురిని వేసుకొని అల్లరి చెయ్యటం చెట్లెక్కటం మెండు. రాము మాత్రం నిశ్శబ్దం గా అతని పనేదో  చేసుకొనే వాడు. ఇంకా సమయముంటే లైబ్రరీకి వెళ్ళి పత్రికలూ కథలూ చదివేవాడు. అభీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వలన వాడికి రాము నోట్సులతో పని బడేది. అభీ అర్ధం కానిది చెప్పించుకోవడానికి ఒక్కోసారి “కలిసి చదువుకుందాం” అని వాళ్ళింటికి  రాము ని పిలిచేవాడు. రాము క్లాసు ఫస్ట్ అని తెలిసో ఏమో అభీ వాళ్ళ అమ్మ నాన్నా కూడా ఏమీ అభ్యంతర పెట్టేవారు కాదు.
అభీని క్లాస్ లీడర్ గా నియమించింది క్లాస్ టీచర్. అందరి దగ్గరా హోంవర్క్ పుస్తకాలు సేకరించి టీచర్ కి ఇవ్వటం. టీచర్ బయటికి వెళ్ళినప్పుడు క్లాస్ గలభా చెయ్యకుండా చూడటం వాడి  బాధ్యతలు. ఎవరైనా వాడితో పోట్లాట పెట్టుకుంటే అలాంటి వాడి మీద టీచర్ కి చాడీలు చెప్పటం అభీ గాడి హక్కు. టీచర్ ముందు మాత్రం అభీ గాడు చాలా వినయం గా ఉండే వాడు. ఆమె చెప్పిన పని తూ.చ. తప్పకుండా అమలు చేసే వాడు. దాంతో క్లాస్ లో పిల్లలందరూ అభీ గాడంటే కొంచెం అదుపులో ఉండే వారు.

అభీ గాడి నాన్న కి వెస్పా స్కూటర్ కూడా ఉండేది. ఏడో తరగతికి వచ్చేటప్పటికి అభీ గాడు ఆ స్కూటర్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. అప్పుడప్పుడూ రాము ని కూడా ఎక్కించుకొని ఇంటిదగ్గర దింపేవాడు.

ఓ రోజు అభీ రాము ని  సెకండ్ షో సినిమాకి లాక్కు పోయాడు. ఆ రోజు లెక్కల మాస్టరిచ్చిన హోంవర్క్ ఇంక అవ్వలా. రాము సినిమా చూస్తున్నా అతని మనసు హోం వర్క్ చెయ్యలేదన్న టెన్షన్ లో పడింది. సినిమా లో రాజేంద్రప్రసాదు జోకులకి పైకి అందరితో పాటు ఇకిలించాడేకానీ, లోపల గుండె పీచు పీచు మని పీకుతోనే ఉంది. ఆ రాత్రి ఒంటి గంటకి ఇంటికొచ్చిన తరువాత దీపపు వెలుగులో కూర్చొని లెక్కల మాస్టరు ఇంటికిచ్చిన లెక్కలు చేశాడు. అయితే, మరసటి రోజు అభీ గాడు మాత్రం ఏ మాత్రం తొణకకుండా, “నిన్న రాత్రి మా డాడీ మమ్మల్ని పెళ్ళికి తీసుకు పోయారు సార్..హోంవర్క్ చెయ్యటం కుదర్లేదు..” అని చెప్పి తప్పించుకున్నాడు.

అభీ గాడు లెక్కలమాస్టర్ని తేలికగా ఏమార్చాడు. కానీ,హెడ్ మాస్టర్ని మాత్రం ఏమార్చలేక పోయాడు. ఆయనకసలే చండ శాసనుడని పేరుండేది. మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా, ఆకతాయి కుర్రాళ్ళని మాత్రం గట్టి దెబ్బలే కొట్టేవాడు.అందుకే ఆయనంటే స్కూలందరికీ హడల్.
స్కూల్లో అభీ గాడికి ఒక బాచీ ఉండేది. అభీ గాడు రామూ కి ఉన్న ఒకే సూర్య గ్రహమైతే, అభీ గాడి చుట్టూ ఉండేసవాలక్ష గ్రహాల్లో రామూ ఒక బోడి గ్రహం.

ఒక రోజు అభీ గాడి బాచీ వాళ్ళు పదో తరగతి బాచీ వాడినొకడిని కబడ్డీ లో కుమ్మేశారు. ఈ విషయాన్ని పదోతరగతి బాచీ వాళ్ళు హెడ్మాస్టర్ కి కంప్లయింట్ చేశారు. దాంతో హెడ్ మాస్టర్ కోపం తో ఊగిపోతూ క్లాస్ కి వచ్చి, “అభీ గాడంటే ఎవర్రా..?” అని అడిగాడు. అభీగాడు కనపడినవెంటనే ఆశీర్వాదాన్ని పిలిచి,”నా రూం లో ఈత బెత్తాలున్నాయి తీసుకొని రా..!”,అన్నాడు.
తరువాత ఈత బెత్తాలన్నీ తుక్కయ్యేటట్లు అభీ గాణ్ణి కొట్టి, క్లాస్ లో మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ పారేశాడు, “ఇక ముందెవరన్నా పిచ్చి పిచ్చి గలాటాల్లోకి దిగారంటే మీకు గూడా ఇదే గతి!” అని. క్లాస్ లోఆడ పిల్లకాయలైతే బిక్క చచ్చి పోయి ఓ రెండు రోజులు మాటలు ఆపేశారు. కానీ మరో రెండు రోజుల తరువాత వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టినాక తెలిసింది, ‘ఆడ పిల్లలలో అభీ గాడికి సానుభూతి పెరిగి పోయింది!’. తరవాతి ఆదివారం అభీ గాడు  క్లాసుమేట్ దుర్గ ని తన స్కూటరెక్కించుకొని మంగినపూడి బీచికి తీసుకెళ్ళాడని రాము కి తెలిసింది. రాము వాడిని ఒంటరి గా ఉన్నప్పుడు ‘ఈ మాట నిజమేనా!’ అనడిగాడు. వాడు ముందు బుకాయించి తరువాత,”నీకు గాబట్టీ చెప్తున్నా, ఇంకెవరికీ చెప్పొద్దు”, అని..”నేను దాన్ని బీచి దగ్గర ఇంగ్లీషు ముద్దు కూడా పెట్టుకున్నాను”, అని చెప్పాడు.
తొమ్మిదో తరగతి లో ఉండగా ఓ సారి అభీ రామూ కలిసి స్కూటర్ మీద పోతున్నారు. హై స్కూల్ గేట్ దగ్గర పదో తరగతి వాళ్ళు స్కూటర్ని అటకాయించారు. అభీ స్కూటర్ దిగి స్టాండ్ వేసే లోపు వాళ్ళు మీద పడి వాడిని పిడి గుద్దులు గుద్ద సాగారు. రాము కి భయమేసి ఏమి చేయాలో తోచలేదు. కాసేపటికి గుండె చిక్కపట్టుకొని పెద్ద గా అరిచాడు. “అడిగో హెడ్ మాస్టర్..! అడిగో హెడ్ మాస్టర్..! పారిపొండి…!పారిపొండి!” దాంతో పదో తరగతి వాళ్ళంతా చెల్లా చెదురయ్యారు..రాము అభీ ని లేపి, కూర్చోబెట్టి, పక్క బడ్డీ కొట్టులో ఒక గోళీ సొడా తెచ్చి తాగించాడు.  ఇక అప్పటి నుంచీ అభీ కి రాము అంటే మంచి గురి ఏర్పడి పోయింది.
పదో తరగతి లో అభీ ‘ఎస్పీ ఎల్ ” గా పోటీ చేసినప్పుడు,వాడికి రాము కరపత్రాలన్నీ రాసి పెట్టాడు. ఎలక్షన్లలో అభి గాడు ఊరి ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఆ ఊరి వాళ్ళందరూ అభి గాడికి ప్రత్యర్ధి గా నుంచున్న సీను గాడికి ఓట్లు వెయ్యకూడదన్నాడు. ఎందుకంటే సీను గాడి ఊరు పక్కనున్న తుమ్మలపాలెం. వాళ్ళ ఊళ్ళో స్కూల్ లేక, వాడు ఈ ఊరి హై స్కూల్లో చదువుకొంటున్నాడు.   కానీ ఎలక్షన్లలో అభీ గాడి ‘ఊరి ఫీలింగ్’ కిటుకు పని చెయ్యలా. సీను గాడే గెలిచాడు. అభీ గాడు ఓడిపోవటం తో రాము చాలా డీలా పడిపోయాడు. కానీ, అభీ మాత్రం మరుసటి రోజుకల్లా మామూలు మనిషైపోయి, “పదరా, చిరంజీవి సినిమా పసివాడి ప్రాణం ఆడుతోందంటా!” అన్నాడు.

పదో తరగతికి వచ్చిన తరువాత రాము డిటెక్టివ్ నవలలూ సస్పెన్స్ నవలలూ మాని కొంచెం ఉత్తమసాహిత్యం చదవటం మొదలెట్టాడు. అభీ మాత్రం మసాల సినిమాలు మానలేదు. ఎప్పుడన్నా సస్పెన్స్ నవల ఉంటే చదివే వాడు. వాడికి సినిమా లో గానీ నవల లో కానీ మజా కావాలి.
టెంత్ క్లాస్ మధ్యలో అభీ నాన్న కి విజయవాడ ట్రాన్స్ ఫర్ అయ్యింది. వాళ్ళమ్మ మాత్రంక్వార్టర్ లోనే ఉండేది. రాము ప్రతి రోజూ సాయంత్రం అభీ ఇంటికెళ్ళే వాడు. అక్కడినుంచీ ఇద్దరూ ఏదో ఓ సినిమాకి చెక్కేసే వాళ్ళు. సాధారణం గా రాము కి నచ్చిన సినిమా అభీ కి నచ్చేది కాదు. సినిమా అయ్యిపోయినాక దాని గురించి వాదులాడుకొనే వాళ్ళు.”అబ్బే.. ఇదేం సినిమా..? మరీ నెమ్మదిగా ఉంది..సినిమా అంటే కిక్ ఇవ్వాలి”, అనేవాడు అభీ.  సాధారణం వాళ్ళ ఇద్దరి అభిరుచులూ దేంట్లోనూ కలిసేవి కాదు.
అభీ కి వాలీ బాల్ చాలా ఇష్టమైతే రాము కి చెస్ ఇష్టం. “చెస్ కూడా ఒక ఆటా…! కదలకుండా ఇంట్లో ఫర్నీచర్లా ఆడేది ఏదీ ఒక ఆట కాదు” అనే వాడు అభీ.

రాము పది మాటలు మాటలు మాట్లాడితే అందుకు అభీ ఓ రెండు ముక్కల్లో సమాధానం ఇచ్చేవాడు. అభీ తన కుటుంబ విషయాలు ఎప్పుడూ చెప్పే వాడు కాదు. రామూ మాత్రం అభీ అడగక పోయినా తన ఇంటి దగ్గర విషయాలు ఏకరువు పెట్టే వాడు.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
స్కూల్లో రూం బయట కారు వచ్చిన శబ్దమై రాము వెళ్ళి తలుపు తెరిచాడు.  బ్లూ బ్లేజర్ వేసుకొని,కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని,నిల్చొన్నాడు అభీ. అతను మంచి అందగాడి గా తయారయ్యాడు. డ్రైవర్ కి , “కారు పక్కన పార్క్ చేసుకో, రాత్రి ‘టెన్ ఓ క్లాక్’ కి మళ్ళీ రిటర్న్ జర్నీ”, అని చెప్పి రూం వైపుకి అడుగులేశాడు.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

“చాలా రోజులైపోయింది మనిద్దరం కలిసి.. త్రీ ఇయర్స్ అవ్వలా?..బెంగుళూరు సెమినార్ లో లాస్ట్ టైం మీట్ అయ్యామనుకొంటా..” అన్నాడు అభి  ఓ కుర్చీ దగ్గరికి లాక్కుని కూర్చొని మంచమ్మీద కాళ్ళు పెట్టుకొంటూ..
చిన్నప్పటి తో పోలిస్తే అభి భాష చాలా మారిపోయింది. అతను మాట్లాడే దాంట్లో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలు ఎక్కువైనాయి. ఇదే రాము అభి తో అంటే , “మనిషి అడాప్ట్ అయ్యిపోవాలి రా..వి నీడ్ టు బి లైక్ ఎ రోమన్ ఇన్ రోం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని వినలా..? ” అన్నాడు అభి.
“సర్వైవ్ అయ్యే పిచ్చి తో నన్ను నేను పోల్చుకోలేని విధం గా తయారవ్వటం నాకు ఇష్టం లేదు రా..అయినా.. డార్విన్ థీరీ ‘ప్రకృతి లోని పరిస్థితులకి ప్రాణుల లో ర్యాండం గా కలిగే జన్యు మార్పులు సరిపడక పొతే ఆ ప్రాణులు అంతరిస్తాయి’ అని చెప్తుంది. దానికీ, స్వ ప్రయోజనమే పరమార్ధం గా ఉండే కార్పొరేట్ ప్రపంచానికీ, చాలా తేడా ఉంది రా..డార్విన్ థీరీ ని ఇక్కడ అన్వయించలేం.”, అన్నాడు రాము.

“మనమందరం మారతాం..అంటే చిన్నప్పుడు ఏర్పడిన మన వ్యక్తిత్వం లోని కోర్ అలానే ఉంటుంది అనుకో..కానీ మనలో మిగిలినదంతా మారేదే…. నీ లాగా… ఏట్లో బండ రాయి లా ఉంటే ఎలా?”

రామారావు మాత్రం,”అసలు డార్విన్ థీరీ ప్రాణులలో ఏ ఏ లక్షణాలను ప్రకృతి లోని మార్పులు….” అని ఇంకేదో చెప్పబోయాడు.

అభీ మధ్యలోనే అందుకొని, “ఒరేయ్ రామూ, నువ్వేమీ మారలేదు రా. నీ ఆలోచనలు ఇంకా భూమ్మీదకి రాలేదు…అంతా కాన్సెప్ట్యువల్ థింకింగ్..నేనేదో అడాఫ్ట్ అవ్వాలి అని బుధ్ధి తక్కువై అన్నానే అనుకో..నువ్వు ఎక్కడికో జన్యు మార్పుల లోకి వెళ్తే ఎలా రా..? నువ్వు ప్రజెంట్ లోకి వచ్చెయ్. ఎవరికున్న పరిస్థితులలో వాళ్ళు బతకాలి రా” అని నవ్వసాగాడు.
“కాన్సెప్ట్యువల్ థింకింగ్ నుంచే సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయోయ్..దాన్ని తీసిపారేయకు”
వాళ్ళిద్దరూ మొదటి నుంచీ ఇంతే.ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి వాదులాడుకుంటూనే ఉంటారు.

“అహా…అయితేఈ గది లో కూర్చొని..నీ బుర్ర తో మాత్రమే ఆలోచించి సైన్సూ, మెడిసినూ, ఇంజినీరింగూ,  పెయింటింగూ, ఫుట్ బాలూ,హాకీ అన్నీ నేర్చేసుకో రా నువ్వు”, అని, “మనిషి బుర్రకున్న తెలివి చాలా పరిమితమైనది రా.. ముందు ప్రపంచం లో పడి ఇన్-ఫర్మేషన్ పట్టుకుంటే గానీ, తరువాత ఆ పట్టుకున్న ఇన్-ఫర్మేషన్ మీద ఆపరేట్ చెయ్యటం కుదరదు మన బుర్రకి….సరే…ఈ వాదాలకేం గానీ..భారతీ,పాపా ఎలా ఉన్నారు”,అని రామూ భార్యా కూతుళ్ళ గురించి అడిగాడు అభీ.
అభీకింకా పెళ్ళి కాలా. పెళ్ళి కాకుండానే అతను ఓ కంపెనీలో డెలివరీ డిపార్ట్ మెంట్ కి హెడ్ అయ్యాడు. నేరు గా “సీ ఈ ఓ” కే రిపోర్ట్ చేయటం. రాము చిన్నప్పుడు అభీకన్నా చదువు లో చాలా ముందున్నప్పటికీ, ఉద్యోగ పరం గా అతని కంటే చాలా వెనకబడిపోయాడు. ఓ చిన్న కంపెనీ లో టీం లీడ్ గా చేస్తున్నాడు.

ఇద్దరూ ఒకరి ఉద్యోగం గురించి వేరొకరు అడిగి తెలుసుకొన్నారు. అభీ, “మోర్ దేన్ హాపీ..” అన్నాడు.
రామారావు కి  తన ఉద్యోగం ఏమాత్రం నచ్చటంలా. ఉద్యోగం లో చేరిన మొదట్లో ఒక ప్రాజెక్ట్ నుంచీ వేరొక ప్రాజెక్ట్ కి విసిరేసే వాళ్ళు..ఐనా ఏమీ అనలేని తన నిస్సహాత్వానికి తన మీదే తనకు చాలా కోపంగా ఉండేది. ఫాలో అప్ పేరు మీద వాళ్ళ టీం లీడ్ గంటకో సారి అతని సీట్ దగ్గరికి వచ్చి “హౌజ్ ఇట్ గోయింగ్?” అంటూ ఉంటే”, వాడిని ముక్కుమీద గుద్దాలనిపించేది. జీతం గురించి అడగొద్దు..బఠాణీ గింజల జీతం…
వాళ్ళ టీం లీడ్ తిట్టినప్పుడు తనది తప్పు ఉందని తెలిసినా, వాడి మీద కసి తో పని చేయాలనిపించేది కాదు. తన మనసుని కష్టపెట్టటానికి వాడెవడు? వాడు దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే…
తీరా రామూ టీం లీడ్ ని అయ్యాడా….బతుకంతా ఒకటే టెన్షన్ అయ్యిపోయింది..జీతం పెరిగింది..కానీ దానితో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. …ఇక ప్రమోషన్ వచ్చి మానేజర్ గా అయితే ఇంకెంత టెన్షన్ ఉంటుందో..?ఓ రోజు క్లయింట్ మీటింగ్ లో తనేదో తప్పు మాట్లాడితే మానేజర్ గాడు తరువాత తనను ఒంటరిగా వాడి గది లోకి పిలిచి, “యు రేర్లీ ఓపెన్ యువర్ మౌత్. బట్ వెనెవర్ యు ఓపెన్ ఇట్, యు పుట్ యువర్ ఫూట్ ఇంటు ఇట్” అన్నాడు. వాణ్ణి చాచి పెట్టి లెంప పగులకొడదామనిపించింది..కానీ అసలే రిసెషన్ రోజులు..ఉద్యోగం ఊడుతుందని ఊరుకొన్నాడు..ఇప్పుడు ఆలోచిస్తే టీం మెంబర్ గానే తను హాయి గా ఏ బరువూ బాధ్యతా లేకుండా ఉన్నాడేమో అనిపిస్తుంది..కాకపోతే డబ్బులు తక్కువ వస్తాయి.
అభీ కి  ఈ గొడవంతా చెప్పకపోయినా, కొంత చెప్పాడు రాము.

అభీ చిద్విలాసం గా నవ్వి,”నీకు ఈ ఫీల్డ్ సరిపడదనుకొంటారా..ఏ  బడి పంతులు ఉద్యోగమో చేసుకోరాదూ?” అన్నాడు.
“అప్పుడు డబ్బులు సరిపోవేమో రా..?”
“మరి ఒకటి కావాలంటే వేరొకటి వదులుకోవాలి బాబూ..నీకు డబ్బూ కావాలి..టెన్షన్ లేని బతుకూ కావాలి..మళ్ళీ ఎవడూ నీ మీద అధికారమూ చెలాయించకూడదు. ఇవన్నీ ఒకే సారి ఎలా సాధ్యం ? ఏ సినిమా స్టార్లలాంటి వాళ్ళో కొందరు అదృష్టవంతులు ఉంటారు.వాళ్ళకి అన్నీ అవే వస్తాయి…ఐనా వాళ్ళకి కూడా ఏదోఒక పర్సనల్ ట్రాజెడీ ఉండనే ఉంటుంది…అవునూ… స్కూల్ యానివర్సరీ ఈవెనింగ్ సిక్స్ కి కదా..మనమిచ్చిన డొనేషన్ కి, హెడ్మాస్టర్ మన చేతులమీదుగా పిల్లలకి ప్రజంటేషన్లు ఇప్పిస్తాడట. రెడీ గా ఉండు”, అన్నాడు  అభీ.
“ఫంక్షన్ అయ్యాక ఊళ్ళోకి వెళ్ళి రావాలి..మాదూరపు చుట్టాలు కొందరు ఇంకా ఊళ్ళోనే ఉంటున్నారు”  అన్నాడు రాము.
“సరేరా, నువ్వెళ్ళు. నేను నీ కోసం ఆగను. రాత్రి టెన్ కి బయలు దేరాలి”, అన్నాడు అభీ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

అభిరాం ఆఫీస్ నుంచీ రావటం ఎప్పటిలాగే బాగా లేటయ్యింది. అతని ఫ్లాట్ మేట్ సంజయ్ అప్పటికీ మెలుకువ గానే ఉన్నాడు. అభిరాం డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి సంజయ్ ఇంటర్నెట్ లో బూతు సినిమాలు చూసుకొంటున్నాడు. ఒక బొమ్మ మీద నొక్కితే వెయ్య బొమ్మలు వస్తాయి ఆ వెయ్యి బొమ్మాల్లో ఒక్కో బొమ్మా మళ్ళీ వెయ్యి బొమ్మల కిటికీలని తెరుస్తుంది..అలా అలా..వెయ్యి బొమ్మలలో కొన్నైనా నచ్చుతాయి…ఈ బొమ్మల తతంగానికి అంతే ఉండదు. అభీ స్నానం చేసి భోజనం చేసి వచ్చేసరికి తెల్లారి రెండైపోయింది. కానీసంజయ్ ఇంటర్నెట్ వదలట్లేదు.ఒక బొమ్మ రెచ్చగొడుతుంది..రెచ్చిపోయిన తరువాత మరోబొమ్మ కావాలని పిస్తుంది….”దీని మొహమ్మీది ఫీలింగ్ చూడు ..ఫీలింగ్ ..కీ ఎమోషన్ కీ సెక్సు కీ ఏదో సంబంధం ఉందబ్బా..అసలు సెక్సే ఓక ఎమోషన్..సెక్సు లోనే ఎమోషనల్ శాటిస్ఫాక్షన్ ఉంది…ఈ గుంట చూడు…షి లుక్స్ ..క్యూట్…ఈ సీన్ చూడు..ఆ డిం లైటింగూ అదీ..భలే సెన్సువస్ గా ఉంది కదా…” అంటున్నాడు అతను. అభీ అందుకొని…

“బాబూ సంజయ్..నీ లెక్చర్ వినలేక చస్తున్నాం నాయనా…..! నువ్వు దీనికి ఎడిక్ట్ అయ్యిపోతున్నావు…కాదు..కాదు ఎడిక్ట్ అయ్యిపోయావు…రేపు పొద్దున్నే ఎప్పుడు లేస్తావూ ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తావు..?ఆఫీస్ లో పని అంతా ఖరాబు చేస్తావనుకొంటా..మళ్ళీ తరవాత అప్రైజల్ లో తక్కువ రేటింగ్ ఇచ్చాడంటావు…” అన్నాడు.

సంజయ్..”ఒక్కొక్కడికీ ఒక్కో ఎడిక్షన్ బాబూ..నీకు వర్క్ ఎడిక్షన్…ఇంకొకడికి క్రికెట్ ఎడిక్షన్..నాకు ఈ బొమ్మలు ఎడిక్షన్..నువ్వు చిన్నప్పుడు చిరంజీవి సినిమాలకు ఎడిక్ట్ అయ్యావని నువ్వే చెప్పావు కదా..?” అన్నాడు.

“ఆ ఎడిక్షన్ వేరు ఇది వేరు..దీంట్లో దిగజారుడుతనం ఉంది. పైగా ఇంటనెట్ సైట్ల వాళ్ళు నీ బలహీనత ఆధారం గా ఎక్స్-ప్లాయిట్ చేస్తున్నారు” అన్నాడు అభి.

“వాడెవడో నన్ను ఎక్స్-ప్లాయిట్ చెయ్యటం ఏమిటి? నాకు ఇష్టమై నేను చూస్తున్నా..నేను ఎంజాయ్ చేస్తున్నా..అయినా దీనికీ తిండి తినటానికీ పెద్ద తేడా ఏముంది? ఆకలైతే తిండి తింటాం..కోరిక కలిగితే బొమ్మలు చూస్తాం” సంజయ్ తిప్పికొట్టాడు.

“ఒరేయ్ అబ్బాయ్..ఆకలేస్తే హాయిగా తిండి తింటాము…అంతేగానీ…తిండిని ఫొటో తీసి దానిని చూసి మనలని మనం ఊరించుకొంటూ తృప్తి పడంకదా..నువ్వు చేస్తున్న పని అలాంటిదే..తిండి తినటం అన్నది భౌతికావసరం..కానీ నువ్వు చేస్తున్నదాంట్లో మానసికమైన వ్యసనం చాలా ఉన్నది బాబూ..ఎవరో ఒక అమ్మాయిని చూసుకో..”

“అసలు తిండి దొరకక పోతే ఏమి చేస్తాము మామా..? తిండిని ఫొటోలు తీసి చూసి తృప్తి పడాల్సిందే..నీకైతే ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతూనే ఉంటారు బాబూ..నీ ‘గర్ల్ ఫ్రెండ్స్ ని రూం కి తెచ్చినప్పుడు నన్ను ప్రకాష్ గాడి రూం కి తోలతావు… మరి నా సంగతి అలా కాదే! ఈ ముఖానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పడతారు చెప్పు..?  కాబట్టీ… ఒక్కోసారి తిండి కంటే తినేపదార్ధాల ఫొటోలే బాగుంటాయి..తిండి చేదుగా..వెగటుగా ఉండవచ్చు.ఫొటోలతోఆ బాధ లేదు. ఇది మానసిక జాఢ్యం అంటున్నావు గానీ ఏది మానసిక జాఢ్యం కాదు…? ఇవాళ నెలకి లక్ష జీతం వచ్చేవాడు,ఆ లక్ష జీతం వస్తుండగానే, రెండు లక్షల ఉద్యోగం వస్తుందేమోనని చూస్తాడు. ఆ రెండు లక్షల జీతమిచ్చేఉద్యోగం రాగానే కొంత కాలానికి వాడికి అందులో ఉండే ఆనందం పోతుంది..మళ్ళీ మూడులక్షల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు..అలానే రాజకీయ నాయకుడు…ముందు ఎమెల్యే అవ్వాలనుకుంటాడు…ఎమెల్యే ఐన తరువాత, మంత్రి కాలేదనే బాధ పట్టుకొంటుంది..అంటే వాడు డబ్బుకీ, వీడు పవర్ కీ ఎడిక్ట్ ఐపోయారన్న మాటే కదా..? జీవితం లో ఒక మెట్టు పైకెక్కినప్పుడల్లా వచ్చే కిక్ కి ఎడిక్ట్ ఐపోతున్నారు జనం. జంతువులే నయం. ఆహారం తింటాయి తిన్న తరువాత అది అరిగిపోయి, మళ్ళీ ఆకలి పుడితే గానీ మళ్ళీ ఆహారం గురించి ఆలోచించవు. మనిషికి లక్ష ఉండగానే కోటి కావాలి,కోటి ఉండగానే పది కోట్లు కావాలి…మనిషికున్న ఈ దురాశ వలనే గ్లోబల్ వామింగ్ మొదలయ్యింది………. ”

అభి సంజయ్ కి దండం పెట్టి, “నిన్ను డిస్టర్బ్ చేయనులే నాయనా.. ఇంకొంచెంసేపాగితే బిగ్ బ్యాంగ్ కీ,  పోర్న్ ఎడిక్షన్ కీ ముడిపెట్టేటట్లున్నావు..ఇక చూసుకో…నాకెందుకు..?” అని బెడ్ రూం లోకెళ్ళి పడుకున్నాడు .

%%%%%%%%%%%%%%%%%%%%%%

యంగ్ ఎంటర్-ప్రెన్యూర్స్ మీట్ కి అభిరాం వాళ్ళ బాసుకి పాసులు వచ్చాయి. బాస్ అభి-రాం కి కూడా ఒక పాస్ ఇచ్చాడు. ఆ మీట్ లో నిషా మల్-హోత్రా అని ఓ ముప్పై ఏళ్ళ ఉత్తర భారత సుందరి తత్తర బిత్తర ఏ మాత్రం పడకుండా మాట్లాడింది. ఆమె మాటలూ, ఒళ్ళూ కూడా అభిరాం కి బాగా నచ్చేశాయి. బుర్రలోనూ బుర్రకిందా సరుకున్న వాళ్ళు కొంచెం అరుదు గా తారస పడతారు. అభిరాంకి ఇంతకు ముందు ఒక నలుగురు అమ్మాయిలతో ఐనా సుఖ పరిచయాలున్నాయి. కానీ ఏ అమ్మాయీ అతని గుండె స్పీడు ని ఇంతగా పెంచలా. అభి ఆమె వేదిక కిందికి దిగిన తరువాత వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొన్నాడు.
అభిరాం ఏం మాయ చేశాడో ఏమో తెలియదు గానీ తరువాత సరిగ్గా ఆరు నెలలకి నిషా, సంజయ్ లేని అభిరాం ఫ్లాట్లో మంచమ్మీద అతని చాతి మీది వెంట్రుకలు వేలితో మెలితిప్పుతూ వాళ్ళ బతుకు బిజినెస్ కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసింది. ఆ చర్చల మధ్య లో స్వర్గం అంచులకీ, మళ్ళీ అక్కడి నుంచీ డిస్కషన్ కి మంచం అంచులకీ తిరిగి వచ్చారు వాళ్ళిద్దరూ.
అభిరాం ఆమెకు “పెళ్ళీ చేసుకొందాం” అని ప్రపోజ్ చేశాడు.
నిషా,”తనకి అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదన్నది”, తనకి తన ఇండస్ట్రీ అంటే పాషన్ అంట…దానికే తన సమయం అంతా సరిపోతుందంట…ఆమె ఫ్రెండ్ ఒక ఆడ “సీ ఈ వో” ఉందంట. ఆమె తన పిల్లలను ఆయా కి అప్పచెప్పి, తను ఆఫీసు పనులలో బిజీ గా ఉంటుందట..పిల్లలకి ఆమె ఫ్రెండ్ కంటే ఆయా అంటేనే చనువు ఎక్కువంట.ఆమె భర్త ని అందరిముందూ ఎంతో గౌరవం గానూ, లోపల ఇంట్లోనేమో వాళ్ళ కుక్క టామీ గానూ చూస్తుందట. అతను ఊళ్ళో ఉన్న రెడ్ లైట్ యేరియా లో అప్పుడప్పుడూ సేదతీరుతాడట.  ఏ “సీ ఎన్ బీ సీ టీ వీ” వాళ్ళో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం,”తాను ఒక తల్లి గా,భార్య గా కోడలిగా, ‘సీ ఈ వో’ గా అనేక పాత్రలను తెగ బాలన్స్ చేసినట్లు ఫోజు కొడుతుందట.
తనకు మొదటి ఇష్టం తన కంపెనీ కాబట్టీ, తనకు తన ఆడ ఫ్రెండ్ లా అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదు కాబట్టీ, తను అభిరాం మేలు కోరేది కాబట్టీ, అభి రాం కి తనను పెళ్ళాడవద్దని సలహా ఇస్తుందట.
ఈ సంఘటన జరిగిన ఓ రెండు నెలలకి నిషా కి ఓ బిలియన్ డాలర్లకంపెనీ ఓనర్ కొడుకు తో డెస్టినేషన్ మారేజ్ మాలిబూ లో జరిగింది. దానితో అభిరాం కి పెళ్ళంటే కొంచెం తాత్కాలికం గా విరక్తి   కలిగింది. అయితే మాలిబూ లో నిషా పెళ్ళి కి వెళ్ళి నిషా తో ఆమె భర్తని పరిచయం చేయించుకోవటం మాత్రం మరిచిపోలేదు అభిరాం.
ఓ సంవత్సరానికి, తనున్న కంపెనీకి రాజీనామా చేసి, నిషా భర్త సపోర్ట్ తో తానే ఓ ‘సోలార్ సెల్ లు తయారు చేసే కంపెనీ’ పెట్టాడు అభిరాం..

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

ప్లేన్ ఒసాకా ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఒసాకా  ఎయిర్ పోర్ట్ సముద్రం లోని దిబ్బ మీద కట్టారు. “జపాన్ వాడి టెక్నాలజీ బాగానే ఉందే…!” అనుకొన్నాడు అభీ. తన కంపెనీ కి జపనీస్ పార్ట్ నర్ ని వెతకటం కోసం జపాన్ వచ్చాడు అభి. ఫ్లైట్ నుంచీ బయటకు రాగానే ఒకటే చెమటలు కారసాగాయి. అంతా తేమ గా ఉంది. ఎయిర్ పోర్ట్ బయట ఒక జపనీస్ అతను అభి పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిల్చొన్నాడు. అతను అభి కి గౌరవసూచకం ముందుకు వంగి జపనీస్ పధ్ధతి లో బౌ చేసి “మై నేం ఈజ్ యమనకా.. యువర్ ఇంటర్-ప్రెటర్” అన్నాడు. అభి చెయ్యి అందించి షేక్ హ్యండ్ ఇచ్చాడు. అతను అభీ సంతకం తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్ లో యెన్స్ తెచ్చి పెట్టాడు. బయట లిమోసిన్ కార్ ఉంది . యమనకా డ్రైవ్ చేయసాగాడు. “ఎయిర్ పోర్ట్ నుంచీ ట్రెయినూ బస్సూ రెండూ ఉన్నాయి కానీ..ఈ కార్ అయితే అభీ కి కంఫర్టబుల్ గా ఉంటుందని తెచ్చాను” అని చెప్పాడు యమనకా సాన్. దారిలో కనిపించిన అపార్ట్మెంట్లలో ఇండియాలో లానే బాల్కనీల లో బట్టలు ఆరేసి ఉన్నాయి.  కారు ‘షి ఒసాకా’ దాటి ‘నిషి నకజిమా’ చేరింది. ఎక్కడ చూసినా ఫు ట్పాత్ లపై వెండింగ్ మెషీన్ లు ఉన్నాయి. జపాన్ లో దొంగతనం, క్రైం అసలు ఉన్నట్లే లేవు. జపాన్ అమ్మాయిలు ఒంటి మీద ఏమాత్రం నూగు వెంట్రులు కూడా  లేకుండా లైఫ్ సైజ్ బొమ్మల్లా కనపడుతున్నారు.
హోటల్ లో రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు అభీ. రెస్ట్ రూం లోని కమ్మోడ్ లు కూడా ఆటోమాటిక్ వి ఉన్నాయి. యమనకా సాన్ “లంచ్ కి  ఇండియన్ రెస్టారెంట్ వెళ్దామా?” అన్నాడు. కానీ అభీ కి కొత్త కొత్త ఫుడ్స్ ట్రై చెయ్యటం ఇష్టం. జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాడు అభి. యమనకా సాన్ దగ్గరే ఉన్న ఒక జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. అది కొంచెం ఖరీదైన రెస్టారెంట్ లానే ఉంది. మన పల్లెలలో ఉండే నేల పీటల కంటే కొంచెం ఎత్తులో పీటలు ఉన్నాయి ఆ రెస్టారెంట్ లో. పీటల మీద కూర్చొని పీటలముందున్న గొయ్యి లోకాళ్ళు పెట్టుకోవాలి. చాలా మంది జపాన్ వాళ్ళ లా కాకుండా, యమనకా సాన్ మంచి మాటకారి. ఎప్పుడూ ఏదో ఒక సమాచారమిస్తూనే ఉంటాడు. మెనూ లో ఐటంస్ ఎడమ  నుంచీ కుడి కి కాక పై నుంచీ కిందికి రాసి ఉన్నాయి.  చాలా ఫిష్ ఐటంస్ ఉన్నాయి. మెనూ లోబీఫ్ కూడా ఉంది. “రెండో ప్రపంచ యుధ్ధానికి ముందు జపాన్ లో బీఫ్ తినేవారు కాదు. కానీ తరువాత ఇక్కడ అమెరికా సైన్యాలు పాగా వేశాయి. వాళ్ళ ప్రభావం తో ఇక్కడ కూడా బీఫ్ అలవాటయ్యింది” అని చెప్పాడు యమనకా సాన్.

“భారతీయ సంస్కృతిమీద కూడా అమెరికా ప్రభావం ఈ మధ్య బాగా పెరుగుతోంది. చాలా మంది ఇండియన్స్ ఇంగ్లీష్ మాటలు లేకుండా తమ తమ భాషలలో మాట్లాడలేరు” అన్నాడు అభీ.
” జపాన్ లోకూడా అంతే…ఇంగ్లీష్ మాట వాడకుండా జపనీస్ మాట్లాడటం క్రమేపీ తగ్గుతోంది.ఇన్ ఫాక్ట్…”జపాన్ దేశం “యూ ఎస్” లో యాభై ఒకటవ రాష్ట్రం అయిపోయింది”, అని ఒక జోక్ ప్రచారం లో ఉందిక్కడ.

యమనకా సాన్ అభీ కి సుషీ తినమని సజెస్ట్ చేశాడు. అది చేపా, వరి తో చేసిన ఒక వంటకం. దాని తరువాత పచ్చి చేపని ఆర్డర్ చేశాడు, తరువాత ఆక్టోపస్ సూపు.
యమనకా సాన్ ఒక జపనీస్ కర్రీ పేరు చెప్పి,”అభీ సాన్, దిస్ ఈజ్ ద స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్ అన్నాడు. అభీ ఆ కర్రీ తెప్పించుకొని తిన్నాడు. అది మన పచ్చడి కంటే చాలా తక్కువ కారం గా ఉంది. కానీ యమనకా సాన్ నోరు వెళ్ళ బెట్టి, వెంటనే తన అమెరికన్ భార్య కి ఫోన్ చేసి “జస్ నౌ ఐ హావ్ సీన్ స మాన్ హూ హాస్ ఈటెన్ స స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్!” అని జపనీస్ ఆక్సెంట్ లో చెప్పాడు. అతనికి అభీ,”మా ఇండియాకి వస్తే నువ్వు దీనికి పదింతలు కారం తినే వాళ్ళని చూడ వచ్చు”, అని చెప్పాడు.  తర్వాత యమనకా రైస్ నుంచీ తీసిన జపనీస్ బీర్ ని ఆర్డర్ చేశాడు. లంచ్ అయిన తరువాత యమనకా బిల్లు లో తన వంతు మాత్రమే   చెల్లించాడు. జపాన్ లో ఎవరి బిల్లు వారే చెల్లించుతారు మరి!
యమనకా “తినటం తాగటం అయిపోయింది..ఇంకా ఒకటే మిగిలి ఉంది”, అని దగ్గరే ఉన్న ఒక నైట్ క్లబ్ కి అభీ ని తీసుకొని పోయాడు. అక్కడబొమ్మల లాంటి జపనీస్ అమ్మాయిలు అభీ కి విస్కీ పోసి పక్కనే కూర్చొని తాగించారు. యమనకా సాన్ దుబాసీ గా వారి తో కొంచెం మాట్లాడాడు. ఒకమ్మాయి తాను జాగ్రఫీ స్టూడెంట్ ని అని చెప్పింది. వెంటనే అభీ ఆమె ని “ఇండియా పేరు విన్నావా?” అని అడిగాడు.
“ఆఫ్రికా లో ఉంటుంది కదా..?”
ఓహ్ ..ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళీనా ఈ నైట్ క్లబ్బులో ఉండే అమ్మాయిలు ఇలానే ఉంటారు.
వాళ్ళు అభీ కి వాళ్ళ విసిటింగ్ కార్డులిచ్చి” వెళ్ళారు.
యమనకా సాన్,”వీళ్ళందరికీ మసాజ్ పార్లర్లు ఉంటాయి. ఇక్కడ మసాజ్ పార్లర్ ముసుగు లోప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. నీకు ఆసక్తి ఉంటే చెప్పు “,అన్నాడు.

ఆరోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు యమనకా సాన్ తో పాటు ఊరి బయట ఉన్న సోలార్ సెల్ ఫాక్టరీ కి బయలు దేరాడు అభీ. దారి లో వరి పొలాలున్నాయి. యమనకా సాన్ చెప్పిన దాని ప్రకారం వాటి ఉత్పాదకత ఇండియా పొలాలతో పోల్చితే రెండు రెట్లుంటుంది.
యమనకా సాన్ హఠాత్తు గా “ప్రజలు ఎడ్యుకేటెడ్ అవ్వటం వలన డబ్బులు ఎక్కువ సంపాదించ వచ్చు అంటారు కానీ అది కరెక్ట్ కాదు”,అన్నాడు.
“ఎందుకూ!?”
“నేను చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఉండే వాడిని. అప్పుడు వరికోత కోసే మెషీన్లు ఉండేవి కావు. ఊళ్ళో ధనికులైన రైతుల దగ్గర మిగిలిన వాళ్ళందరూ పని చేసే వారు. కానీ నెమ్మది గా మెషీన్ లు రావటం తో ఊళ్ళోని కుర్రాళ్ళు చాలా మంది ఒకేషనల్ కోర్సు లోచేరి హార్వెస్టింగ్ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. ముందు నేర్చుకొన్న వారికి ఊళ్ళో పని దొరికింది. వారికి జీతాలు కూడా ఎక్కువే ఇచ్చేవారు. కానీ నెమ్మది గా ఊళ్ళో అందరూ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. దానితో లేబర్ సప్లై ఎక్కువై,  డిమాండ్ పడిపోయింది. ఊళ్ళో ఉన్న మొత్తం పొలాలు ఓ నాలుగు వందల ఎకరాలే! కాబట్టీ నెమ్మది గా లేబర్ చార్జీలు మెషీన్లు రాక ముందు కాలానికి పడిపోయాయి.  జపాన్  ఆర్ధిక వ్యవస్థ తొంభైలలో మాంద్యం లో పడటం వలన పరిస్థితి ఇంకా దిగజారింది. మెషీన్లు రాక ముందు ఊరి అందరికీ తక్కువ జీతాలొచ్చేవి. కానీ ఇప్పుడు ఊళ్ళో పది శాతం మందికి మాత్రమే తక్కువ జీతాలు వస్తున్నాయి. మిగిలిన వారికి పనే లేదు. ఎందుకంటే ఒక హార్వెస్టింగ్ మెషీన్ పదిమది చేసే పని చెయ్యగలదు. ఈ విధం గా మా వ్యవసాయం ఉత్పాదకత పెరిగింది, కానీ ఉద్యోగాలు ఊడాయి”, అన్నాడు యమనకా సాన్.
“మరి పల్లెటూళ్ళో ఉండే నువ్వు ఈ సోలార్ కపెనీ లో పార్ట్ నర్ గా ఎలా కాగలిగావు?” అని అడిగాడు అభి.
“మా నాన్న పల్లెటూళ్ళో ఉండే భూస్వామి. రిసెషన్ టైం లో నేను ఈ కంపెనీ షేర్లు చవక గా కొన్నాను”,అని చెప్పాడు యమనకా.
కారు కొండల గుండా ప్రయాణం సాగించింది..కొండల్లో ఎక్కడికక్కడ చెక్ డాంలు పకడ్బందీ గా కట్టి వాన నీరు వృధా కాకుండా చూస్తున్నారు. చివరికి అభీ ఫ్యాక్టరీ లో చూస్తే టెక్నాలజీ మన దేశం లో కంటే ఓ పదేళ్ళైనా ముందుంటుందనిపించింది. దానితో అగ్రీమెంట్ కుదుర్చుకోవటానికి సిధ్ధమైపోయాడు అభి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
“ఎం ఓయూ” సైన్ చేసిన రాత్రి అభి యమనకా సాన్ తో మసాజ్ అమ్మాయికి ఫోన్ చేయించాడు. “తనకి బాగోలేదని ఇంకో అమ్మాయిని పంపిస్తున్నానని”, చెప్పింది మొదటి అమ్మాయి.
వచ్చిన అమ్మాయి ఇంగ్లీషు కొంచెం బాగానే మాట్లాడుతోంది. ఆ అమ్మాయిని, “నువ్వు చేసే పనికి ఎప్పుడైనా గిల్టీ గా ఫీలయ్యావా?” అని అడిగాడు అభీ.
“గిల్టీ ఎందుకు? సమాజంలో నీ లాంటి వాళ్ళకు మేము సేఫ్టీ వాల్వ్ లాంటి వాళ్ళం..ఐనా ఈ రోజు తప్పైనది రేపు తప్పు కాకపోవచ్చు. అలానే ఇక్కడ తప్పైనది..కొన్ని దేశాలలో తప్పుకాదు…కొన్నాళ్ళకి సెక్స్ కూడా భోజనం చేయటమంత సాధారణం కావచ్చు..”,అంది.
“పరవా లేదే, వీళ్ళకి కూడా, కొంతమందికైనా, బుర్ర ఉంది”, అనుకొని, “నీ దృష్టి లో ఇది తప్పు కాక పోయినా దేవుడి దృష్టి లో ఇది పాపం కదా?” అన్నాడు.

“జపాన్ లోని మెజారిటీ ప్రజలలానే నేను కూడా నాస్తికురాలిని”
“నీది ఏ మతం..?”
“మా అమ్మది బుధ్ధిజం..మ నాన్న ది షింటోయిజం…కానీ నేను బుధ్ధిజాన్ని ఫాలో అవుతాను”
“షింటో ఇజం అంటే..?”
“రాజు ని దేవుని ప్రతినిధి గా భావించే ఒక మతం..నీకు జెన్ గురించి తెలుసా..?” అంది.
“ఎక్కడో విన్నాను కానీ సరిగా తెలియదు..”
“జెన్ అంటే అది ఒక ధ్యానం. ఇది మీ ఇండియా నుంచే వచ్చింది…సంస్కృత శబ్దం ధ్యాన్ నుంచీ వచ్చింది..నేను ఒక జెన్ గురువు దగ్గరకి వెళ్తూ ఉంటాను”
“నీకు అక్కడ ఏమి దొరుకుతుంది?”
“మనశ్శాంతి…”
“అరే … సరిగ్గా నా మనసు లో ఉన్న మాట చెప్పావ్..ఈ మధ్య నాకు మనశ్శాంతి కూడా కావాలనిపిస్తోంది..”
“ఐతే రేపు నాతో పాటు మా గురువు దగ్గరికి రా”

%%%%%%%%%%%%%%%%%%%%%%%%

రామారావు జాబ్ కష్టాలు ఎక్కువ అవ్వసాగాయి. టెన్షన్లు పెరగసాగాయి. యోగా నేర్చుకొంటే టెన్షన్ తగ్గుతుందని ఎవరో చెప్పారు. హైదరాబాదు లో రాజయోగి బాబా గారు  యోగా నేర్పుతారు. ‘టీ వీ’ లోనూ కాసెట్లలోనూ చూసి నేర్చుకోవచ్చు గానీ,ఒక తెలిసిన గురువు ఉండటం మెరుగని బాబా గారి క్లాసులకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా గారు ఈ ప్రోగ్రాం తరువాత ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తారు. ఆయన ఈ రెండింటికీ వేరు వేరు గా చార్జ్ చేస్తారు. రాము యోగా క్లాస్ లో మాత్రమే జాయిన్ అయ్యాడు.
యోగా వలన టెన్షన్ తగ్గుతుంది. కానీ అది “అడుగున లీకైన పడవలో నుంచీ నీళ్ళు తోడటం లాంటిది. మళ్ళీ చిల్లు లో నుంచీ నీరు వస్తూనే ఉంటుంది. ఆందోళన చెందే వ్యక్తి యోగా ద్వారా తాత్కాలికం గా తన టెన్షన్ని తగ్గించు కోవచ్చు. కానీ మళ్ళీ ఆందోళన అతని వ్యక్తిత్వం లోని చిల్లు లోంచీ అతని మనసులోకి ప్రవేశిస్తూనే ఉంటుంది.ఒక రోజు రాము క్లాస్  ఐనాక బయటికి వస్తుంటే,కాషాయ వస్త్రాలలో అభిరాం లా ఉన్న వ్యక్తి కనిపించాడు. “అభిరాం ని పోలిన వ్యక్తి ఎవరా !” అని పరిశీలన గా చూస్తే అభిరామే,వేరే ఎవరో కాదు.
తను బాబా గారి ప్రసంగానికి వెళ్తున్నాడట..అంతకుముందు చాలా రోజులనుంచీ బాబా గారిని ఫాలో అవుతున్నాడంట.
“జపాన్ వాళ్ళతో పార్ట్ నర్ షిప్ పెట్టుకున్నాక, నీ కంపెనీకి గవర్నమెంట్ ఆర్డర్లు బాగా వచ్చాయి కదా, మరి ఇంతలోనే దివాలా తీసిందా ఏమిటి సన్యాసం లో చేరావు?”,రాము పరాచికమాడాడు.
“అదేమీ కాదు..కంపెనీ ని అమ్మేశాను..బాగానే లాభం వచ్చింది.”
అభీ తో ఇదే బాధ… ఎంత లాభం వచ్చిందో చెప్పడు..అంతా గుంభన..అదే రాము ఐతే ఎంత లాభం వచ్చిందో చెప్పే దాకా నిద్రపోడు.
“అయ్యో, నీ కంపెనీ లో ఏదైనా జాబ్ ఇప్పించమని అడుగుదామనుకొన్నానే..మరి ఇంకో కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా?”
“ఈ కంపెనీ ల తో బోర్ కొట్టేసింది.జపాన్ నుంచీ బిజినెస్ పార్ట్ నర్ తో పాటు జెన్ ని కూడా వెంటపెట్టుకొని వచ్చాను. జెన్ గురించి తెలుసుకొన్నాక ఆధ్యాత్మికత అంటే ఇంటరెస్ట్ పెరిగింది.  ఆధ్యాత్మికత లో పడిపోయాను”
“అంటే నువ్వు సంపాదించిన డబ్బంతా జనాలకు దానం చేసే ఆలోచన ఉందా? అలా ఉంటే నాకో కోటి పడెయ్య రా బాబూ..”
“అది చాలా ఇమ్మెచ్యూర్ ఆలోచన. నా డబ్బంతా నీకు రాసిస్తే నీకు సాధించటానికి ఏమీ ఉండదు..అంటే డబ్బు రాక తో పాటే నీకు సుఖాన్ని సాధించే అవకాశం పోయిందన్నమాట “,అని నవ్వాడు అభి.
“నాకు ఇప్పుడు అర్ధమయ్యింది..నీకు డబ్బు లో కిక్ పోయింది…ఆధ్యాత్మికత లో కిక్ వెతుకుకొంటున్నావ్”
అభి ఓ చిరునవ్వు పడేసి,”అంతే అనుకో..” అన్నాడు.
“ఇంతకీ బాబా గారు ఏమి చెప్తాడేమిటి?”
“దేవుడూ…మోక్షమూ..పరమార్ధమూ..ఆధ్యాత్మిక అనుభవమూ.సమాధి స్థితీ..జీవిత పరమార్ధం..బ్లా బ్లా…”,ఇలాంటివి అని “ఏం? నువ్వు కూడా వస్తావా..నా దగ్గర ఒక కాంప్లిమెంటరీ పాస్ ఉంది”, అని..రాము చేతి లో ఒక చీటీ పెట్టాడు.
“నాది ఓ అమాయకమైన ప్రశ్న, “చిన్నప్పుడు మన ఊళ్ళో పూనకం వచ్చి డొల్లిగింతలు పెట్టే వాళ్ళని చూశాను. వాళ్ళు ఒక ట్రాన్స్ లాంటి స్థితి లో ఉన్నట్లు అనిపించేది. వాళ్ళకు ఏదైనా నార్కోటిక్ ఇచ్చినా అలా ప్రవర్తిస్తారేమో అనిపించేది..అలానే సమాధి స్థితి కూడా ఏదైనా డ్రగ్ ఇస్తే రావచ్చేమో?”
“ఇంత వరకూ కనిపెట్టలేదు..ఇక ముందు రావచ్చేమో…మెదడుకు ఏదైనా ఆపరేషన్ చేసి కూడా ఆ స్థితి కలిగించ వచ్చేమో..””
“అంటే మన బుర్ర బయటి నుంచీ ఏ శక్తీ పని గట్టుకొని,మన అర్హత ని బట్టి ఆ స్థితి కలిగించటం లేదంటావా?”
“బయట ఏదో ఉందనే అనిపిస్తుంది…ఇలాంటి ప్రశ్నలకి బాబా గారు …నేతి..నేతి అని ఒక ఎక్జాంపుల్ చెప్తారు. మన ప్రయత్నం వలన ఆ స్థితి చేరలేమంటారు ఆయన. అంటే మన బయట నుంచీ ఎవరో నడిపిస్తున్నట్లే కదా..”,అన్నాడు అభి.
“ఆ… అలా అనేముంది..మనం రోజూ చేసే పనులలో నే చాలా మన ప్రయత్నం వలన సాధించలేం. నేను ఉన్నపాటున సచిన్ టెండుల్కర్ అయిపోవాలంటే అవ్వగలనా..ఇప్పటికిప్పుడు నిద్రపోవాలంటే వస్తుందా..అలానే కారు నేర్చుకోవటానికి ప్రయత్నం కావాలి…ఒక్కసారి నేర్చుకొన్న తరువాత..మన ప్రమేయం లేకుండానే రిఫ్లెక్స్ తో కారు నడిపేస్తాం..అలా అని ప్రయత్నం నిరుపయోగం అని కాదు.మనంచేరాలన్న స్థితి కి కావలసిన పరిస్థితులను కలిపించుకొన టానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితులను కలిపించుకొంటే మనకు కావలసిన స్థితి అదే వస్తుంది…ఇల్లు కట్టాలంటే మట్ట కొట్టాలి కదా? నేను మనసు తో అదే పని గా ప్రయత్నిస్తాను అంటే ఇల్లు ప్రత్యక్షం కాదు. అలానే ఇప్పటి కిప్పుడు నేను సంతోషం గా అవ్వలంటే కాలేను కదా.. నేను సంతోషం గా ఉండటానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకొంటే సంతోషం అదే వస్తుంది. సంతోషం మనం ఉండే పరిస్థితులకి మన రెస్పాన్స్ మాత్రమే.”
“నాకు ఏపని చేసినా సంతోషం కలగట్లేదు..అలాంటప్పుడు సంతోషమే ఒక లక్ష్యం అవుతుంది, ఇల్లు కట్టటమో..కల్లు తాగటమో కాదు”
“ఇంతకీ ఆ సమాధి స్థితి కి చేరటానికి ఏ పరిస్థితులను కల్పించాలి?” అడిగాడు రామారావు.
“అది ‘కండిషన్ లెస్ స్టేట్’..ఏ పరిస్థితుల వలనా ఆ స్థితి కి చేరలేం”
“ఇది మరీ చోద్యం, అంటే బాబా గారు కేవలం అదృష్టం వలన ఆ స్థితి కి చేరారా? మిగిలిన వారు ఆ స్థితి కి చేరతారో లేదో ఆయనకే తెలియదు..ఇంకా ఈ సమావేశాలు ఎందుకు..ఈ టికెట్లు ఎందుకు? అది సరే… ఈ ప్రపంచం ఎలా పుట్టిందీ…సమయం ఎలా పుట్టిందీ…ప్రపంచం పుట్టకముందు ఏమి ఉందీ..ఇలాంటి ప్రశ్నలకు ఆయన దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా..? నాకు ఇలాంటి విషయాలంటే మా చెడ్డ ఆసక్తి రా”
“ఆయన ఎప్పుడూ సమయం లేని అనుభూతుల గురించి మాట్లాడుతారు..అయినా నీకు ఇంటలెక్ట్యువల్ ఆన్సర్స్ కావాలి..ఆయన ఇచ్చేవి మిస్టికల్ ఆన్సర్స్..”
“ఇంతకీ జీవిత పరమార్ధం ఏమని చెప్పారే బాబా గారు?”
“అది మనిషిని బట్టి మారుతుంది..అందరికీ కామన్ గా ఉండే పరమార్ధం జీవితాన్ని జీవించటమే. బిగ్ పిక్చర్ చూస్తే అంతే మరి. ఎందుకంటే అందరమూ చావవలసిన వాళ్ళమే. చివరికి జీవితం నుంచీ ఏమీ ఆశించలేం. మనం సంపాదించామనుకొనే డబ్బూ, పేరూ, పలుకుబడీ అన్నీ కాలగర్భం లో కలిసిపోయేవే.  కొన్ని లక్షల ఏళ్ళ తరువాత..అప్పటికి ఇంకా మానవ జాతి మనుగడ సాగిస్తూ ఉంటే..జనాలు గాంధీ మహాత్ముడి పేరు కూడా మర్చి పోతారు గదా..! అందుకే కృష్ణ భగవానుడు  నిష్కామ కర్మ గురించి చెప్పింది.” అన్నాడు అభి.
“ఏంటో రా నాయనా, నావన్నీ చిన్న చిన్న కోరికలు..అవి కూడా తీర్చడు భగవంతుడు”.
“నిజం చెప్పాలంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి రా..నీకు ప్రయత్నిచటానికి చాలా మిగిలి ఉంది..ఐనా సక్సెస్ అనేది సబ్జెక్టివ్..నా దృష్టి లో నువ్వే సక్సెస్ ఫుల్..చక్క గా భార్యా పిల్లలతో కాలం గడుపుతున్నావు..నాకు చూడు ఏమి చేసినా సంతోషం రాదు..కాబట్టీ ఒరేయ్ రామూ ‘బీ హాపీ'”, అని  బాబా గారి ప్రసంగం హాల్లోకి దూరాడు అభీ .
రాము బాబా గారి ప్రసంగం పాస్ ‘డస్ట్ బిన్’ లో వేసి, ఇంటి దారి పట్టాడు.

అయిపోయింది