రైలు ప్రయాణం – ఆధుని’కులం’

ఓ అమెరికా వాడి రైలు బండి ప్రయాణం

chennai
chennai
chennai central lo america vaadu
chennai central lo america vaadu


ఉదయం ఎనిమిది గంటలు.చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ఉన్న పెద్ద టీవీ తెర ముందు కూర్చొని, తీరికగా ఒక ఇంగ్లీష్ నవల పేజీలు తిప్పుతున్నాడు హారీ. పక్క సీట్ లో ఉన్నతన లాప్ టాప్ బ్యాగ్ వైపు అప్పుడప్పుడూ చూస్తున్నాడు.

“ఇండియా లో దొంగతనాలెక్కువ. జాగ్రత్త గా ఉండాలి”, అని చెప్పాడు హారీ అనబడే హరికృష్ణ  కి వాళ్ళ ‘డాడ్ అనబడే నాన్న’. ఆయన అమెరికా లోని కాలిఫోర్నియా లో ఉంటాడు.

“ఎక్స్ క్యూజ్ మీ..కెన్ ఐ సిట్ హియర్?”, ఎవరో అంటే తలెత్తి చూశాడు హారీ. ఓ వ్యక్తి పక్క సీట్లో ఉన్న హారీ లాప్ టాప్ వైపు చెయ్యి చూపిస్తూ అడుగుతున్నాడు.

“హౌ కెన్ ఐ టెల్ ఇఫ్ యు కెన్ సిట్ ఆర్ నాట్..ఇఫ్ యువర్ బాక్ ఈజ్ నాట్ స్ప్రేయిండ్ యు షుడ్ బి ఏబుల్ టు సిట్”  అని పెద్దగా నవ్వేశాడు హారీ.

తన లాప్ టాప్ తీసుకొని ఒళ్ళో పెట్టుకొని పక్క సీట్ వైపుకి చేత్తో చూపిస్తూ, “అయాం కిడ్డింగ్…ప్లీజ్ సిట్” అన్నాడు ఆ మనిషి తో.  “ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్నీ యు నో. సం టైంస్ వి అమెరికన్స్ గెట్ ఇట్ రాంగ్” అన్నాడు అమెరికన్ ఆక్సెంట్ లో.

“మీరు అమెరికనా?” ఇంగ్లీష్ లో అన్నాడా వచ్చిన వ్యక్తి, పక్క సీట్లో కూర్చొంటూ.

“మా నాన్న డెబ్భై ల లో అమెరికా లో సెటిల్ అయాడు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కాబట్టీ నేను ఖచ్చితం గా అమెరికన్ నే”, అన్నాడు హారీ ఒకింత గర్వం గా . .

సంభాషణ ఇంగ్లీష్ లోనే కొనసాగుతోంది..
“నా పేరు సుబ్బారావు”, అని చేయి చాపాడు వచ్చినతను.

“హారీ …హరికృష్ణ..” అని చెయ్యి కలిపాడు హారీ.

“మీరు ఎక్కడికి వెళ్తున్నారు?”

“హైదరాబాద్”.

“ఓ..! నేనూ అక్కడికే..నేను విజయవాడ వరకూ నవజీవన్ లో వెళ్ళి అక్కడి నుంచీ కోణార్క్ పట్టుకుంటాను..మరి మీరు?” అడిగాడు సుబ్బారావు

“నేనూ అంతే ”

“పగలు ప్రయాణం పెట్టుకున్నారేమిటి సార్?అయినా మీరు ట్రైన్ లో వస్తున్నారేంటండీ..ఫ్లైట్ టిక్కెట్లుదొరకలేదా?”

హారీ, “వీడికెందుకు, నోసీ ఇండియన్”, అని మనసులో అనుకొని, ఇలా అన్నాడు, “హైదరాబాద్ నుంచీ వచ్చేటప్పుడు ప్లేన్ లోనే వచ్చాను. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్లో పని ఉండి వచ్చాను. కానీ ఇప్పుడు ట్రైన్ లో వెళ్తున్నాను. దీనికి ఓ కారణం ఉంది. నేను ఒక ‘ఇండో అమెరికన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం’ లో రీసెర్చ్ చేయటానికి అమెరికా నుంచీ హైదరాబాద్ వచ్చాను. ‘ద సోషల్ గ్రూప్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’  అనే విషయం మీద పరిశోధన చేస్తున్నాను. మా నాన్న చెప్పాడు, “ఆంధ్ర లో ఉండే వివిధ వర్గాల ప్రజల గురించి కొంచెం ప్రాక్టికల్  గా తెలుసు కోవాలంటే ఓ సారి సెకండ్ క్లాస్ లో ట్రెయిన్ ప్రయాణం చెయ్యి” అని.  దీనికి పగలు ప్రయాణం అయితేనే మెరుగు…కాస్త జనాలతో మాట్లాడవచ్చు.. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.”

“మీరు జెనరల్ క్లాస్ లో వెళ్తే మీకు జనాల గురించి ఇంకా విపులం గా అర్ధమౌతుంది…కానీ మీరు జెనరల్ లో ప్రయాణం చెయ్యలేరులెండి….ఇంతకీ.. మీకు తెలుగు వచ్చా?”

“తెల్గూ అర్ధమౌతుంది..కొంచెం నెమ్మది గా మాట్లాడ గలుగుతాను”,

“కానీ మీరు ఇక్కడి సామాన్య జనాలతో మాట్లాడటం చాలా కష్టం కదా…!మీ అమెరికన్ ఆక్సెంటూ..మీ తెలుగూ వాళ్ళకి అర్ధం కాదు”,సందేహం వెలిబుచ్చాడు సుబ్బారావు.

“చెన్నై లో ఉండే తెలుగు ఫ్రెండ్ ఒకతను నా కూడా వస్తానన్నాడు.చివరి నిమిషం లో ఫోన్ చేసి రానని చెప్పాడు”, అని వాటర్ బాటిల్ ఎత్తి నీళ్ళు తాగి,”మీరేం చేస్తారు?” అన్నాడు హారీ.

“నేను గ్రాడ్యుయేట్ అయ్యింది కామర్స్ లో. ఓ ప్రైవేట్ బాంక్ లో మానేజర్ గా పని చేశాను..దాదాపు ఆంధ్రా అంతా తిరిగాను.. ఓ సంవత్సరం కిందట రిజైన్ చేసి హైదరాబాద్ లో సొంత వ్యాపారం ఒకటి పెట్టాను”, అని,  “అవునూ మీరు ఆంధ్రా లోని జాతుల గురించి అధ్యయనం చేస్తున్నారు కదా, మీ కులమేదో మీకు తెలుసా?”

“వీడేంటబ్బా..! ఇవ్వక పోయినా చనువు తీసేసుకొంటున్నాడు!”, అని మనసు లోనే అనుకొని, “నా మాతృభాష తెలుగు అని తెలుసు…ఇండియా లో కులాలు అని ఉంటాయి అని తెలుసు…కొన్ని పై కులాలు..కొన్ని కింది కులాలు…కానీ నా కులం నాకు తెలీదు…బహుశా  మా డాడ్ కి తెలిసి ఉంటుంది. ఈ సారి నాన్న తో చాట్ చేసినప్పుడు అడగాలి” అన్నాడు. ఒక్క క్షణమాగి, “మీ కులమేమిటి?” అనడిగాడు.

“నాకూ నా కులం తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ హైదరబాదు లోని ఓ అనాధాశ్రమం లోపెరిగాను. వార్డెన్ నా పేరు సుబ్బారావు అని పెట్టాడు. అది కామన్ గా ఉండే పేరు కదా? నేను నల్లగా ఉన్నాను కాబట్టీ నా ఇంటి పేరు నల్లతోలు అని రిజిస్టర్ లో రాశాడు. సో, నా పేరు నల్ల తోలు సుబ్బారావు అయ్యింది”

హారీ, “ఏమి కథలు చెప్తున్నాడు..!” అనుకొని..”ఏమైనా ఇండియన్స్ తో జాగ్రత్త గా ఉండాలి..డాడ్ చెప్పనే చెప్పాడు”, అనుకొన్నాడు.

” మీకు ఇండియా ఎలా అనిపిస్తోంది సార్ ?”

“ఇండియా నాకు కొత్తేమీ కాదు. మా డాడ్ తో పాటు వస్తూ ఉండే వాడిని..కానీ ఈ రైల్వే స్టేషన్ లో ఈ జనాలను చూసిన తరువాత ఈ ప్రయాణం ఎలా చేయగలనా అనిపిస్తోంది. దానితో పాటు జనాల తో మాట్లాడాలి..నా ఫ్రెండేమో రాలేదు.”

“మీ రీసెర్చ్ కోసం దానికి సంబనిధించిన పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది కదా?  మీరు ఈ ట్రెయిన్ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారో నాకు ఇంకా అర్ధం కావటం లేదు”

“పుస్తకాలు ఒక విషయం గురించి లాంగ్ వ్యూ ని ఇస్తాయి. అడవి లో ఉన్న ఒక కొండ ఎక్కి కిందకి చుట్టూ చూశామనుకోండి, దూరం గా పచ్చటి చెట్లు గుబురు గా కనపడతాయి. కానీ ఆ చెట్లకింద ఏమి ఉందో కనపడదు. ఏ చెట్టు ది ఏ కాయో తెలియదు. ఇదంతా తెలియాలంటే అడవి లోకి వెళ్ళి చెట్ల కింద చూడాల్సిందే కదా?”

దానికి సుబ్బారావు, “నా బ్రతుకు అంతా ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవి లో చెట్లకిందే గడిచింది. ఏ చెట్టు ఏ జాతిదో, ఏ చెట్టు కింద ఏ మొక్క పెరుగుతుందో ఇట్టే కని పెట్టేస్తాను.ఏ చెట్టు కి ఏ కాయ కాస్తుందో..ఆ కాయ రుచి ఏమిటో కూడా చెట్టుని చూసి కనిపెట్టేస్తాను. మీకు ఏమైనా సందేహాలుంటే నన్నడగండి” అన్నాడు సుబ్బారావు.
“వీడేంటబ్బా అందిస్తే అల్లుకు పోయే వాడిలా ఉన్నాడు!”, అని తనలోనే అనుకొని, “చూడండి మిస్టర్ రావ్, నాకు ఈ ఆంధ్రా లో ఉన్న సమాజం అనేది మీరు కాలేజీ లో చదివిన అకౌంటెన్సీ లాంటి ఒక సబ్జెక్ట్ లాంటిది. దీని గురించి నేను కొండ మీది నుంచీ చూసి నా బుధ్ధి మాత్రం ఉపయోగించి తెలుసుకొంటున్నాను. దీనికి నా  భావావేశాలతో ఏ మాత్రం సంబంధం లేదు. నా అంచనా ప్రకారం మీ భావావేశాలకూ లంకెలేదు. ఇక్కడి సాంఘిక వ్యవస్థ కి మీరు కూడా ఒక బయటి వ్యక్తే . కానీ మీరు ఇక్కడి పరిణామాలన్నింటినీ దగ్గర గా చూశారు. “నిజమైన వ్యక్తులూ, ఈ సమాజిక వ్యవస్థ లో వారి సాధక బాధకాలూ, ఆవేశ కావేశాలూ. ఈ ఆంధ్ర లో ఒక దళితుడి మనో భావాలేమిటి…ఒక ముస్లిం ఫీలింగ్స్ ఏమిటి…ఒక అగ్ర కులస్థుడి పరిస్థితి ఏమిటి? ఒక తెలంగాణా వాది ఆవేశం ఎందుకు?”,… ఇదీ నాకు కావలసినది. మీరు మంచి కలుపు గోలు వ్యక్తి లా ఉన్నారు. ఈ ప్రయాణం లో మీరు నాకు మామూలు జనాలతో ఒక యాంకర్ లా పనిచేస్తారా? దానికి మీకు కొంత డబ్బు కూడా ఇస్తాను” హారీ మైండ్ కి రైల్లో జనాలతో మాట్లాడటానికి ఇంతకంటే మంచి తోవ కనపడలా.

“సరే”, అనేశాడు సుబ్బారావు.”మీ సీట్ నంబర్ ఎంత సార్?” అని హారీ దగ్గరినుంచీ టికెట్ తీసుకొని చూసి,”ఓ కే సార్  టీ సీకి చెప్పి, నా సీట్ కూడా మీ సీట్ దగ్గరికి మార్పించుకొంటాను”, అన్నాడు సుబ్బారావు.

ఈ లోగా వాళ్ళ ట్రైన్ బయలుదేరుతున్నట్లు అనౌన్స్ అయ్యింది. ఇద్దరూ లేచి ట్రైన్ వైపు నడక సాగించారు.

*************************

తమిళుడి లాగా అడ్డపంచె చుట్టి ,  ఓ చేతి లో సిగరెట్ పట్టి, ఇంకో చేతిలో క్యాష్ బాగ్ తో ప్లాట్ ఫారం మీదికొచ్చాడు మాగుంట దయాకర రెడ్డి. జుట్టు అక్కడక్కడా తెల్లబడింది. ఆయనకో నలభై ఐదు ఏళ్ళు ఉండవచ్చు. తొంభయ్యవ దశకం మొదట్లో రొయ్యల చెరువులేసి బాగానే  సంపాదించాడు. మెడలో బంగారు గొలుసూ చేతిలో నాలుగు వేళ్ళకీ ఉంగరాలు.

రొయ్యల చెరువు ల లో దయాకర రెడ్డి పార్ట్-నర్ లోకేశ్వర రెడ్డి కీ, అతనికీ మధ్య వాటాల విషయం లో ఏవో స్పర్ధలు వచ్చాయి. దానితో తన లాయర్ ని కలవటానికి చెన్నై వెళ్ళి  వస్తున్నాడు దయాకర రెడ్డి.

ప్లాట్ ఫాం మీద నాటు గా ఉన్న ఓ పల్లెటూరి పడుచు కనపడింది. ఆమె ను చూస్తే కావలి లో ఉన్న తన కీప్ గుర్తుకొచ్చింది దయాకర్ రెడ్డి కి. “దీని గుడ్డలూడ దీస్తే బ్రమ్మాండం గా ఉంటది”, అనుకొన్నాడు మనసులో. ఆయన రిజర్వేషన్ చేయించుకోలేదు కానీ, “టీ సీ కి ఓ యాభయ్యో వందో కొడితే ఫైను రాసేస్తాడుగదా.. . దానికేమీ భయపడ బళ్ళా” అనుకొని కదులుతూ ఉన్నసెకండ్ క్లాస్ భోగీ లోకి ఎక్కాడు.  హారీ, సుబ్బారావూ అక్కడ కూర్చొని ఉన్నారు. దయాకర రెడ్డి సిగరెట్ బయటికి విసిరేసి బాగ్ లోంచీ ఆ రోజు సాక్షి పేపర్ తీశాడు.

Indian Train Journey
Indian Train Journey

సుబ్బారావు ఆయన్ని చూసి, “ఎక్కడికెళ్తున్నారు సార్?” అన్నాడు.
“నెల్లూరు పోవాల”,అన్నాడు రెడ్డి. “మరి మీరు?” అని ఇద్దర్నీ చూశాడు. వాళ్ళు చెప్పారు.
“నెల్లూరంటే రొయ్యల చెరువులకి ప్రసిధ్ధి కదా. ఇప్పుడెలా ఉన్నాయి సార్?”
“బాగానే ఉండాయి..కానీ ఈ మధ్య కౌంటు తగ్గుతాంది…రేటూ తగ్గింది..”, అని బాగ్ లోంచీ సాక్షి పేపర్ తీశాడు.

ట్రయిన్లో మిడ్డీ వేసుకొన్న ఓ టీనేజ్ అమ్మాయి పోతోంది. ఆ అమ్మాయి వైపు అసహనం గా చూసి, “మాధవి లా చక్క గా చుడీదార్ లు వేసుకోవచ్చు కదా..!”, అనుకొన్నాడు తన కూతుర్ని గుర్తు తెచ్చుకొంటూ. పేపర్ లో హెడింగ్స్ చదవటం మొదలెట్టాడు.

సుబ్బారావు పేపర్ లో రెండు షీట్లు అడిగి తీసుకొని చదువుతూ..”సార్, రాజశేఖర రెడ్డి చావు వెనక కుట్ర ఉందంటున్నారే ..నిజమేనంటారా..?” అన్నాడు.

వెంటనే దయాకర రెడ్డి, “నిజమేనండీ, పెద్ద లెవల్లోనే ఏదో కుట్ర జరిగి ఉంటుంది”, అన్నాడు.

అది విని, “ఈయన రెడ్డి లాగా ఉన్నాడే..అయినా కన్ ఫం చేసుకొందాం..”, అనుకొని,సుబ్బారావు హారీ కి మాత్రమే కనిపించేలా కన్ను గీటి, దయాకర్ రెఆడ్డి తో “నా పేరు కిషోర్ నాయుడు..ఈ సార్ పేరు అశోక్ రెడ్డి”, అన్నాడు.

“నా పేరు దయాకర రెడ్డి”, అని హారీ వైపుకు తిరిగి “మీరు ఏం చేస్తారండీ” అన్నాడు దయాకర రెడ్డి.

హారీ వచ్చీ రాని తెలుగు లో ఏదో చెప్పాడు.

రెడ్డి, “సార్ మీరు మాట్లాడింది ఒక్క ముక్కా అర్ధం కాలా”, అంటూ నవ్వేశాడు.

మళ్ళీ సుబ్బారావే అందుకొని,”ఏదేమైనా ‘వైఎస్సార్ ‘గొప్ప నాయకుడు సార్. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. రాష్ట్రమంతా గొడవలుగా ఉన్నాయి. అతను ఉండి ఉంటే ఈ గలటా లు వచ్చేవి కావు” అన్నాడు సుబ్బారావు.

హారీ తన మణికట్టుమీద గడ్డం ఆనించి దయాకర్ మొహాన్ని పరిశీలన గా చూడసాగాడు.

దయాకర్ రెడ్డి మనసులో, “వీడు చెప్పే మాటలే నమ్మాలి. నన్ను ఉబ్బేసి  బురిడీ కొట్టిద్దామనుకొంటున్నాడు”, అనుకొని, కొంచెం బిగదీసుకొని,పెదాలు సరిగా విడివడకుండా పైకి మాత్రం”కరక్టే! గట్టోడే!”,అన్నాడు.

“కానీ ఆయన హయాం లో కరప్షన్ కూడా ఎక్కువ గానే జరిగినట్లుంది సార్..! ”

దయాకర్ రెడ్డి లోపల, “అసలు బుధ్ధి బయట పెడుతున్నాడు”, అనుకొని, పైకి మాత్రం, కళ్ళు కొద్దిగా చిట్లించి,”తినేటప్పుడు తిన్నాడు, చేసే టప్పుడు చేశాడు. ఈ రోజులలో తినకుండా ఎవరు చేస్తాండారు?”, అన్నాడు దయ.

“వాళ్ళ కొడుకు జగన్ కి మైనింగ్ కుంభకోణం తో సంబంధాలున్నాయంటున్నారు కదా సార్?”

“ఆ ..,అదంతా అపోజిషనోడు చేసే గోల. కరక్టు కాదు. కుర్రోడు వాళ్ళ నాన్న లాగే స్టఫ్ఫున్నోడు”, అన్నాడు దయ.

“మీకు జగన్ వ్యక్తిగతం గా తెలుసా?” అన్నడు హారీ.

దానిని సుబ్బారావు తెలుగు లోంచీ తెలుగు లోకి అనువదించి రెడ్డి ని అడిగాడు.

దయాకర్ మనసులో, “ఈ అశోక్ ఎవరోగానీ నాయుడికి సరైన కౌంటరే ఇస్తున్నాడు. లేకపోతే ఈ కిషోర్ నాయుడు గాడు నాకు కుల తత్వం అంటగట్టటానికి చూస్తున్నాడు”, అనుకొని,”అబ్బే…, వాళ్ళెక్కడ, మనమెక్కడ సార్..! ”

హారీ,”మరి ఆయన స్టఫ్ ఉన్నోడని ఈయనకెలా తెలిసిందభ్భా..!” అనుకొని, “మీకు వై ఎస్సార్ వలన వ్యక్తి గతం గా ఏమన్నా లాభం కలిగిందా?” అన్నాడు హారీ.

హారీ తో,”నాకేమి లాభం?  …..లేదు”,అన్నాడు దయ. “కుర్రాడు డీసెంట్ గా తేల్చేశాడు”, అనుకొన్నాడు.

“ఈ ఇండియన్స్ అంతా ఒట్టి క్లానిస్టిక్ ట్రైబల్ వెధవల్లా ఉన్నారు”, అనుకొన్నాడు హారీ.

“మద్రాస్ లో మీకు ఏం పని సార్?”, అన్నాడు సుబ్బారావు.

మనసులో “వీడికెందుకు?”, అనుకొని, పైకి మాత్రం,”బిజినెస్” అన్నాడు, ముక్త సరిగా.

ట్రైను స్పీడందుకొంది.దూరం గా ఉన్న తాడి చెట్లూ, పొలాలూ వృత్తాకారం లో, ట్రైన్ కి ఎదురు  దిశ లో తిరుగుతున్నాయి.కను పాప పై జామెట్రీ, ఆప్టిక్స్ ల మాయాజాలం..!

ఇంతలో దయాకర రెడ్డి టాయ్ లెట్ కి వెళ్ళాడు.

సుబ్బారావు హారీ తో, “సార్ మనం ఇలానే వచ్చే వాళ్ళతో మాట్లాడి తే సరి పోతుందా? లేక పోతే ట్రైను అంతా తిరిగి ఫ్రాంక్ గా సార్ కి ఇంటర్వ్యూ కావాలని చెప్పి జనాలతో మాట్లాడదామా?”,అన్నాడు.
“ఇంటర్వ్యూ అయితే జనాలను సహజమైన మూడ్ లో చూడ లేము. మనం తక్కువ మందిని కలుసుకో గలిగినా ఈ పధ్ధతే మెరుగు అన్నాడు”, హారీ.

దయాకర్ రెడ్డి తిరిగి వచ్చి,హారీ పక్కన కూర్చొని, హారీ వైపుకి వంగి, “ఏం సార్, పాపం అమెరికా అంతా అదేంటో రిసెషన్ లో పడినదంటే! ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఆడ?” అన్నాడు హారీ తో.

” ‘యూ ఎస్ ఏ’ కి ఏమీ పరవాలేదు..ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ సూన్..” అన్నాడు హారీ ఒకింత గర్వం గా.
సుబ్బారావు లోపల్లోపల, “ఈ అమెరికా మనిషి కి కూడా కుల పిచ్చి ఉంది..ఈయన కులం పేరు అమెరికా కులం” అనుకొని, “,  “అమెరికా మీద జాలి చూపించొద్దు. సార్ కి కోపమొస్తుంది. ఆయన అమెరికా వాడే కదా”, అన్నాడు.
ఈ విషయం దయాకర రెడ్డి కి అస్సలు అర్ధం కాలా, ” సార్ అమెరికా వాడు ఎలా అవుతాడు? వాళ్ళ నాన్న… కాదు..వాళ్ళ తాతల నుంచీ అమెరికా లో ఉన్నా, సారు ఇండియనే”, అన్నాడు.

గూడూరు కొద్ది ఇంకా కొంత దూరం ఉంది.దూరం గా ఒక వైపుకి చూపుడు వేలు ని చూపిస్తూ, హారీ తో, ” అదిగో ఆ దిక్కు లో అ ఉంటాయి మా చెరువులు. నెల్లూరు ఎప్పుడన్నా వస్తే చెప్పండి చూపిస్తా”, అన్నాడు దయ.
“అబ్బే.., ఆ ఉద్దేశమేమీ లేదు”, అన్నాడు హారీ.

ట్రెయిన్ ఓ దళిత బస్తీ గుండా పోతోంది. అంబేద్కర్ విగ్రహం ఒకటి కనపడుతోంది. హారీ అన్నాడు, “ఐ గెస్ థట్స్ ది బస్ట్ ఆఫ్ అంబేద్కర్. ఆయన భారత రజ్యాంగ నిర్మాత కదా?”

రెడ్డి, “అందుకొని.ఆయనే రిజర్వేషన్లు పెట్టాడు. ఈ రిజర్వేషన్ల వలన మా లాంటి వాళ్ళకి చానా నష్టం. చాలా వరకు మాలా మాదిగలు వాటి వలన బాగు పడ్డారు” అన్నాడు.

సుబ్బారావు,”ఏం బాగు పడటం లే సార్. ఇంకా చాలా చోట్ల అణచివేత కు గురౌతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న చుండూరు సంఘటనే ఒక రుజువు”,అని కీ ఇచ్చాడు.

రెడ్డి కి ఆవేశం వచ్చింది. ఆయన ఆలోచనలు ఆవేశాన్ని ఫాలో అవ్వసాగాయి. “మరి కారంచేడు లో వాళ్ళని పూజించారా..?ఆడ వాళ్ళని అల్లరి చేస్తే ఎందుకు కొట్టరు? మొన్నటి దాకా మా మోచేతి నీళ్ళూ తాగే వాళ్ళు మా ఆడ వాళ్ళని అల్లరి పెడతారా..?”, అన్నాడు.

సుబ్బారావు, “కొట్టటం కాదు సార్..చంపారు కదా?”, అన్నాడు.
దానికి రెడ్డి,”వాళ్ళూ తరవాత చంపారు కదా?”, అన్నాడు.

రెడ్డి ఆవేశం చూస్తే ఒక సంఘటన గుర్తుకొచ్చింది హారీ కి. అతను రీసెర్చ్ మొదలు పెట్టటానికి ముందు అమెరికా లో ఒక చిన్న ఐ టీ ఉద్యోగం చేశాడు. ఒక సారి హారీ, వాళ్ళ బాస్ చేసిన డిజైన్ లో ఒక లోపాన్ని కొంచెం హార్ష్ గా విమర్శించి, ఆ డిజైన్ తో ముందుకు పోవటానికి నిరాకరించాడు. తరువాతి రోజు హారీ ని వాళ్ళ బాసు ఫైర్ చేశాడు.ఒక చిన్న ధిక్కారానికి హారీ పెద్ద మూల్యం చెల్లించుకో వలసి వచ్చింది. పవర్ ఈక్వేషన్స్ అలా ఉంటాయి మరి.

సుబ్బారావు ఇచ్చిన కీ దయాకరరెడ్డికి ఏమాత్రం నచ్చలా.మనసులోసుబ్బారావుని, “ఈడు ఏ నాయుడో..పెతోడూ నాయుడే..లేబర్ నాకొడుకు”, అని తిట్టుకొన్నాడు. ఈలోగా ‘టీ సీ’ వచ్చి టికెట్లు చెక్ చేయటం మొదలు పెట్టాడు. రెడ్డి నుంచీ ఓ యాభై నొక్కి, ఆయనకు పక్క భోగీ లో వేరే సీట్ చూపించి, అక్కడ కూర్చోమని చెప్పి,వెళ్ళిపోయాడు. రెడ్డి పేపర్ లో షీట్స్ అక్కడే మర్చిపోయి పక్క భోగీ లోకి వెళ్ళిపోయాడు.

************************

Nellore
Nellore

ట్రెయిన్ నెల్లూరు స్టేషన్ కి వచ్చింది. హారీ సుబ్బారావు ని అడిగాడు, “మీకు పెళ్ళి అయిందా?”.

“లేదు సార్, కుటుంబ నేపధ్యమూ కులమూ మతమూ లేని వాడికి పిల్లనెవరు ఇస్తారు? నాకేమో ఆడ పిల్లలతో మాట్లాడే కలుపుగోలు తనం లేదు”

జనాలు సందడి గా ట్రెయిన్ ఎక్కుతున్నారు.
షేక్ మస్తాన్ వలి తన పద్దెనిమిదేళ్ళ కూతురు రజియా తో కలిసి భోగీ ఎక్కాడు. వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొని,”ఆడ కూర్చోమ్మా”,అని చెయ్యి చూపించి కూతుర్ని కూర్చోమన్నాడు.
“ఎక్కడి వరకూ సార్”, అన్నాడు సుబ్బారావు మస్తాన్ తో.
“ఓంగోలు దాకా సార్. కసునూరు దర్గా కి వచ్చినాము. అమ్మాయి ఎంసెట్ రాస్తా ఉంది, ఇంజనీరింగ్ కి. బాగా రాయాలని దర్గా కి పోయి వస్తన్నాము”, అన్నాడు మస్తాన్ వలి.
సుబ్బారావు తన లో, “తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు..దూదేకుల సాయిబ్బేమో…!”, అనుకొని,  ఆ అమ్మాయి వంక చూసి..”బాగానే ఉంది… బురకా వేస్కోలేదేమిటో…!” అనుకొన్నాడు.
సుబ్బారావు కి తను చదువుకొనేటప్పుడు తన దోస్తు అనే ఒక మాట గుర్తుకొచ్చింది,  “తులం బంగారమిచ్చి అయినా సరే తురకమ్మాయి పక్క కి చేరాలి…”,నవ్వుకొన్నాడు సుబ్బారావు. మస్తాన్ వలీ వైపు చూశాడు. ” ఆ గెడ్డం ఎందుకో వీడికి..! మీసాలు మాత్రం లేవు..వీడి గడ్డం తరగా..నెత్తి మీద ఆ కాప్ ఎందుకు?నేనే ముస్లిం నని పెద్ద బడాయి..జన జీవనం లో కలిసి పోవచ్చు కదా…?”

ఇంత లో ఓ ముస్లిం కొలీగ్ చెప్పింది గుర్తుకు వచ్చింది సుబ్బారావు కి. …దాని ప్రకారం..”గెడ్డం పెట్టుకొంటే ఎక్కువ పుణ్యం లాంటిది వస్తుందట…”సాయిబ్బుల గడ్డాన్ని, ఒక హిందువు బొట్టు పెట్టుకోవటం తో సమానం గా చూడు భాయీ”, అన్నాడు వాడు సుబ్బారావు తో.
సుబ్బారావు ఆలోచనల పరంపర కొన సాగుతోంది, “అయినా నాకెందుకు వీడి మీద అసహనం…? నేను కూడా ఒక సాయిబ్బు గా పుట్టానేమో ఎవరికి తెలుసు? పెరగటం మాత్రం హిందూ పధ్ధతికి దగ్గరగా పెరిగాను..ఒక వేళ ముస్లిం గా పెరిగితే ఇతనిలానే గడ్డం పెంచుకొనే వాడినేమో…! నేను అనాధని. నాకు సాంస్కృతికం గా వంశపారంపర్యం గా వచ్చింది ఏమీ లేదు”, అనుకొంటూ హారీ వైపుకి చూశాడు. ట్రెయిన్ కదిలి ఊరి బయటకు వచ్చింది. హరీ పొలాల వైపుకు చూస్తున్నాడు. సుబ్బారావు, “ఇతను కూడా సాంప్రదాయ పరం గా ఒక అనాధే.ఇతని తాతల పధ్ధతుల గురించి ఇతనికి ఏ మాత్రం అయిడియా ఉంటుంది?”, అనుకొని, “సార్ మీకు రామాయణ భారతాలు తెలుసా?”, అన్నాడు హారీ తో.
దానికి హారీ, “మా నాన్న కి భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టం. నా చేత అన్ని పురాణాలూ చదివించారు.నేను అమెరికన్ అవ్వటానికి ఎంత గర్వ పడతానో నా హిందూ మూలాల గురించి అంతే గర్వ పడతాను. మా అమ్మ అయితే ఇంకా చీరలే కడుతుంది”
సుబ్బారావు కి హఠాత్తు గా వెలిగింది మస్తాన్ వలీ గడ్డమూ నెత్తి మీదటోపీ ఎందుకు పెట్టుకున్నాడో.
“ఇక అసలు పని లోకి దిగాలి అనుకొని”, సుబ్బారావు మస్తాన్ వలీ తో పరిచయాలు చేసుకొని మాటలు మొదలెట్టాడు.

scenary
scenary

“మీరు ఏమి చేస్తారండీ?”
“ఓంగోలు స్కూల్లో సైన్స్ టీచర్ ని”, అన్నాడు మస్తాన్ వలీ.
“మీ అమ్మాయికి ఇంజనీరింగ్ లో సీట్ వస్తే తరవాత పై చదువులకి అమెరికా పంపిస్తారా?”
మస్తాన్ వలీ అవునని తలూపాడు.
“ఆశ్చర్యమే. మీ మతం ఆడ పిల్లలకి విద్య ని ఆమోదించదు కదా?”, అన్నాడు సుబ్బారావు.
“అవన్నీ మూఢ విశ్వాసాలు సార్. ఏ మతం లో అయినా అసలైన విశ్వాసాలు కొన్ని ఉంటే..సామాన్య ప్రజలు ఆచరించే మూఢ విశ్వాసాలు కొన్ని ఉంటాయి”,అని..ఇంకా ఇలా అన్నాడు,”మత స్థాపకులకు సత్య దర్శనమౌతుంది..ఆ సత్యాన్ని మిగిలిన సాధారణ మానవులు చూడటానికి వారు కొన్ని సులువైన సూత్రాలను పొందు పరుస్తారు.  కొందరు స్థాపకులు ఈ సూత్రాలను మార్చే విషయం లో ఉదారం గా ఉంటే మరి కొందరు కఠినం గా ఉంటారు. రెండు విధానాల లోనూ లాభ నష్టాలున్నాయి. మత సూత్రాలను సులువు గా మార్చ గలిగితే, స్థాపకుడి తరువాత వచ్చే సత్య దర్శనం కాని అనుచరులు వక్ర భాష్యం చెప్పటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మత స్థాపకుడి మూల సూత్రాల సారం కల్తీ కాబడుతుంది. అందుకనే మా ప్రవక్త మూల సూత్రాల విషయం లో చాలా స్థిరం గా ఉన్నాడు. అయితే దీని వలన ఒక నష్టం ఉంది. మూల సూత్రాల లో కొన్ని సామాజిక నియమాలకి సంబంధించిన సూచనలు స్థాపకుడి కాలానికి సంబంధించినవి. అవి కాలం తో పాటు మారాలి. ఇస్లాం యొక్క స్థిరమైన విధానం వలన ఈ మార వలసిన విషయాలు కూడా మారలేదు. వీటిని ఎవరికి వారు వ్యక్తిగతమైన స్థాయి లో అన్వయించుకోవాలి. ”

” “మీరు దర్గా కి పోయి వస్తున్నాను”, అంటున్నారు..దర్గా ల కి పోవటం అసలైన ఇస్లాం ప్రకారం సరి కాదు గదా?
“ఆ..ఏదో మా ఆవిడ పోరు భరించలేక వెళ్ళి వస్తున్నాం..”
“ఏదేమైనా మీ మత విషయాల గురించి తెలుగు లో నాతో ఇలా విపులం గా చెప్పిన వాళ్ళు లేరు సార్”, అన్నాడు సుబ్బారావు.
“అక్కడే ఉంది సమస్య..ఇస్లాం గురించిన సాహిత్యం మన తెలుగు లో చాలా తక్కువ. ఎవరైనా పూనుకొని తెలుగులో రాయాలి”, అన్నాడు మస్తాన్.

హారీ కల్పించుకొని, “అమెరికా గురించి మీ అభిప్రాయమేమిటి?”, అన్నాడు మస్తాన్ తో… .
“నాకు అమెరికా జనాల గురించి ఎటువంటి ద్వేషం లేదు సార్. ఇస్లాం ద్వేషానికి వ్యతిరేకం..ఇస్లాం అంటేనే శాంతి అని కదా అర్ధం..నా ప్రాబ్లం బుష్ సమయం లో అమెరికా విదేశీ విధానాల గురించే. ఇప్పుడు పరిస్థితి మెరుగయ్యింది…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే ఒక ముసల్మాన్ కి పుట్టిన వాడు కదా?”

కాసేపాగి మస్తాన్ నమాజుకు లేచాడు. మస్తాన్ నుదుటి మీద అడ్డం గా నల్ల గీత పడి ఉంది. అది చూసి, “అబ్బో సాయిబ్బు గారు భక్తుడే, కోస్తా ముస్లిం ల లో సాధారణం గా ఇంత భక్తి ఉండదే..!”, అనుకొన్నాడు సుబ్బారావు. ఇంతలో అతనికి ఒక సందేహం కలిగింది. “మీరు మక్కా వైపుకి తిరిగి నమాజ్ చేయాలి కదా..ట్రెయినేమో అన్ని దిక్కులలోకీ తిరుగుతూ ప్రయాణం చేస్తోంది..మరి మీకు మక్కా దిశ ఎలా తెలుస్తుంది…ఒక్కో సారి మీరు అదిగో ఆ కనిపించే గుడి లో దేవుడి కి నమాజ్ చేసినట్లు అవుతుంది కదా..?”

మస్తాన్ కి సుబ్బారావు ఎగతాళి చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. “నేను వీళ్ళ బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ మొక్కడమేమిటి…?”,అనుకొన్నాడు. పైకి మాత్రం,”దిక్కు అనేది రయిల్లో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ మనసు లో మక్కా ని పెట్టుకొంటే చాలు…అయినా మీ హిందువులు లింగానికి మొక్కడం కంటే ఇది అన్యాయం కాదు కదా అన్నాడు”.
సుబ్బారావు కి పరిస్థితి సజావు గా లేదనిపించి మౌనం వహించి ఓంగోలు కోసం ఎదురు చూడ సాగాడు.

********************

ongole
ongole

మస్తాన్ నమాజ్ అయ్యేటప్పటికి ఒంగోలు వచ్చేసింది. కూతురి తో సహా ఆయన దిగి వెళ్ళిపోయాడు. మస్తాన్ వెళ్ళిన తరువాత సుబ్బారావు హరీ తో, “దయాకర రెడ్డీ, మస్తాన్ వలీ కేసుల వలన నాకొకటి అర్ధమయ్యింది. జనాల నిజ స్వరూపం తెలుసుకోవాలంటే ప్రైవసీ లిమిట్స్ దాటి వాళ్ళని కెలకాలి. అలా కెలికితే వాళ్ళకు చిరాకు పుట్టి కొట్టినా కొడతారు. కాబట్టీ మిస్టర్ హారీ, ఈ జనాల వలన నాకు కన్నో కాలో పొతే మీదే బాధ్యత. మీరే నష్ట పరిహారం ఇవ్వాలి” అన్నాడు.

దానికి హారీ హాయిగా నవ్వేసి,” మీకు దేహశుధ్ధి జరగకుండా చివరి నిమిషం లో తప్పించుకొనే నేర్పు ఉందని నాకు తెలుసు మిత్రమా. అందుకే ఈ పని మీకు ఇచ్చాను”,అన్నాడు.

ఇంతలో ఒకతను వచ్చి టికెట్ చేతి లో పట్టుకొని, సీట్ నంబర్ల కోసం కిందా పైనా చూస్తున్నాడు. అతని మెడలో సిలువ వేలాడుతోంది. సుబ్బారావు, “మీ సీట్ నంబర్ ఎంతమాస్టారూ?”, అన్నాడు. అతను చెప్పాడు. అతనికి సుబ్బారావు సీట్ చూపించి, “కూర్చోండి” అన్నాడు.

ఆ వచ్చినతను చొక్కా పై రెండు గుండీలూ విప్పదీసి, “అబ్బా..ఏమి ఎండ?” అనుకొంటున్నాడు.
సుబ్బారావు హారీ కేసి తిరిగి, “ఇక్కడ ఉన్న మాకే చాలా వేడి గా ఉంది..అమెరికా నుండీ వచ్చారు..మీకు చాలా ఇబ్బంది గా ఉండి ఉంటుంది”, అన్నాడు.
దీనికి హారీ స్పందించేలోగానే, “ఏమిటి సార్ మీరు అమెరికా నుంచీ వచ్చారా..!”,అన్నాడు ఆ వచ్చినతను, ఆశ్చర్యం గా.
హారీ నవ్వుతూ కిందికీ పైకీ తలూపాడు. సుబ్బారావు అందుకొని హారీ ని పరిచయం చేశాడు.
హారీ షేక్ హాండ్ ఇచ్చాడు. ఆ వచ్చినతను లేచి నుంచొని షేక్ హండ్ ఇస్తూ, “నా పేరు వెంకటరమణ సార్”, అన్నడు.
సుబ్బారావు ఆశ్చర్యం గా, “అరే మీ పేరు ఏ శామ్యూలో..డేవిడో అనుకొన్నానే..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, సుబ్బారావు మాటల వెనుక మర్మం తెలిసినట్లు నవ్వి
, ” మేము అసలు క్రిస్టియన్స్ మే నండీ. మ నాన్న గారు ‘ఎస్ సీ’ రిజర్వేషన్ రాదని,మాకు అలా పేర్లు పెట్టారు” అన్నాడు.
సుబ్బా రావు లోపల,”ఇతను చాలా నిజాయితీ పరుడల్లే ఉన్నాడే!”,అనుకొన్నాడు.
“మీరు ఏమి చేస్తారండీ”, అన్నాడు సుబ్బా రావు.
“హై స్కూల్లో టీచర్నండీ !”,అన్నాడు. “విజయవాడ లో పని ఉండి వెళ్తున్నాను”.

హారీ స్తేషన్లో దిగి బ్రెడ్డూ జామూ వాటర్ బాటిలూ తెచ్చుకున్నాడు. సుబ్బా రావు కి ఇడ్లీ వడా తెచ్చాడు.రైలు కదిలింది.
సుబ్బా రావు, “ఈయన ఎస్ సీ లో ఏ కులమో తెలియ లేదే..!”,అనుకొని, “పేపర్ లో ఒక న్యూస్ ఐటం చూపించి, సార్ ఈ మధ్య ఎస్ సీ వర్గీకరణ అని ఏవో గొడవలు జరుతున్నాయి కద సార్. దేని గురించి ఈ గలాటా…!”, అన్నాడు.
దానికి రమణ, ” ఆ… అనవసరమైన గొడవలు సార్…అంబేద్కర్ గారు ఎస్ సీ లందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు..కొద్దో గొప్పో అందరూ ముందుకు పోతున్నాము..ఇవ్వాళ వెంకట రమణ టీచర్ అయినా ఇంకో మాయావతి సీ ఎం అయినా ఆయన చలవే…ఆయన లేక పొతే ఈ రోజు వెంకట రమణ అనే టీచర్ లేడు..ఆయన దేవుడు…ఇప్పుడు దానిలోనే విభజనలు ఎందుకు సార్..ఇది అంతా అగ్రకుల రాజకీయులు ఎస్ సీ లని చీల్చటానికి చేసిన ఒక కుట్ర”, అన్నాడు.
సుబ్బా రావు, “కానీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు….,అగ్రకులాల వాళ్ళు కూడా, ఇలానే… “దేశాన్ని కులాల ఆధారం గా విడగొడుతున్నారు” అనుకొని ఉంటారు కదండీ”, అన్నాడు.
రమణ, “వీడెవడో పక్కా అగ్రకులస్థుడి లా ఉన్నాడు”, అనుకొని.
సుబ్బా రావు తో ఇలా అన్నాడు, “అది వేరండీ .. చారిత్రకం గా దళితులు అణగద్రొక్కబడ్డారన్నది తిరస్కరించలేని నిజం..దానిని సరి చేయటానికే దళితులకు ఈ రక్షణలు కల్పించారు..దళితులను పాలకులు గా నిలబెట్టాలి..”
సుబ్బా రావు మధ్య లోనే అందుకొని,” ముస్లింలు హిందువులని చాలా కాలం పాలించారు..బీ జే పీ వాళ్ళు ఇప్పుడు హిందువులు పునర్వైభవం పొందాలి అంటున్నారు. దీనిని మిగిలిన వారు నాజీయిజం అంటున్నారు..బీ జే పీ ది నాజీయిజం అయితే, మీరు చెప్పే దళితుల పాలన కూడా నాజీయిజం అవుతుంది కదా..?” అన్నాడు.
దీనికి రమణ కు చిర్రెత్తుకొచ్చింది. అతను కోపం గా, “ఈ రెండింటికీ చాలా తేడా ఉందండీ..దళితులు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు..రేపు దళితులు కూడా వాళ్ళ జనాభా కి తగినట్లు గా ఉద్యోగాలలో ఉంటే, రిజర్వేషన్లు ఎత్తేయటం వలన అగ్ర కులాలకి వచ్చే లాభం ఏమిటి..? బీ జే పీ ది మొత్తం గా వేరే వాదం. అది మైనారిటీల మీద నరమేధాలు చేస్తోంది”, అన్నాడు వెంకట రమణ.

ఇంతలో హారీ కల్పించుకొని, “ఆర్ధిక ప్రాతిపదికన రిజర్వేషలు ఇవ్వటం కరక్టు అనుకొంటా..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, “ఇది కొంతవరకూ సరియైనదే..కానీ సామాజికం గా వెనుక పడటం అనేది ఒకటి ఉంది…నెలకు ఐదు వేలు ఆదాయం ఉండే దళితుడి కొడుకు ఒక దళిత వాడ లో ఉన్నాడను కొందాం..అలానే ఐదు వేలు ఆదాయం వచ్చే బ్రాహ్మణుడి కొడుకు ఒక అగ్రహారం లో ఉన్నాడనుకొందాం.. బ్రాహ్మణుడికి అగ్రహారం లో ఉండే విలువల దృష్ట్యా..అక్కడ ఉన్న వాతావరణం..చుట్టాలూ…స్నేహితులూ..పరిచయాల దృష్ట్యా అడ్వాంటేజ్ ఉంటుంది అనటం లో సందేహం లేదు కదా..? అలానే దళితులా ఆది వాసీ ల జీవన విధానం ఆధునిక జీవన విధానం కంటే వేరు గా ఉంటుంది..అది వారికి ఒక డిజేడ్వాంటేజ్. మీరు అమెరికన్ జీవన విధానం లో పెరిగారు. మిమ్మల్ని ఒక ఆదివాసీ గూడెం లోని మనిషి తో వడిసెలు విసరటం లో పోటీ పడమంటే, మీకు ఎలా ఉంటుంది? అలానే ఆదివాసీ ని “జీ ఆర్ ఈ” రాసి అమెరికా పోవచ్చు కదా అన్నా అంతే అన్యాయం కదా..?” అన్నాడు.

సుబ్బారావు, “రిజర్వేషన్ ఉన్న వాడు ఓపెన్ కేటగిరీ లో సీటు తీసుకోవచ్చు..కానీ ఒపెన్ కేటగిరీ వాడు రిజర్వేషన్ కోటా లో సీటు తీసుకోలేడు.దీని వలన కొన్నాళ్ళకి పరిస్థితి తారుమారై నిమ్న వర్ణాల పెత్తనం రావచ్చు కదా?కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషలు అన్ని కులాల కీ వర్తింప చేస్తే పోతుందేమొ!”, అన్నాడు.
వెంకట రమణ,”అది వచ్చినపుడు చూడ వచ్చులే సార్. మనం భవిష్యత్ పరిస్థితుల కోసం ఇప్పుడు చట్టాలు చేయలేం కదా? ప్రస్తుతం జనాభా నిష్పత్తి ప్రకారం కోటా అంటే అగ్రకులస్తులే ఒప్పుకోరు. ఎందుకంటే వారి నిష్పత్తి కంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు కాబట్టీ.ప్రభుత్వానికి అసలు దమ్ముంటే కోటాలు తీసేసి, సామాజిక స్థితి గతులను మార్చి, అందరికీ ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు సమానం గా కల్పించ గలగాలి. కానీ ఆ దమ్ము మనకున్న వ్యవస్థ లో ఇప్పుడే రాదు.”,అన్నాడు
అప్పటికే ట్రెయిన్ లో జనాలు ఆవేశం గా మాట్లాడుతున్న వెకటరమణ ను గమనించటం చూసి….”సార్ ఈ విషయాలు ఒక ట్రెయిన్ ప్రయాణం లో మాట్లాడుకొనేవి..కాదు…చెప్పండి సార్..అమెరికా లోజనాలు ఎలా ఉంటారు..ఇండియన్స్ అంటే ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి..?”అన్నాడు.
సుబ్బారావు, “మీరు ఒంగోలు లో దళిత వాడలో ఉంటారా..లేక వేరే ఉంటారా..?”,అన్నాడు.
“లేదు సార్,అక్కడ సౌకర్యాలుండవు..హై స్కూలు దగ్గర్లోనే ఒక ఇంట్లో ఉంటున్నాను. స్కూలు కి దగ్గర కదా..సౌకర్యం గా ఉంటుంది”

దయాకర రెడ్డి నీ మస్తాన్ వలీ నీ ఇప్పుడు వెంకట రమణ నీ చూసిన హారీ మనసు లో ఒక సత్యం రూపు దిద్దుకో సాగింది….

**********************

chirala_org
chirala_org

ట్రెయిన్ చీరాల లో ఆగగానే పంచుమర్తి రామారావు బట్టలమూట భోగీ లో పెట్టి తనూ ఎక్కాడు. ఆయనకు ఓ యాభై యేళ్ళు ఉంటాయి. ట్రెయిన్ కదులుతూనే వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొన్నాడు.

సుబ్బారావు బట్టలను మూటని చూసి “చేనేత లా ఉందే”, అన్నాడు.
రామారావు దానికి, “కాదండీ మర మగ్గం తోనే నేశాం”,అన్నాడు.
సుబ్బారావు,”ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఈ బట్టలని?”, అన్నాడు.
“విజయవాడ లో బట్టల కొట్టుకి అమ్మటానికి తీసుకెళ్తున్నా”
“చేనేత రంగం లో సంక్షోభం తగ్గినట్లేనాండీ..?”, అన్నాడు సుబ్బారావు.
“ఏమి తగ్గటమో సార్. మర మగ్గాలైతే ఇచ్చారు ..కానీ ఈ మగ్గాలు బాంబే మిల్లుల తో పోలిస్తే ఏ పాటి? పైగా వీటికి రిపేర్ లు ఎక్కువ. ఒక్క సారి రిపేర్ కి వచ్చిందంటే ఖర్చు ఎక్కువ”
హారీ ట్రెయిన్ విండో కి చేరగిలబడి సుబ్బారావు తో, “పారిశ్రామికీకరణ ఆర్ధిక సరళీకరణ ల నేపధ్యం లో కుల వృత్తుల, చేతి వృత్తుల వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కోవాలని నాకు ఆసక్తి గా ఉంది”, అన్నాడు ఇంగ్లీషు లో..
నల్ల తోలు సుబ్బారావు పంచుమర్తి రామారావు తో ఇలా అన్నాడు, ” ఈ సార్ అమెరికా నుంచీ వచ్చి ఏదో రీసెర్చ్ చేస్తున్నాడట..ఈ మధ్య మన చేతి వృత్తుల వారి స్థితి గతులు ఎలా ఉన్నాయి అంటున్నాడు”.
“ఆ ఏముంది సార్..ఎవరికైనా పట్నాలకు వలస పోతేనే కొద్దో గొప్పో పోషణ…కాక పోతే దీనిలోనే కొంచెం తరుగూ మెరుగూ..కుమ్మరి వాళ్ళపని ఎక్కడా బాగా లేదు..కుండలు ఎవరు కొంటున్నారు..కమ్మరి వాళ్ళ పనీ అంతే..పోతే వడ్రంగి వాళ్ళకి టౌన్ కి పోతే బాగానే పని ఉంది. దీనికి కారణం ఇళ్ళ నిర్మాణం. దర్జీలు కూడా పట్టణాలలో పరవాలేదు..వాళ్ళు టెక్స్ టైల్
పార్కుల్లో దూరి పోవచ్చు..ఇక పోతే మంగలి,చాకలి వారికి పట్టణాలలో పరవా లేదు..ఇస్త్రీనో డ్రై క్లీనింగో చేసుకుంటున్నారు..సెలూన్లు పెట్టుకొంటున్నారు..గొల్లలూ గవళ్ళూ వ్యవసాయం వైపుకి మళ్ళుతున్నారు..పల్లెటూళ్ళ నుంచీ వెళ్ళే అగ్రకులాల భూమిని వీళ్ళే కొని, వ్యవసాయాన్ని బ్రతికిస్తున్నారు. చేనేత పనివారికి మాత్రం గడ్డు కాలమే..! మేము నేసే బట్టల కంటే చాలా చౌకగా పైనుంచీ బట్టలువచ్చి పడుతున్నాయి..ఈ రాజకీయ నాయకులకేమో గుద్దులాడుకోవటానికే టైం చాలటల్లా..మా జనాభానేమో తక్కువ.. వోట్లు లేనిదే రాజకీయ నాయకుడెక్కడ మాట వింటాడు..?ఈ కులాలన్నీ కలిస్తే బాగానే ఉంటుంది..కానీ ఈ కులాలలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు.”
హారీ ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు, “ఎన్నికలలో ఒక అగ్ర కులస్థుడూ ఒక దళితుడూ నిల్చొంటే ఎవరికి వోటేస్తాడు ఇతను?”
సుబ్బా రావు ఈ ప్రశ్న ను అనువదించి రామారావు ని అడిగాడు.
రామా రావు ఆలోచించి, “ముందు క్యాండిడేటు ఎలాంటి వాడో చూస్తాం సార్. ఇద్దరూ ఒకే తరహా వాళ్ళైతే నేనైతే అగ్రకులస్థుడికే వేస్తా. నేనే కాదు మాలో చాలా మంది అలానే చెయ్యవచ్చు”.

ఇదంతా నిశ్శబ్దం గా వింటున్న వెంకటరమణ తను కూర్చున్న చోటనే ఇబ్బంది గా కదిలాడు.

“అగ్ర కులాల కు ఆంధ్ర రాజకీయాలలో పట్టు ఉండటానికి ఇది కూడా ఒక కారణమనుకొంటా..ఆంధ్ర లో హిందూ సామాజిక వ్యవస్థ స్వరూపం అగ్ర కులాల వైపుకి మొగ్గి ఉన్నట్లు గా ఉంది”, అన్నాడు హారీ.
సుబ్బారావు, “ఇది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఎందుకు తట్టలేదబ్బా.”,.అనుకొని. “హారీ బయటి వాడవ్వటం వలనే అతనికి ఇది అర్ధమై ఉండవచ్చు..అతనిలా మన వ్యవస్థ ని కొండ మీదెక్కి విహంగ వీక్షణం చేసే అవకాశం నాకు లేదు కదా”, అనుకొన్నాడు.
రామా రావు హారీ కూర్చొన్న తీరు చూసి, “బాగా బలిసిన వాడిలాగున్నాడు..నేను చెప్పినదంతా ఒక వినోదంలా కులాసా గా వింటున్నాడు..నాలాంటి రెక్కాడితేగానీ డొక్కాడనోడి పరిస్థితి ఇతనికి ఏమి అర్ధమౌతుంది?” అనుకొన్నాడు.

*************************

tenali
tenali

వీరమాచనేని వెంకట కృష్ణ ప్రసాద్ తెనాలి లో కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు.  అతనికి నలభై యేళ్ళు ఉంటాయి.అతనికి విజయవాడ లో ఒక చిన్న బిజినెస్ ఉంది. తెలుగు దేశం పార్టీ వచ్చిన కొత్తలో ఆవేశం గా పార్టీ జెండామోసి దానివలన ఊళ్ళో మోతుబరులకే తప్ప తనకేమీ లాభం లేదని తెలుసుకొన్నాడు. దరిమిలా ఊళ్ళో జరిగిన గొడవలతో, “కమ్మ వారి మీటింగులు కాలువలొచ్చేవరకే!” అన్న నానుడి అనుభవం లోకి వచ్చిందతనికి…అప్పటి నుంచీ రివర్స్ గేర్ లో పడ్డాడు.

పదేళ్ళకిందట ఊళ్ళో ఒకతను రెండు లక్షలిచ్చి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తానంటే, “మన వాళ్ళలోమగాడిగా పుడితే మినిమం ఐదు లక్షలు కట్నం కదా?”,అన్నాడు. దానితో ఆ సంబంధం తప్పిపోయింది. తరవాత మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని ఆడ పిల్లలు చదువులలో పైకి పోవటం, కట్నాలు కిందికి దిగటం జరిగిపోయి, కృష్ణ ప్రసాదు కి అప్పటి నుంచీ ఇప్పటి దాకా పెళ్ళి కాలేదు.
అతను వచ్చి హారీ పక్కన కూర్చొన్నాడు.

హారీ వేసుకొన్న బూట్లు చూసి “ఈ షూ అమెరికా లో మాత్రమే దొరుకుతాయి కదండీ? !”, అన్నాడు.
సుబ్బారావు,”చచ్చింది గొర్రె, దొరికింది బర్రె” అనుకొని, కృష్ణ ప్రసాద్ తో, “అవునండీ,  ఈ సార్ వచ్చింది అమెరికా నుంచే కదా”అన్నాడు.
సుబ్బారావు మళ్ళీ అందుకొని, “మీకు ఇవి అమెరికా లో మాత్రమే ఉండే బ్రాండు అని ఎలా తెలిసింది”,అన్నాడు.
కృష్ణ ప్రసాదు, “మా పెదనాన్న గారి అబ్బాయి ఒకతను అమెరికా లో ఉన్నాడు లెండి. అతను ఇండియా వచ్చినపుడు చూశాను”, అన్నాడు.
రెడ్డి గారు వదిలేసిన  పేపర్ చూస్తూ సుబ్బారావు, “ఏంటి సార్? ఈ చంద్ర బాబు తెలంగాణ గురించి ఏమీ తేల్చి చెప్పేటట్లు లేడు”, అన్నాడు.
“ఉపయోగం లేని మనిషి సార్. మా వాడైనా మా వాళ్ళకి చేసింది ఏమీ లేదు”,అన్నాడు.
సుబ్బారావు, “అదేంటి సార్,అలా అంటున్నారు?”,అని ఆశ్చర్యం నటించాడు.
“రాజశేఖర రెడ్డి చూడండి రెడ్లకి ఎలా దోచి పెట్టాడో..! మా రాజ కీయ నాయకుల వలన మా లో ఉన్న పేదోల్లకి నష్టమే ఎక్కువ జరిగింది” అన్నాడు కృష్ణ ప్రసాద్.
సుబ్బారావు: “అదెలా సార్? కాస్త వివరం గా చెప్పండి” అన్నాడు.
“ఎన్ టీ రామారావు రాజకీయాలలో కి రాక ముందు కమ్మ వాళ్ళంటే గోదావరి జిల్లాల్లో రాజుల్లా గుట్టు గా తమ పనేదో తాము చేసుకొనే వారు. రామారావు వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డారు. ఆయన ప్రవేశ పెట్టిన “రెండు రూపాయలకు కిలో బియ్యం” పధకం వలన ఊళ్ళలో లేబర్ మా మాట వినటం మానేశారు.  మిగిలిన కులాలన్నీ మమ్మల్ని చూసి ఏడుస్తున్నాయి. పెద్ద వాళ్ళు చెసే వెధవ పనుల వలన..మా లో ‘లేని వారికి’ కూడా చెడ్డ పేరు వచ్చింది. మాలో ఉన్న వాళ్ళ ఐశ్వర్యం చూసి అందరూ ఉన్న వాళ్ళే అనుకొంటున్నారు. కానీ మాలో లేని వాళ్ళకి ప్రభుత్వ పరం గా ఒక రిజర్వేషను ఇవ్వలేదు..ఒకరాయితీ ఇవ్వలేదు..ఇస్తే మా రాజకీయ నాయకులకు ప్రజలు కులతత్వమంట గడతారేమోనని భయం.”
ఇది విని హారీ,” సో ..,ఇక్కడముఖ్య సమస్య పేదరికం కదా..మీరు దళితులలో,బీ సీ ల లో ఉన్న గ్రామీణ పేదలతో కలిసి మీ హక్కుల కోసం ఉద్యమించవచ్చు గదా?”, అన్నాడు అమాయకం గా.

వెంటనే కృష్ణ ప్రసాద్, “వాళ్ళతో మేమెలా కలుస్తాం..?” అన్నాడు తనని అవమానించినట్లు గా.ఈ మాట విని రమణా రామారావూ చెరొక కిటికీ లోంచీ బయటికి చూడటం మొదలు పెట్టారు.

సుబ్బారావు కృష్ణ ప్రసాదు కి ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకొని, “ఏదేమైనా, ఒకటి నిజమే సార్, చంద్ర బాబు అంత జిత్తుల మారి నాయకుడు ఎవరూ లేరు” అన్నాడు.
కృష్ణ ప్రసాద్ తమాయించుకొని,”అందరు రాజకీయ నాయకులూ అలాంటి వాళ్ళే సార్. ఉన్నంతలో బాబే బాగా చేశాడు”, అన్నాడు.
సుబ్బారావు తన లో,” ఓర్నీ, నీ కులం వాళ్ళని తిట్టాలన్నా నువ్వే తిట్టాలా…!ఇతరులు మాత్రం తిట్టకూడదా..?” అనుకొన్నాడు.

********************

Vja-bridge
Vja-bridge
vijayawada
vijayawada

విజయవాడ ఇంకా పదినిమిషాలలో వస్తుంది. ట్రెయిన్ నెమ్మదిగా నడుస్తోంది. ఓ కుర్రాడు చెవికి ఐ-పోడ్ పెట్టుకొని హారీ ఉన్న సీట్ ను దాటి గేట్ లో నిల్చొని బయటి పచ్చటి దృశ్యాలు చూస్తున్నాడు. ఆ కుర్రాడిని చూసి హారీ ఇతనిది ఏ కులమై ఉంటుందబ్బా అనుకొని మళ్ళీ,”కులమంటే తెలియని నేను కూడా కుల స్పృహ లో పడి పోయానే!” అనుకొన్నాడు.

ఇంతలోహఠాత్తు గా, “అయ్యో ! అయ్యో! పడిపోయాడు..పడిపోయాడు..ట్రెయిన్ ఆపండి…ఆపండి!”, అన్న అరుపులు వినపడ్డాయి..సుబ్బారావు ఒక్క ఉదుటున లేచి చెయిన్ లాగాడు. ఒక ముసలామె వాష్ బేసిన్ దగ్గర నిలబడి చెప్తోంది..”ఎవరో కుర్రాడు చల్ల గాలి కొసం డోర్ దగ్గర నిలబడ్డాడు. ట్రెయిన్ కుదుపుకి డోర్ వచ్చి అతనికి గట్టిగా కొట్టుకొని కింద పడి పోయాడు..”

సుబ్బారావు, కృష్ణ ప్రసాద్, రామా రావు, రమణ తో సహా భోగీ లోని కుర్రాళ్ళు కొందరు కిందకి దిగారు. ట్రెయిన్ గేట్ దగ్గరే నిల్చొన్నాడు హారీ. కింద పొదల్లో కనపడ్డాడు ఆ కుర్ర వాడు. మూలుగుతూ ఉన్నాడు. ముళ్ళు గీరుకు పోయి రక్తం వస్తొంది. లేవలేక పోతున్నాడు..తలొక చేయీ వేసి కుర్రాణ్ణి బయటికి లాగారు. భొగీ లోకి ఎక్కించారు. రక్తం చూసి హారీ ఆ కుర్రాడి దగ్గరకే పోలేదు. “అతని రక్తం వలన ఏమి ఇన్ ఫెక్షన్స్ వస్తాయో ఏమిటో”, అనుకొన్నాడు తనలో. ముళ్ళపొదల వలన కుర్రాడికి పెద్ద గా దెబ్బలు తగలలేదు. ట్రెయిన్ నెమ్మది గా కదిలింది..కృష్ణా నది ని దాటి స్టేషన్ లో కి చేరింది. ప్రయాణికులంతా ఎవరి దారిన వారు పోతున్నారు.

సుబ్బారావు హారీ తో,”సార్,కోణార్క్ కి ఇంకా టైం ఉంది..దగ్గర్లో ఏదైనా హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేద్దామా?”, అన్నాడు.

“టిఫిన్ చెయ్యటమంటే..ఏమిటి..?”, హారీ అన్నాడు.

“అదే… ఇండియన్ స్నాక్స్ తిందాము”.

రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్ళంతా ఆటో సార్..ఆటో సార్ అనటం మొదలు పెట్టారు…ఒక ఆటో వాడు మాత్రం పది అడుగులు వీళ్ళతోనే నడిచి..”సార్ లాడ్జ్ కావాలా..?” అన్నాడు సుబ్బారావు తో.
“మేము హైదరాబాద్ వెళ్తున్నాం..మాకు లాడ్జ్ ఎందుకు?”, అన్నాడు సుబ్బారావు. ఇంక ఆ ఆటో వాడు వెళ్ళిపోతాడేమో అనుకొన్నాడు సుబ్బారావు. కానీ వాడు వదలకుండా,”సార్, మంచి అమ్మాయి సార్ రండి సార్” అన్నాడు.
సుబ్బారావు కోపం గా వాణ్ణి కసరటం తో వాడు వెళ్ళిపోయాడు.

ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న ఒక హోటల్ కి వెళ్ళారు. హోటల్ బిజీ గా ఉంది. ఓ టేబుల్ దగ్గర రెండు సీట్లు ఖాళీ గా ఉంటే వెళ్ళి కూర్చొన్నారు.

ఎదురు గా, వేదుల రామకృష్ణ శాస్త్రి కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆయన లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడు. సత్యనారాయణ పురం లో పెద్దల నాటి ఒక ఇల్లు ఉంది. ఈ మధ్య ఆయన ఆలోచనలన్నీ ఒకే విషయం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అది తన ముప్పై రెండేళ్ళ కూతురు శాంభవి కి పెళ్ళి చేయటం.

ఎర్రగా బుర్రగా ఉన్న హారీ ని చూసి శాస్త్రి, “కుర్ర వాడు బ్రామ్మలలానే ఉన్నాడు..వైదీకులో…నియోగులో…ఆ… ఈ కాలం లో ఎవరైతే ఏముందిలే”, అనుకొన్నాడు.

నల్ల తోలు సుబ్బారావు ని చూసి శాస్త్రి, “అతనెవరో నిమ్న కులస్థుడి లానే ఉన్నాడు…కొంచెం తెలివి తక్కువైనా వీళ్ళు కూడా ఈ మధ్య బాగానే చదువుతున్నారు…ఏదేమైనా శూద్రస్య శుభం నాస్తి…అయినా చూద్దాం”,అని కూడా అనుకొన్నాడు.

హరీ సుబ్బారావుని, “కోణార్క్ రైట్ టైం ఎంత?”, అని అడిగాడు. సుబ్బారావు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా రామకృష్ణ శాస్త్రి అందుకొని, “ఐదింటికండీ”,అని, “మిమ్మల్ని ఎక్కడో చూసి నట్లుంది..బై ఎనీ చాన్స్ మీ ఇల్లు సత్యనారాయణ పురం లో ఉందా..?”,అన్నాడు హారీ తో.

హారీ కి శాస్త్రి మాట్లడిన దాంట్లో ఒక్క ముక్కా అర్ధం కాలేదు. సుబ్బారావే కల్పించుకొని హారీ కి శాస్త్రి ప్రశ్న ను వివరించి, శాస్త్రి కి హారీ గురించి చెప్పాడు. శాస్త్రి కి తన సందేహం తీరే మార్గం కనపడలా.అతనికి సుబ్బారావు ఒక దుశ్శకునం లా కనపడ్డాడు. తన కాఫీ అయ్యిపోవటం తో లేచి వెళ్ళిపోయాదు.

************

కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో చాలామంది ఒరియా వాళ్ళు ఉన్నారు. చాలా వరకూ బాంబే వెళ్తున్నారు. హారీ సీట్ పక్క ఓ పాతికేళ్ళ కుర్రాడు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఒక కాల్ అయిన వెంటనే ఇంకొక కాల్ వస్తోంది. సుబ్బారావు ‘టీ సీ’ తో చెప్పి సీట్ మార్పించుకొని వచ్చాడు. ఆ కుర్రాడికి మళ్ళీ కాల్ వచ్చింది. “కొడితే కొట్టలిరా సిక్సు కొట్టాలి”, అని మొబైల్ కాలర్ ట్యూన్ ని పాడింది.

కుర్రాడు,”ఆయ్ …విజాడ వచ్చేహిందండీ..ఇంకో పది నిమిషాలలో బయల్దేరతందండీ..” అన్నాడు. ఈ కాల్ అయిన తర్వాత కుర్రాడే మళ్ళీ ఇంకో కాల్ చేసి,”ఆ.. సత్నానా…నేను ఆకుల చిట్టిబాబున్రా..అరే కొబ్బరి తోటల్కి నీళ్ళు పెట్టించావా..పెట్టించలేదా..మా అన్నియ్య కొట్టీగలడు..ఆర్యా2 మామూలు జనాలకి ఎక్కదు గానీ డాన్సులు సూపర్రా..అదర గొట్టీహాడ్రా అర్జునూ”, అని ఇంకేదో మాట్లాడుతున్నాడు. చివరికి ఎప్పటికో చిట్టిబాబు ఫోన్ కి విశ్రాంతి దొరికింది. ఫోన్ జేబులోపెట్టాడు. ఫోన్ స్క్రీన్ లో సుబ్బారావు కి పవన్ కళ్యాణ్ వాల్ పేపర్ కనపడింది.

సుబ్బారావు అతనితో సడన్ గా,”మీరు రాం చరణ్ ఫ్యాన్ కదండీ..”, అన్నాడు.

చిట్టిబాబు,”అయ్ బాబోయ్..ఎలా కని పెట్టీసీరండీ..మగ ధీర సూపర్ హిట్టుకదండీ…నాకు ముందే తెలుసండీ..”, అని సుబ్బారావు కి రాం చరణ్ నెక్స్ట్ సినిమా గురించిన విశేషాలు చెప్పనారంభించాడి చిట్టి బాబు.

“చిరంజీవి కి వోట్లేయలేదేమిటండీ మీ గోదావరి వాళ్ళు కూడానీ..”, అన్నాడు సుబ్బారావు చిట్టి బాబు ని అనుకరిస్తూ.

“కర్ణుడి చావు కి ఎన్ని కారణాలో దీనికీ అన్ని కారణాలండీ”,అన్నాడు చిట్టి బాబు.

“ఏదైనా చిరంజీవి ‘ఎన్ టీ ఆర్’ కాదుగదండీ”, అన్నాడు సుబ్బారావు.

“పెద్ద ‘ఎన్ టీ ఆర్’ వచ్చినా ఈ రోజుల్లో గెలవటం కష్టమండీ..ఆ రోజులు వేరు..ఈరోజులు వేరు..ఏమైనా లక్కు ఉండాలి లెండీ”,అన్నాడు చిట్టి.

ట్రెయిన్ బయలు దేరింది. ట్రెయిన్ లో జనాలు చాలా వరకూ “కొంచెం క్లాస్” గా ఉన్నారు.

“వీళ్ళ తో సంభాషణ కష్టం లానే ఉంది. ఇటువంటి వాళ్ళు బుర్ర లో ఉండే ఆలోచన నోటిలో మాట గా మారటానికి ముందు చాలా విషయాలు సరి చూసుకొంటారు. అందు వలన వీళ్ళతో సంభాషణ లో స్పాంటేనిటీ తక్కువ గా ఉంటుంది”, అనుకొన్నాడు సుబ్బారావు.

***********************

హారీ జేబులో మొబైల్ మోగింది. దాన్ని పట్టుకొని..”యా..డాడ్..” అని అమెరికన్ ఇంగ్లీష్ కలిసిన తెలుగు లో ఏవో వ్యక్తిగత విషయాలు బెక బెక లాడ సాగాడు.
సుబ్బారావు ఏమీ తోచక అటూ ఇటూ తిరిగే జనాలను చూస్తున్నాడు.తెలుగు వాళ్ళు చాలా మంది హైదరాబాదు లో దిగిపోయేవాళ్ళ లా కనపడుతున్నారు. సుబ్బారావు ఆలోచనల లో పడ్డాడు “ఏమైనా హైదరాబాద్ వాళ్ళు ఈ కోస్తా వాళ్ళ కంటే కొంచెం విశాల హృదయులు. కులం మతం ఏమీ పట్టించుకోరు. నా అపార్ట్ మెంట్ లో ఇంతవరకూ నా కులం గురించి ఎవరూ అడగలేదు కదా….అడిగితే నా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పాల్సి వచ్చేది….”
ఇంతలో హారీ,”హెయ్ డాడ్,మన కాస్ట్ ఏమిటి?…ఆ అదేఇండియాలో ఉంటాయి కదా కులం అని…ఏమిటి?”,అని అడిగి, “వాట్ వెలామా…ఓకే..ఓకే వెలమ…రైట్.ఓ కే..ఓ కే..బై డాడ్”అని పెట్టేశాడు.

సుబ్బారావు హారీ చివరి మాటలు వినేసి, ట్రెయిన్ లో అయిన అలవాటు తో హారీ ని ఒక సారి గోకి చూద్దాం అనుకొన్నాడు.
“మీరు వెలమ నా సార్..వెలమ దొరలు చాలా పొగరుబోతులు సార్..కే సీ ఆర్ కూడా వెలమే కదా..!” అన్నాడు.
దానికి హారీ, “నేను ఆ కాస్ట్ కి చెందినవాడిని కాదు..ఆ కాస్టే నాకు కొత్త గా వచ్చి చేరిన ఒక ట్యాగ్ లాంటిది”,అని తన బాగ్ కి ఉన్న ట్యాగ్ ని చూపించి, “కాస్ట్ అనేది అలాంటి ఒక ట్యాగ్ నాకు..ఆ ట్యాగ్ నీకు నచ్చినా నచ్చక పోయినా నాకేమీ పరవాలేదు. అయినా ఇక్కడ ఈ ట్యాగ్ లకి ఎందుకు ఇంత విలువ ఇస్తారో నాకు ఇంకా అర్ధంకాలేదు దానిని అర్ధంచేసుకోవటం కోసమే ఈ ట్రెయిన్ ప్రయాణం” అన్నాడు.
“నాకు అర్ధమయ్యింది సార్ ఇప్పుడు…పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు కులాల పరమైన సమూహ జీవనం గడుపుతారు…హైదరాబాద్ లాంటి చోట్ల నేనుండే అపాట్మెంట్లలో అలాంటిది ఉండదు..అన్ని కులాలూ ఉంటాయి..మతాలూ ఉంటాయి..అదే అమెరికా లో ఇక చెప్పనవసరం లేదు…కులాలు కు మారు గా వేరే కులాలు ఉంటాయి..మా అపార్ట్మెంటులో ఖరీదైన కారు ఉన్నోడిది ఓ కులం..అలానే బాంబే నుంచీ వచ్చిన వాళ్ళందరిదీ ఒక కులం…అమెరికా లో అయితే..అమెరికన్లదంతా ఒక కులం..”
హారీ అడ్డు తగిలి,”మీ పల్లెల లో ఉండే వాళ్ళు కులాన్ని నా లాగా ట్రీట్ చేసేటట్లు వాళ్ళని ఏడ్యుకేట్ చెయ్యవచ్చు కదా..?”, అన్నాడు.
దానికి సుబ్బారావు, ” జీవితం ముఖ్యం సార్..వాళ్ళు బతికే బతుకు లో, సమాజం లో లేని దాన్ని మనం చెప్పినా పాటించటం కష్టం..ఒక వేళ చెప్పినా, వాళ్ళు చాలా మానసిక శ్రమ పడి కుల భావనని అధిగమించాల్సి వస్తుంది. దాని వలన వాళ్ళకు ఒరిగేది ఏమిటి? మీకు కుల స్పృహ లేక పోవటం సహజం గా వచ్చింది..వాళ్ళకు అలా కాదు.”
“కానీ కులాల వలన కొట్లాటలు ఎక్కువ అవుతాయి కదా..”,అన్నాడు హారీ.

“కులాల వలన అనే కంటే డెమోక్రసీ వలన ఎక్కువ అయ్యాయి..దేశం లో వోట్లు లేనప్పుడు ప్రతి వాడికీ తన కులం పై అభిమానమూ గౌరవమూ ఉండేవి…ఈ రాజకీయ నాయకుల వలన కుల స్పర్ధలు పెరిగాయి..ఎదుటి కులాల పై అసహ్యం పెరిగింది..అయినా కులాన్ని మంచికి కూడా ఉపయోగించవచ్చు.. ఇది మన మిలిటరీ లో చూస్తూంటాం..జాట్ రెజిమెంట్ అనీ, రాజ్ పుతానా రైఫిల్స్ అనీ.ప్రజలు కూడా ఒక రెడ్డే అంత నిస్వార్ధం గా ఉండగలడు..లేక ఒక వెలమే ఇంత నిజాయితీ గా ఉండగలడు అనుకోగలిగితే దాని వలన జాతికీ సమాజానికీ ప్రయోజనమే” అన్నాడు సుబ్బు.

హారీ కరక్టే అన్నట్లు తల ఊపి, తన ల్యాప్-టాప్ తీసి ఏవో నోట్స్ రాసుకోసాగాడు.
***********
ట్రెయిన్ కదులుతూ ఉండగా ఝాన్సీ పక్క కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేసింది. జీన్స్ పాంటు వేసుకోవటం వలన పడకుండా నిల దొక్కుకుంది. ఆమె ఒక ఆడ్ కంపెనీ లో పని చేస్తోంది. పెళ్ళి అయ్యి ఓ రెండేళ్ళయ్యింది..విడాకులిచ్చి ఓ సంవత్సరం అయ్యింది. ఝాన్సి కాలేజీ రోజుల నుంచీ ఫెమినిజం పేరుతో పురుష ద్వేషాన్ని అలవరుచుకొంది. ఆమె మాజీ భర్త రఘు రాం పాత కాలపు మనిషి. ఎలానో కష్టపడి ఝాన్సీ ని ఒప్పించి, ఇద్దరికీ విజయవాడ లో అరేంజిడ్ మారేజీ చేశారు వాళ్ళ పెద్ద వాళ్ళు. ఇద్దరి ఉద్యో గాలూ హైదరాబాద్ లోనే.
శోభనం రాత్రి రఘు రాం, “ఇలా రావే” అంటే, ఝాన్సి “రాను, పోరా!”,అంది. ఈ పరిస్థితి  పెళ్ళైన నాలుగు నెలలకీ మారక పోయేసరికి రఘు రాం ఆమె ఫ్రిజిడ్ అని నిర్ధారణకి వచ్చేశాడు. డాక్టర్ కి చూపిద్దాం అంటే,”నువ్వే చూపించుకోపో..మంచం మీద అసహ్యమైన పనులన్నీ చెయ్యమంటావ్”,అంది.
ప్రతి రోజూ “సమాజమూ వ్యవస్థా ఆడవాళ్ళకి చేస్తున్న అన్యాయం” అని రఘు రాం కి ఓ గంటైనా క్లాస్ పీకేది ఝాన్సి. మధ్యాహ్నం ఇద్దరూ ఆఫీస్ల లో భోజనం చేసే వాళ్ళు. రాత్రి రఘురాం బయటి నుంచీ తెచ్చే వాడు. ఒక రోజు రాత్రి రఘురాం ఝాన్సి ని అన్నం వండమంటే, “నువ్వే వండ రాదూ..నేనే ఎందుకు వండాలీ ఆడదాన్నని అలుసు కాక పోతే. ఈ వ్యవస్థే ఆడదాన్ని దాసీ గా పడి ఉండమంటుంది?”,అంది.
రఘురాం,” ప్రపంచం లో రెండు రకాల న్యాయాలున్నాయి..ఒకటి సహజ న్యాయం, రెండు సామాజిక పరమైన న్యాయం. సహజ న్యాయం ప్రకారం మగాడు రక్షణ,పోషణ బాధ్యత తీసుకొంటే ఆడది సంసారాన్ని చక్క దిద్దుకోవాలి. ఈ న్యాయం లో మగాడు బలవంతుడు కాబట్టీ అతని మాటలను ఆడది వినవలసి వచ్చేది..అలానే శారీరకం గా బలవంతుడైన మగాడి మాట బలహీనుడైన మగాడు వినవలసి వచ్చేది. తరువాత వ్యవస్థ మారి మనిషి సాంఘిక న్యాయాన్ని ఏర్పరుచుకొన్నాడు.  మగాడు ఆడదానికి శతృవు ఐతే,ఆడ దానిని సమానం గా చూసే చట్టాలు ఎక్కడి నుంచీ వచ్చినై..ఆడ వాళ్ళని గౌరవించే విలువలు ఎక్కడి నుంచీ వచ్చినై. ఇవన్నీ మగాడి సహకారంలేకుండా రావు కదా. ముందు రాజ్యమంతా మగాడిదే..మగాడి అనుకూలత లేకుండా వ్యవస్థ ఇలా మారదు కదా. కాబట్టీ మగాడు ఆడదానికి శతృవు అనే ఆలోచన మానుకో”,అన్నాడు
“ఆ చెప్పావులే వెధవ కబుర్లు..ఇవన్నీ మగ పందులు కూసే కూతలే. ఆడ వాళ్ళు పోరాడి సాధించుకొంటేనే ఈ స్వేచ్చలన్నీ వచ్చాయి”, అని దుప్పటి ముసుగెట్టింది ఝాన్సి.
రఘు రాం కి కాలి దుప్పటి లాగి, ఇంటి తలుపులు మూసి,”ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాము..ఈ పురుషాధిక్య సమాజం లేదు..వ్యవస్థా లేదు..మనమిద్దరమూ అంటే ఆడా మగా మాత్రమే ఉన్నాము. నీ ప్రకారం మనిద్దరమూ శతృవులం”, అని ఝాన్సి కింద పడే దాకా పెడీ పెడీ కొట్టాడు.
ఝాన్సి లేచి, “ఆడ దానిని కొట్టేవాడివి నువ్వూ ఒక మగాడివేనా?”, అని అతని మొహం మీద ఊసింది.
రఘురాం, “ఏం ఆడదేమన్నా దిగి వచ్చిందా..ఆడ దానిని కొట్టగూడదన్న నియమం కూడా ఈ పురుషాధిక్య వ్యవస్థే పెట్టింది. ఆ నియమం ఆడదాన్ని అవమానించినట్లే కదా. ఈ నియమం ప్రకారం ఆడది తక్కువ అని అంగీకరించినట్లేగా”, అని మళ్ళీ పిచ్చి గా కొట్టటమ్మొదలు పెట్టాడు.
కాసేపటికి దెబ్బలు కొట్టి రఘు రాం, తిని ఝాన్సీ అలిసి నిద్ర పోయారు.
మరుసటి రోజు రఘురాం ఏమీ జరగనట్లు గానే స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళి పోయాడు.
లంచ్ అయ్యిన తరువాత ఎవరో పోలీస్ ఇన్స్ పెక్టర్ వచ్చాడని తెలిస్తే బయటికి వచ్చాడు రఘు రాం.  ఇన్స్పెక్టర్ నాన్ బెయిలబుల్ గృహ హింస కేసు కింద రఘు రాం ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. పాపం రఘు రాం, పెళ్ళాన్ని తన్నే ఆవేశం లో సమ కాలీన వ్యవస్థ లోని నియమాలని కొద్ది సేపు మరిచిపోయినందుకు తగిన శిక్ష అనుభవించాడు.
పక్క కంపార్ట్మెంట్ లోంచీ నడిచి ఝాన్సి వచ్చి హారీ కి ఎదురు గా కూర్చొంది.

*****************************

Vja-Paddy
Vja-Paddy

ఝాన్సి పక్కనే ఉన్న సుబ్బారావు ని మనసు లో పురుగును చూసినట్లు చూసి, పైకి మాత్రం,”కొంచెం దూరం గా జరుగుతారా?” అంది.
చిట్టి బాబు ఝాన్సి వైపు చూసి, “కాజల్ అగర్వాల్ లా మంచి ఫిగరేనే”, అనుకొన్నాడు.
సుబ్బారావు ఝాన్సి ని, ” మీరు హైదరాబాదు కా ముంబై కా అన్నాడు”
ఝాన్సి, “ఆ రెండు చోట్లకీ కాదు..అమెరికా కి..ఏ మీరు కూడా వస్తారా?”,అంది వెటకారం గా.
సుబ్బారావు,హారీ వైపు చూపించి, “ఈ సార్ అమెరికా నుంచీ వచ్చారు. అమెరికా మొత్తం తెలుసు ఆయన కి. మీకు కావాలంటే అమెరికా మొత్తంచూపిం చేస్తాడు”, అన్నాడు వెకిలి గా.

హారీ వీళ్ళ సంభాషణ లోని లో గుట్టు అర్ధం కాక, ఝన్సి వైపుకి చేయి సాచి,”హాయ్ అయాం హారీ..అయాం ఫ్రం కాలిఫోర్నియా”, అన్నాడు.

ఝాన్సి హారీ ని ఒక్క సారి చూసి అతని ఆక్సెంట్ విని అతను నిజం గా అమెరికా వాడే అని నిర్ధారించుకొంది. ఝాన్సి కూడా అతనికి షేక్ హాండిచ్చి తనను పరిచయం చేసుకొంది. ఝాన్సి కి ఇండియన్ మగాళ్ళంటే ద్వేషమే కానీ అమెరికన్ మగాళ్ళంటే ద్వేషంలేదు, పైగా అభిమానం కుడా. హారీ కిటికీ లోంచీ చెట్టూ పుట్టా గొడ్డూ గోదా చేలూ పొదలూ చూస్తూంటే, ఝాన్సి మాత్రం అప్పుడప్పుడూ హారీ ని దొంగ చూపులు చూస్తోంది.అలా  చూడనప్పుడు మాత్రం హారీ తననే చూస్తున్నడని అనుకొని సిగ్గుపడుతోంది.
మధ్య మధ్య లో తాను ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కి అమెరికా వెళ్ళినట్లూ. తన కాలేజీ కి హారీ వచ్చినట్లూ..ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళినట్లూ అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసినట్లూ ఏదేదో ఊహించుకొంటూంది. ఇంతలో రఘు రాం గుర్తుకొచ్చాడు..”ఛీ… ఆ మగ పంది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాడు?..మూడ్ పాడు చేశాడు వెధవ..నిజ జీవితం లోనూ వాడి వలన సుఖం లేదు ఊహా జీవితం లోకి కూడా వస్తున్నాడు”, అనుకొని స్టేషన్ లో తను కొన్న ఫెమినా తీసి చదవ సాగింది.
***********

khammam
khammam

ట్రెయిన్ ఖమ్మం లో ఆగింది. అరవై ఐదేళ్ళ విస్సంసెట్టి నరసింహ మూర్తి ఆప  సోపాలు పడుతూ ఎక్కాడు ట్రెయిన్. వచ్చి చిట్టి బాబు పక్కన కూర్చున్నాడు.

సుబ్బారావు మూర్తి ని, “ట్రెయిన్ ఖమ్మం నుంచీ సికిందరాబాదు చేరటానికి ఎంత టైం పడుతుందండీ?”, అన్నాడు.
మూర్తి, “ఏమో తెలియదు భై, మూడు గంటలుండొచ్చు”,అన్నాడు.
“మా కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం లో తెలంగాణా ఉద్యమం ఎలా జరుగుతోంది?”, అన్నాడు సుబ్బారావు.
మూర్తి అసలు ప్రశ్నను వదిలేసి, “ఆ ఏం కమ్యూనిస్టుల్లే..ప్రపంచం ల ఎక్కడైనా కమ్యూనిజం వస్తదేమో గానీ ఇండియాల మాత్రం రాదు”,అన్నాడు.
“అయ్యో ఒక్క సారి అలా అనేశారేంటి..!నేనసలే కమ్యూనిస్ట్ సానుభూతిపరుణ్ణి”
“ఇక్కడ చాలా విషయాలు ఉన్నై..కులాలూ..మతాలూ..ప్రాంతాలూ..ఒక పేద వాడున్నడనుకొందాం..వాడి కులంలోనే ఒకడు బాగా రిచ్ వాడు ఉన్నడనుకొందం..ఈ పేద వాడు ఆ ఉన్న వాడ్ని శతృవు గా చూస్తడా..లేక ఆరాధనా భావం తో చూస్తడా..నూటికి నూరు పాళ్ళూ అభిమానిస్తడు..మా కులపోడే అంత పైకి పోయిండని..ఖేల్ ఖతం…ఇంక కమ్యూనిజం ఎలా వస్తది”, అన్నాడు మూర్తి.
హారీ కల్పించుకొని,”అయితే ఇండియా కు కమ్యూనిజం వచ్చే రిస్కు లేదన్న మాట!”
సుబ్బారావు, “కమ్యూనిజం అయితే ఇప్పట్లో రాదు..ఇక అది రిస్కా లేక వరమా లేక శాపమా అనేది మీరు కమ్యూనిస్టులా కాపిటలిస్టులా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది”,అన్నాడు.

చిట్టి బాబు కి వీళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్కా అర్ధం కావటం లా. తన మొబైల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని “ఆర్యా” పాటలు వినటం లో మునిగి పోయాడు. ఝాన్సి ఫెమినా లోకి దించిన తల ఎత్తలేదు.

***********************

“మీదే ఊరండీ?”,సుబ్బా రావు అడిగాడు నరసింహ మూర్తి ని.
“మాది ఖమ్మం దగ్గర వైరా. నాకు అక్కడ భూములున్నాయి అవి చూసుకొని వస్తున్నా”,అని జేబులోంచీ ఏదో మాత్ర తీసి  నీళ్ళ కోసం చూశాడు..ఎవరి దగ్గరా నీళ్ళ బాటిల్ లేదు..హారీ నీళ్ళు కూడా అయ్యిపోయాయి.మళ్ళీ టాబ్లెట్ జేబులో పెట్టుకొన్నాడు మూర్తి.
“మీ ఫామిలీ ఎంత మందండీ?”అన్నాడు సుబ్బా రావు.
“నా భార్య ఉంటుండె.ఇప్పుడు ఆమె చని పోయింది..ఉండుడు హైద్రవాద్ లోనే..ఓక పనిమనిషి వండి పెడుతుంది. నాకు ఒక్కడే కొడుకు వాడు “శానోసే” ల ఉంటడు”
“మీరు మరి మీ అబ్బాయి దగ్గరే ఉండక పోయారా?”
“అక్కడ మనకు బాతాఖానీ కి ఎవరు? దొరుకుతరు.హైద్రావాద్ లో నా ఆల్విన్ కొలీగ్స్ ఉంటరు..మా ఫ్రెండ్స్ మస్తున్నరు..వాల్లతో టైం పాస్ ఐతది..ఐనా వాడూ రమ్మంటుండు..అక్కడికి పోయేవాల్లు తోడు దొరికితే పోతా..”,అన్నాడు మూర్తి.
సుబ్బా రావు యధా విధి గా హారీ ని చూపించి, “ఈయన కూడా కాలిఫోర్నియా లో నే ఉండేది..మీకు తోడొస్తారేమో..”, అన్నాడు.
హారీ పెదాలు బిగించి మూర్తి తో చేయి కలిపి, “యా స్యూర్..ఎనీ టైం..ఐ విల్ హెల్ప్ యూ..”,అన్నాడు.
హారీ మూర్తిని, “తెలంగాణా గురించి ఈ మధ్య చాలా గొడవ జరుగుతోంది కదా మీ అభిప్రాయమేమిటి?”, అని అడిగాడు.
మూర్తి చేతులు ముకుళించి ,”దాని గురించి తప్ప దేని గురించైనా మాట్లాడు బాబు”,అన్నాడు.
హారీ సుబ్బా రావు వైపుకి తిరిగి, “ఈయన సిగ్గుపడుతున్నాడు..నువ్వే తెలంగాణ గురించి ఒక చర్చ ఎందుకు మొదలు పెట్టకూడదు? “, అన్నాడు.
సుబ్బా రావు, “అదో పెద్ద విషయం..దాని గురించి మొదలుపెడితే ఇప్పుడు తేలే విషయం కాదు..ఈ సమైక్యాంధ్రా తెలంగాణా వాదనల్లో రెండు పక్షాల వాళ్ళూ తమ చెవులు మూసుకొని ఎదుటి వాళ్ళతో వాదిస్తున్నారు. ఏదైనా ఒక విషయం చర్చించాలంటే చర్చించే వాళ్ళు ఇద్దరూ కొన్ని విషయాల గురించి అంగీకరించాలి..చర్చ ప్రయోజనాలేమిటి? ఇద్దరూ ఏ విలువలనూ కొలమానాలనూ అంగీకరిస్తారు…? మొదలైనవి. అలానే ఇద్దరూ ఓపెన్ మైండ్ తో చర్చ లోకి వెళ్ళాలి..ఒక వేళ ముందే ఒప్పుకున్న విలువల ప్రకారం తమ వాదనా లేక పాయింట్ తప్పయ్యితే ఒప్పుకోవటానికి సిధ్ధం గా ఉండాలి..అవతలి వారి మీద గెలవాలి అనే ఉద్దేశ్యం తో చర్చకు ఉపక్రమించ కూడదు. అలానే చర్చ అనేది నాకు తెలియని విషయాలు తెలుసుకొంటాను అనే సత్యన్వేషణా స్ఫూర్తి తో చేయాలి. చర్చించేటప్పుడు ఎదుటివాళ్ళు చెప్పిన లెక్కలని విశ్వసించాలి..తమ లెక్కల గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలి…కానీ తెలంగాణా విషయం లో ఇరు వర్గాల చర్చల లో ఇది లోపించింది..భావోద్వేగాలు ఎక్కువైనాయి. ఈ భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి ఆలోచన భావోద్వేగాలకు దాస్యం చేస్తుంది..భావోద్వేగాలను బలపరచటానికే ఆలోచన ఉపయోగ పడుతుంది… కాబట్టీ ఈ చర్చల వలన ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు చర్చలలో సరైన పరిష్కారం అనేది ఏదీ ఉండకపోవచ్చు..ఎందుకంటే అది చర్చల లో పాల్గొనే వారి వ్యక్తి గత ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుంది..నాకు నేను గొప్ప మీకు మీరు గొప్ప. ఇద్దరూ ఎంతసేపు వాదించుకొన్నా ఎవరో ఒకరు గొప్ప వారు అని నిర్ణయించలేము కదా..అలా వాదించుకొనే కంటే ఇద్దరూ ముష్టి యుధ్ధానికి దిగటం సరైనది…”
హారీ అడ్డు తగిలి, “హేయ్..నేను చర్చ మొదలు పెట్టమంటే నువ్వు చర్చను గురించి మోనొలోగ్ మొదలు పెట్టావు. తెలంగాణా విషయం గురించి నీకు ఇంత భయముందని నాకు చెప్పలేదే..ఏమైనా నీకు నేను డబ్బులిచ్చేది జనాలను మాట్లాడించేందుకు..కానీ ఇప్పుడు నువ్వు చర్చలకు వ్యతిరేకం గా మాట్లాడుతున్నావు. కాబట్టీ నీ పేమెంట్ లోకొంత కట్..” అన్నాడు.
సుబ్బా రావు,”తెలంగాణా గురించి చర్చించటం కంటే అది వెయ్యి రెట్లు బెటర్”,  అన్నాడు.

****************

warangal
warangal

రైలు బండి వరంగల్ స్టేషన్ చేరింది..ఈ స్టేషన్ లో ‘సుబ్బారావు అండ్ కంపెనీ’ కి ఎవరూ తోడవ్వలేదు.
ఝాన్సీ ఫెమినా మూసి అప్పుడప్పుడూ హారీ తో మాత్రమే మాట్లాడుతోంది..అమెరికా లో యూనివర్సిటీలు ఎలా ఉంటాయి…అక్కడ స్త్రీ స్వేచ్చ చాలా ఎక్కువ కదా…వగైరాలు అడుగుతోంది.
చిట్టి బాబు కి ఆర్య సాంగ్స్ వినీ వినీ బోర్ కొట్టినట్లుంది, సుబ్బారావు తో లక్జరీ కార్ బ్రాండ్ల గురించి చర్చ మొదలు పట్టాడు.మూర్తి గారు చేరగిలపడి నిద్రపోతున్నారు. కాజీ పేట్ కూడా వచ్చి వెళ్ళింది.
చిట్టి బాబు ని వదిలించుకొని సుబ్బారావు హారీ తో అన్నాడు. “మన ప్రయాణం ఇంకో గంటన్నర లో అయిపోతుంది. దీని వలన మీరు ఏమైనా ప్రయోజనం కలిగిందా ?”

జవాబు గా హారీ తన లాప్-టాప్ సుబ్బారావు కి ఇచ్చాడు, చదవమంటున్నట్లు గా.
సుబ్బా-రావు చదవ సాగాడు…

“1. నేను ఈ ప్రయాణం మొదలు పెట్టింది నా రీసెర్చ్ కోసం ఏమైనా లోతైన విషయలు తెలుస్తాయేమో నని. కానీ రీసెర్చ్ కంటే నాకు వ్యక్తి గతం గా ఈ ప్రయాణం చాలా ఉపయోగపడింది. దీనికి ముందు ‘ఈ భారతీయ సమాజం ఇలా ఎందుకు చీలికలు పేలికలు గా ఉందా?’ అనుకొనే వాడిని. ఇప్పుడు నాకొకటి అర్ధమైంది. సమాజమనేది మన అంతర్గత ప్రపంచానికి ఒక ప్రతి-బింబం లాంటిది..సమాజం లోని ద్వేషం, అవినీతీ, ఓర్వలేనితనం… ఇవన్నీ మన మనసులలోంచీ పుట్టినవే! అలానే మన అంతర్గత ప్రపంచం కూడా సమాజం వలన ప్రభావితమౌతుంది.

2.ఒకే కులం లోని వారి మధ్య సంబంధాలు నమ్మకం తో మొదలవుతాయి. ఈ నమ్మకానికి మూలాలు ఆయా కులాల ఉమ్మడి సంఘ జీవనం లోనూ, ఆచార వ్యవహారాలలోనూ,వివాహ సంబంధాల లోనూ, ఆహార విహార భాషాది విషయాలలోనూ ఉన్నాయనుకొంటా! తరువాతి వ్యక్తిగత తగదాల వలన ఆ నమ్మకానికి దెబ్బ తగల వచ్చు.
భిన్న కులాల వారి మధ్య సంబంధాలు అపనమ్మకం తో మొదలౌతాయి. ఒకే కులస్తుల మధ్య ఉమ్మడి గా ఉండే పైన ప్రస్తావించిన విషయాలన్నీ భిన్న కులస్తులలో విభిన్నం గా ఉండటం వలనేఎ అపనమ్మకానికి మూల కారణం. ఈ అపనమ్మకపు గోడను దాటితేనే భిన్న కులాల వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. కుల సమాజాలు ఈ అపనమ్మకపు గోడ దాటాలంటే భిన్న కులాలకు ఆమోదయోగ్యుడైన నాయకుడు కావాలి. అది చాలా కష్ట సాధ్యమైన విషయం.
3. ఈర్ష్యా, అసూయా, ప్రేమా, ద్వేషం, స్నేహం ఇవన్నీ మన మానసిక గుణాలు. వీటన్నిటికీ ‘నేను’ లేక అహం అనేది కేంద్రం. ఈ ‘నేను’ కి జాతీ మతం కులం దేశం మొదలైనవి అడ్రస్ లాంటివి. ఒక మనిషికి ఊరు వీధి లాంటి భౌతికమైన అడ్రస్ లు ఉన్నట్లే, అతని లో ఉండే మానసిక మైన వ్యక్తిత్వానికి  అస్థిత్వపరమైన అడ్రస్ కూడా ఉంటుంది. ‘నేను’ యొక్క అభిప్రాయాలూ ప్రవర్తనా ఈ అడ్రస్ కి అనుగుణం గా ఉంటాయి. నువ్వు అమెరికన్ ఐతే నీ అస్తిత్వ అడ్రస్ లోని పంక్తుల సంఖ్య తక్కువ గా ఉంటుంది. అదే, నువ్వు ఇండియా లో పుట్టిపెరిగితే,ఇక్కడి చారిత్రక, సామాజిక కారణాల వలన, నీ అస్తిత్వ అడ్రస్ లో కులమూ, మతమూ, భాషా, ప్రాంతమూ ఇవన్నీ కలిసి నీ అడ్రస్ చాలా పొడవు సాగుతుంది అంతే తేడా!అస్తిత్వ అడ్రస్ లేకుండా ఏ మనిషైనా భూమి మీది కొన్ని కోట్ల గుంపులో ఒకడిగా ఫీలయ్యి, తాను ఒక పనికి రాని దుమ్ము కణం గా భావిస్తాడు. అస్థిత్వాలు మనిషి పరిధిని అతని సమూహ పరిధికి పెంచి, అనంతమైన ఈ మానవ జాతి లో అతనికి ఒక స్థానాన్నీ, ప్రాముఖ్యతనీ ఇస్తాయి.

4. అయితే ఒకే మనిషి కి పరస్పర విరుధ్ధమైన రెండు అడ్రస్ లు ఉండ వచ్చు. ఉదాహరణ కు పేదవారిని అణగదొక్కటాన్ని వ్యతిరేకించే మనిషి ఆడ వారిని అణగ దొక్కటాన్ని సమర్ధించ వచ్చు. ఇది అతని అడ్రస్ లో ఉండే మగాడు అనే విషయం వలన. వ్యక్తిగత విషయాలలో ఈ వైరుధ్యం వలన నష్టం లేదు. భార్య నీ చెల్లి నీ ఒకే దృష్టి తో చూడలేము కదా! కానీ సమాజం లో ఇది తప్పు. ప్రభుత్వం తెలంగాణ నూ ఆంధ్ర నూ ఒకే దృష్టి తో చూడాలి కదా! సమాజం లో ఉండే అధికారం, ధనం, పేరు ప్రతిష్టలూ అనేవి పరిమితమైన వనరులు. ఈ వనరులకోసం, ఈ అడ్రస్ ల ను  తలలోకి ఎక్కించుకొన్న మనమందరం పోటీ పడతాం. ఈ పోటీ వలన, ఈ అడ్రస్ లు ప్రాతినిధ్యం వహించే దేశాల, మతాల, కులాల మధ్య ఘర్షణ తప్పదు.
ఇక పోతే,నా డియర్ ఫ్రెండ్ సుబ్బా రావ్  చెట్టు కింద పొదలూ చెట్టు కాయల రుచీ కూడా చూశానన్నాడు.
నాకు కూడా ఆ రుచి తెలిసింది. ఒక సమాజాన్ని అధ్యయనం చేయాలంటే దాని సూక్ష్మ దృష్టి లోనూ స్థూల దృష్టి తోనూ కూడా చూడాలి. ఈ రైలు ప్రయాణం వలన నాకు సూక్ష్మ దృష్టి ఏమిటో తెలిసింది. అలానే అమెరికన్స్ ఎక్కువగా బుధ్ధి ఉపయోగించి ఆ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఇండియన్స్ భావోద్వేగాలు ఉపయోగించి ఎమోషనల్ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు హృదయాన్ని కూడా ఉపయోగించాలని కూడా ఈ ప్రయాణం నాకు చెప్పింది”

….సుబ్బా రావు లాప్-టాప్ మూసి హారీకిచ్చి,”బాగున్నాయి సార్, మీ నోట్స్..!” అన్నాడు.

హారీ వాలెట్ తీసి, “నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా..ఎంత ఇవ్వమంటావు?” అన్నాడు
“ఈ ప్రయాణం వలన నాకు కూడా లాభం కలిగింది. కాబట్టీ మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు”
“ఏమి లాభం?”
“మనిషి కి కులం కంటే మతంకంటే స్వార్థం అనేది ముఖ్యం అని తెలిసింది. ఈ స్వార్థమూ మీరు చెప్పిన నేను అనే కేంద్రమూఒక్కటే. కానీ ఈ కేంద్రం హైదరాబాద్ ట్రాఫిక్ లా చాలా గందర గోళమైనది. ఈ స్వార్ధం లో మనిషిని వివిధమైన దిక్కులలో కి లాగే పరస్పర విరుధ్ధమైన అనేక శక్తులు ఉంటాయి. నిజాన్ని తెలుసుకోవాలంటే వీటన్నిటినీ అధిగమించ గలగాలి. ఇదీ నా పాఠం”,అన్నాడు సుబ్బారావు.
హారీ ,”నాకు అందరి కులాలూ మతాలూ జాతులూ తెలిశాయి. కానీ, ఇవన్నీ నాకు తెలియటానికి కారణమైన నీ కులం మాత్రం నాకు తెలియ లేదు” అన్నాడు సుబ్బారావు తో.
“నాకూ ఒక కులముంది సార్…అదే మనిషి కులం!”, అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
“నాది కూడా అదే కులం”,అన్నాడు హారీ సీరియస్ గా.
సీట్లో నిద్ర పోతున్న మూర్తి గారు సీట్ మీదికి ఒరిగి పడి పోయాడు. సుబ్బారావు చెయ్యి పట్టుకుంటే చల్ల గా తగిలింది. హారీ, ఝాన్సీ, చిట్టి బాబు లేచి దగ్గరకు వెళ్ళారు. భోగీ లో మిగిలిన ప్రయాణికులు కూడా వచ్చి గుమి కూడారు. ఇంతలో ప్రయణికులలో ఒక డాక్టర్ లా ఉన్నాడు, అతను వచ్చి మూర్తి గారి చెయ్యి చూసి ముక్కు దగ్గిర చెయ్యి పెట్టి పెదవి విరిచి, “హి ఈజ్ డెడ్!!”, అన్నాడు.
సుబ్బారావు మూర్తి గారిని బెర్త్ మీద సరిగా పడుకోబెట్టాడు. చిట్టి బాబు ఇంకా షాక్ నుంచీ తేరుకోలేదు. అతను చూసిన మొదటి మరణం ఇదేలా ఉంది. హారీ మూర్తి జేబు లోంచీ మొబైల్ బయటికి తీశాడు. దాంట్లో రెండే నంబర్లు ఉన్నాయి. మొదటి నంబర్ డయల్ చేశాడు.అమెరికా నంబర్ అది. అవతలి మనిషి లేడు. వాయిస్ మెయిల్ బాక్స్ లోకి వెళ్ళింది.
రెండో నంబర్ డయల్ చేశాడు.
“గుడ్ హెవెన్స్ ఎలక్ట్రిక్ క్రెమటోరియం”…
హారీ ఫోన్ సుబ్బారావు కి ఇచ్చాడు. సుబ్బారావు కాసేపు మాట్లాడి చెప్పాడు. మూర్తి గారు ముందు గానే క్రెమటోరియం కి డబ్బులు ఇచ్చి, ఆయన స్నేహితుల ఫోన్ నంబర్ల లిస్టు ఇచ్చారంట. వాళ్ళు స్టేషన్ కి వాన్ పంపిస్తారట..అలానే మూర్తి గారి అబ్బాయి ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉందట..వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు..తన దహన క్రియల గురించి వివరమైన సూచనలు ఇచ్చారంట వాళ్ళకి”, అని చెప్పాడు.

మూర్తి దేహం పై ఈగలు వాలసాగాయి. ఝాన్సీ తన బాగ్ లోంచీ షాల్ తీసి కప్పింది మూర్తి పై.
“చావు లో మనుషులందరూ ఒక్కటౌతారు కాబోలు!!”, అనుకొన్నాడు హారీ.

అయిపోయింది