“ఆల్-ఇన్-వన్ రచయిత” అనబడు లిఖిత్ ప్రయత్నాల పోరాటాల కథ

లిఖిత్ ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. తన తండ్రి తనకిచ్చిన పాత డొక్కు బజాజ్ చేతక్ ని అధిరోహించి, దాన్ని కొంచెం అదిలించి,“గాల్లో తేలుతున్నట్లుందే..” ట్యూన్ ని ఈల వేద్దామనుకొన్నాడు. కానీ, ఎదురు గా నడుచుకొంటూ శంకర్ గాడు రావటం తో ఆగిపోయాడు. శంకర్, వీడి బుధ్ధి కొంచెం వంకర!
“ఏరా లిఖిత్, నీ కథ ఏదో ఆ “సాహిత్యం” పత్రిక లో అచ్చయ్యిందంట కదా?  పార్టీ ఇచ్చేయ్!”
“కథ అచ్చైతే అయ్యింది కానీ, పత్రిక వాడు కాసులేమీ పంప లేదు రా. ఓ రెండు నెలలు ఆగు, నా నవల ఒకటి ‘రాగం’ పత్రిక లో రాబోతోంది. అప్పుడు వచ్చిన డబ్బుల తో నీకు పార్టీ ఇచ్చేస్తా!”
“ఏమి నవల రా అది?”
“గొప్ప గొప్ప భావాలనూ, ఆదర్శాలనూ విరజిమ్మే పాపులర్ నవల రా. పేద వాడి ఆకలి గురించీ, మధ్య తరగతి మంద హాసం గురించీ,తెలుగు వారి హిపోక్రసీ గురించీ, జనరంజకం గా రాస్తున్నా. ఎప్పటికైనా వీరేంద్రనాథ్ అంత పాపులరూ, శ్రీ శ్రీ అంత ఆదర్శవంతమూ ఐన రచనలను రాసేస్తా చూడు..ఒక్కసారి పాపులారిటీ వచ్చిన తరువాత డబ్బులే డబ్బులు!అప్పుడు ఒక వోక్స్ వాగన్ కారు కొనాలి . బుజ్జి ముండ అదంటే నాకెంతో ఇష్టం!”
“బాబూ..తెలుగు లో నే రాస్తున్నావా ? ఐతే ఇది రచనలకు కాలం కాదు.అందులోనూ ఆదర్శ రచనలు రాసి డబ్బు సంపాదిస్తాననటం, “తివిరి ఇసుమున తైలం తీయటం” లాంటిది.
“ఆ ఏదో నేనంటే నీకు కుళ్ళు లేవోయ్! సౌదీ లో ఇసుక నుంచీ చమురు తీయటం లేదా..నేనూ అలానే తెలుగు పాఠక లోకం నుంచీ కాసుల నిధిని సంపాదిస్తాను.!”
“సరే, నీ నిధిని అప్పుడప్పుడూ నాకు కూడా కాస్త విదిలిస్తూ ఉండు” అని శంకర్ మెల్లగా జారుకొన్నాడు అక్కడి నుంచీ.
****************
లిఖిత్ సొంత అడ్రెస్ కవర్ తో పాటు తన నవలని పోస్ట్ చేసి వచ్చి పక్కనే ఉన్న పార్క్ లో కూర్చొన్నాడు.
“హమ్మయ్య! తన సాహితీ విజయ యాత్ర కి తొలి అంకం ఇది..ఓ గొప్ప రచయిత అయ్యే లక్షణాలు చిన్నప్పటి నుంచీ ఉన్నాయి తన లో. అందుకే తన తండ్రి ఇంజినీరింగ్ చదవమంటే తను బియ్యే లో చేరాడు. తన తండ్రి ఒట్టి అజ్ఞాని.”ఈ కథలూ కాకర కాయలూ కూడు పెడతాయా!?” అంటాడు. ఎప్పుడూ కూటి గురించిన యావే! ఆయన బాగానే సంపాదించాడా! నగరం లో ఓ రెండు ఇళ్ళూ మూడు సైట్లూ ఉన్నాయా!..అయినా,”కోటి విద్యలూ కూటి కోసమే రా!”అంటాడాయన”.
“తను ఒక్క సారి ప్రసిధ్ధ రచయిత అయ్యాడంటే, అభిమానుల్నించీ ఒకటే ఉత్తరాలు…ఆడ ఫాన్స్ లో ఒక ఇద్దర్నో, ముగ్గుర్నో ఎంచుకొని వారి తో ఇంచక్కా రొమాన్స్ చేయవచ్చు”.
పార్కులో బెంచీ పైన పక్కనే ఒకాయన కూర్చొని ఏదో రాసుకొంటున్నాడు.
“ఏమండీ కథ రాస్తునట్లున్నారు, మీరు రచయితా?”ఆరా తీశాడు లిఖిత్.
“నేను రచయితనే కానీ, ప్రస్తుతం నా ఇంటి వెచ్చాల పద్దులు రాస్తున్నాను”
సాటి రచయితని చూడగానే లిఖిత్ మనసు ఎగిరి గంతేసింది.
“నేను కాబొయే పాపులర్ రచయిత లిఖిత్ ని సార్!”
“నువ్వు విహారి పేరు వినే ఉంటావ్ కదా! అది నా కలం పేరు. మా ఆవిడ, “అనవసరం గా స్టాంప్ ల కీ, కవర్లకీ డబ్బు తగలెడుతున్నారు. అవి కొనక పోతే పౌడర్ డబ్బాలన్నా కొనవచ్చు” అని పోరటం తో నా రచనా వ్యాసంగం మాని వేసి స్కూల్లో పని చేస్తున్నాను.”
“స్టాంపులు దండగని రచనలు మానేయటమేంటి సార్? ఈ సమాజమనే స్టాంప్ మీద మన ముద్ర ను బలం గా గుద్దాలి.కొంచెం నా కథలు చదివి, మీ అభిప్రాయం చెప్తారా?”
విహారి “కొత్త బిచ్చగాడు పొద్దెరగడు”, అనుకొని, తేలుకుట్టిన వాడిలా మొహం పెట్టి, “ప్రస్తుతానికి సమయం లేదు. తరువాత ఎప్పుడైనా..”,అన్నాడు.
“సరే, అన్నట్లు, మీకు తెలిసిన ఎడిటర్ ఎవరన్నా ఉంటే పరిచయం చేయండి సార్.”
**********
లిఖిత్ నవలను రాగం పత్రిక ప్రచురించ లేదు సరి కదా, రాత ప్రతి ని తిరిగి పంపను కూడా లేదు. అయినా అతను పట్టు వదలని విక్రమారుడి లా పత్రికలకు కథలు పంపుతూనే ఉన్నాడు. కానీ అవన్నీ బ్లాక్ హోల్ లో పడిన కాంతిలా అజా పజా లేకుండా పోయాయి. రచనలు పంపేటప్పుడు స్టాంపులంటించిన సొంత అడ్రెస్ కవర్ పంపటం మానుకొన్నాడు లిఖిత్. అదొక  దండగ!
ఓ రోజు విహారి పార్కులో మళ్ళీ కనపడితే,ఆయన్ను లిఖిత్ బలవంత పెట్టి, ఒక ఎడిటర్ ని పరిచయం చేయమని తీసుకెళ్ళాడు. విహారి వెనుక సీట్లో కూర్చుంటే లిఖిత్ తన స్కూటర్ ని తిన్నగా నడప సాగాడు. రోడ్డు రణరంగం లా ఉంది. వాహనాలను గజి బిజి గా, ఒకరికొకరు అడ్డు పడుతూ డ్రైవ్ చేస్తున్నారు. విహారి, “రోడ్డు మీద ప్రవర్తనే మన సమాజం లో ప్రతిఫలిస్తుంది… స్వార్థం పెరిగిపోతోంది..డబ్బు యావ పెరిగిపోతోంది. ఈ వ్యాపార తత్వం వలనన కూడా నేను రాయటం మానుకొన్నాను” అన్నాడు.
లిఖిత్ గడుసు గా నవ్వుతూ, “మీరు చాలా నిస్వార్ధ మైన వారి లా ఉన్నారు. నాకు మీ ‘ఏ టీ ఎం’ కార్డూ, పిన్ నంబరూ ఇచ్చేయండి సార్” అన్నాడు.
విహారి పెద్దగా నవ్వేసి, లిఖిత్ భుజం మీద తట్టి, “నువ్వు భలే తమాషా మనిషివోయ్!”, అని, మనసులో, “వీడో తింగరి వెధవ లా ఉన్నాడే!” అనుకొన్నాడు.

ఎడిటర్ ‘ఏకాం’బరం గారి ముందు బల్ల కింద దొంతరలు గా వచ్చిన కవర్లు ఉన్నాయి.ఏకాంబరం అనేది ఆయన అసలు పేరు కాదు. పూర్వం ఒక దిన పత్రిక లో ప్రభుత్వాన్ని ఏకుతూ వ్యాసాలు రాసి ప్రసిధ్ధుడయ్యాడాయన. ఆవిధం గా వచ్చింది ఆయనకు ‘ఏకాం’బరం అనే పేరు. తరువాత ప్రభుత్వం ఆ దిన పత్రిక యాజమాన్యం మీద ‘ఇన్ కం ట్యాక్స్’ శాఖ ద్వారా వత్తిడి తెచ్చి ఏకాంబరాన్ని పీకించేసింది. ఇక అప్పటి నుంచీ బుధ్ధి తెచ్చుకొని పెద్ద వారికి అనుకూలం గా నడుచుకొంటూ కాలం నెట్టుకొస్తున్నాడు ఏకాంబరం.
ఏకాంబరం లిఖిత్ ని కూర్చోమనైనా అనకుండా కిందా మీదా చూసి, “మీరు దేని గురించి రాస్తారు?”, అన్నాడు.
“ఆదర్శాలూ, పేదరికం,ప్రేమా, విలువలూ, సంస్కృతీ.. ..”

ఏకాంబరంఒక్కసారి కుష్టు వ్యాధిగ్రస్తుడిని చూసినట్లు ఉలిక్కిపడి, లిఖిత్ ని మధ్య లోనే ఆపేసి, “బాబ్బాబూ, నా ఉద్యోగం ఊడగొట్టకు. మనకు కావలసినవి పత్రిక సర్క్యులేషన్ పెంచే కథలు. అసలే ఈ టీవీ ఛానళ్ళూ, ఇంటర్నెట్టూ వలన సర్క్యులేషన్ పడిపోతూంటే, నీ ఆదర్శాల ఆకలి కథలు వేసుకొంటే, ఈ పత్రిక మూత పడుతుంది. నా ఉద్యోగం ఊడుతుంది.”, అన్నాడు.
“అంటే మీకు మసాలా కథలు కావాలన్న మాట. మీరు కథలని ఎలా సెలక్ట్ చేసుకొంటారండీ?”
“కథ లో పట్టూ, కథనం లో బిగీ ఉండాలి. చదివించే గుణం ఉండాలి.ఈ ఆధునిక కాలం లో, బిజీ జీవితాలలో పాఠకులకి కథలు చదివే తీరిక ఎక్కడుంటుంది? కాబట్టీ కథలు టీవీ యాడ్స్ లా చిన్న గా, పాఠకుడి దృష్టిని కట్టిపడేసేలా ఉండాలి. సింగిల్ కాలం కథలూ, ఒక పేజి కథలూ..ఇలా రాయాలి..చాట భారతాలు రాయకూడదు. .. పాపులర్ కావాలంటే పాప్ కార్న్ సాహిత్యం రాయాలి మరి“, అని ఏకాంబరం తన ముందున్న కవర్ల దొంతరను ఒక్క సారి కదిలించాడు. దాని నుంచీ ఒక పోస్ట్ కార్డ్ బయట కొచ్చి కింద పడింది. “ఈ రాత గాడెవడో తెలివైనవాడు . క్లుప్తం గా ఓ పోస్ట్ కార్డ్ మీద కథ రాసి పారేశాడు. “ఈ వారం కథ” శీర్షిక లో ఈ సారి కి ఇతని కథ ప్రచురిద్దాం”, అని “పోస్టల్ స్టాంప్ ల పై కథలు రాసే రోజులు కూడా వస్తాయి,” అని ముక్తాయించాడాయన.
ఏకాంబరం మాటలు విని అముదం తాగిన మొఖం పెట్టాడు లిఖిత్.
లిఖిత్ ని చూసి ఏకాంబరం,”అలా అని నువ్వేమీ అధైర్య పడ వద్దు బాబూ,మేము అప్పుడప్పుడూ కథల పోటీలు పెడతాం..కానీ ఒక కండిషన్..ఆ పోటీ లకి సరిగ్గా నాలుగు పేజీల పది లైన్ల మూడు మాటలు ఉండే కథలను మత్రమే అనుమతిస్తాం.మాకు పత్రిక లో ఉండే నిడివీ, ప్రకటనల దృష్ట్యా ఇలాంటి కండిషన్లు తప్పని సరి. నువ్వు ఆ పోటీ లో నీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నీ కథ కి బహుమతి వచ్చినా, నువ్వు రాసినది యధా తధం గా మేము ప్రచురించక పోవచ్చు.సుబ్బి సుబ్బమ్మ అయినట్లు, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తాం.” అన్నాడు. ఏకాంబరం కాసేపాగి, తనలో ఏదో ఆలోచించుకొని, కుర్చీ కి చేరగిలబడి, “ఐనా, సాయంత్రం ఏడు గంటల కి నీ కథల ప్రతులు చూపించు. అప్పుడు నేను సికిందరాబాద్ క్లబ్బులో ఉంటాను. అక్కడికి పట్టుకొని రా, చూద్దాం”,అన్నాడు.
బయటికొచ్చినాక విహారి లిఖిత్ తో, “సాయంత్రం క్లబ్బు లో ఆయనకు ఓ రెండు డ్రింకులు స్పాన్సర్ చెయ్యి..అలా చేయకే నేను దెబ్బ తిన్నాను”, అన్నాడు.
లిఖిత్, “అలా అయితే నేను క్లబ్బుకే వెళ్ళను సార్. ఆంధ్రుల అభిమాన రచయితను అవ్వాలంటే గమ్యమే కాదు, మార్గం కూడా స్వచ్చం గా ఉండాలి”, అన్నాడు.
విహారి, “నీ ఇష్టం. ఏదో కుర్ర వాడివని నాకు తోచిన సలహా చెప్పాను”, అన్నాడు.
**********
లిఖిత్ ఇంటి ముందు సైకిల్ దిగిన శంకర్ లోపలికి వచ్చాడు. “ఏమండీ “ఆంధ్రుల ఆల్-ఇన్ వన్” రచయిత గారూ, నాకు ఇవ్వాల్సిన పార్టీ మాటేమిటి?ఈ పాటికి బాగానే సంపాదించి ఉంటావే!”, అన్నాడు  లిఖిత్ గది లోకొచ్చిన శంకర్ వ్యంగ్యం గా.
“ఏం సంపాదించటం లే! కాయితాలు వృధా! కథలు పంపే కవర్ల డబ్బులు కూడా వృధా! అందుకే ఆ డబ్బులైనా పొదుపు చేద్దామని ఇప్పుడు ఇంటర్నెట్ బ్లాగ్ ల లో కథలు రాస్తున్నా.కానీ, నెట్ లో కూడా చదివే వాళ్ళ కంటే రాసే వాళ్ళు ఎక్కువైపోయారు”, అన్నాడు లిఖిత్.
“ఇలా కాదు రా బాబూ, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నాకు తెలిసిన పబ్లిషర్ ఒకడున్నాడు. నీ రచనల మీద నీకు నమ్మకముంటే, అతని ని కలుద్దాం”
లిఖిత్ తన పాత నవల ప్రతి ఒకటి పట్టుకొని, శంకర్ తో పాటు పబ్లిషర్ పరాంకుశాన్ని కలవటానికి బయలుదేరాడు.
పరాంకుశం ఓ నాలుగు పేజీలు తిరగేసి,”వేద్దాం సార్, ఈ నవల వేద్దాం.ఓ ఐదు వందల కాపీలు వదులుదాం… పదిహేను వేలు ఓకే నా?” అన్నాడు.
లిఖిత్ గుండె ఒక్క సారి ఎగిరి గంతేసిది. కళ్ళ ముందు పదిహేను వేల పారితోషికం కనపడింది. “ఎన్నాళ్ళో వేచిన ఉదయం..”, అని పెద్ద గా పాడబోయాడు.
పరాంకుశం లిఖిత్ ని “రేపు ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వ గలుగుతారా?శంకర్ గారికి ఓ మూడు వందలు కమీషన్ పోతుంది లెండి”అన్నాడు.
“అంటే..ఛీ..వెధవ బతుకు..నా పుస్తకాన్ని నేనే డబ్బు పెట్టి అచ్చు వేసుకోవాలన్న మాట!”
దానికి పరాంకుశం, “లేక పోతే నాకెందుకు సార్ దూల? ఈ రోజుల్లో పుస్తకాలను ఊరికే ఇచ్చినా ఎవరూ కొనటం లేదు. అలాంటిది, ఊరూ పేరూ లేని మీ లాంటి రచయితల పుస్తకాలు ఎవరు కొంటారు? త్వరలో పుస్తకాలు రాయటం అనేది, శిల్పాలు చెక్కటం వంటి ఒక ప్రాచీన కళ అయిపోతుంది. కాబట్టీ, మీ పుస్తకాలను నా డబ్బులతో పబ్లిష్ చేస్తే, చివరికి నా చేతికి వస్తుంది ఒక చిప్ప!” అన్నాడు.
“ఎంత అవమానం..?  ఈ “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత”కేనా ఈ పరాభవం? నా కెపాసిటీ తెలియక భ్రమ పడుతున్నాడు ఈ పబ్లిషరాధముడు.”
శంకర్ భరోసా గా, “ఏమీ పర్లేదు లే, మీ నాన్న కొనిచ్చిన స్కూటర్ ఉందిగా! అది అమ్మేయ్!”, అన్నాడు.
**************
పాత స్కూటర్ అమ్మి అచ్చు వేయించిన నవల పది కాపీ లు కూడా అమ్ముడు పోక పోవటం తో,మిగిలిన కాపీలని లిఖిత్ సైకిల్ మీద పెట్టుకొని దానిని తన ఫ్రెండ్స్ కి దానం చేయవలసి వచ్చింది. లిఖిత్ ఫ్రెండ్స్ ఆ నవలని పాత న్యూస్ పేపర్ తో పాటు తూకం ప్రకారం అమ్మి సిగరెట్ ఖర్చులకు వాడుకొన్నారు.
తన పబ్లిషింగ్ ప్లాన్ బెడిసి కొట్టటం తో,లిఖిత్ కి ఏమీ తోచక మళ్ళీ శంకర్ ని ఆశ్రయించాడు. “వాడికైతే అయిడియాలు బాగా తడుతాయి”.
శంకర్ తన ఇంటి ముందు స్కూటర్ స్టాండ్ వేసి, సీట్ పై కూర్చొని, సాలోచన గా శూన్యం లోకి చూచి తల పంకించి, “నువ్వే ఒక పత్రిక పెట్ట రాదూ? దాని నిండా నీ రచనలే వేసుకొని, నువ్వు పాపులర్ అయిపోవచ్చు. ఒక్క సారి పాపులర్ అయిన తరువాత, కుక్కని కొట్టినా డబ్బు రాలుతుంది”
“నాకు కుక్క ని కొడితే రాలే డబ్బు వద్దు. జనాలు నా పుస్తకాల పేజీలు తిప్పితే రాలే డబ్బు కావాలి. నీ అయిడియా బాగానే ఉంది.కానీ ఒక చిన్న లోపం! పత్రిక లో పడే మన రచన పాపులర్ కావాలంటే ముందు పత్రిక పాపులర్ కావాలి. మరి పత్రిక ని పాపులర్ చేయటం ఎలా?”
“అహా.. ఇన్నాళ్ళకి నీ బుర్ర పాదరసం లా పని చేస్తొంది..ఇక ఖచ్చితం గా విజయం నీదే! పత్రిక ను పాపులర్ చేయటానికి పత్రిక పెట్టే ముందుగానే వీర పబ్లిసిటీ ఇస్తే సరి.”
“వీర పబ్లిసిటీ ఎలా ఇస్తారేం..?”
“ఆ ఏముందీ ముందు మన ఫ్రెండ్స్ లో నోటి మాట గా చెబ్దాం..తరువాత..టీవీ లో, ఇంటర్నెట్ లో,  హోర్డింగ్సూ గట్రా..”
“అబ్బో ఇదంతా తడిసి మోపెడవుతుంది..ఏమైనా “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత” అవ్వాలంటే ఇలాంటి చిన్న ఖర్చులూ కష్టాలూ తప్పేటట్లు లేవు. ఇదంతా నా భవిష్యత్ కి ఒక ఇన్వెస్ట్-మెంట్ లాంటిది. పైగా ఈ పత్రికల వాళ్ళూ తానా అంటే తందానా అనటం తప్పుతుంది…ఒక కథను హాయిగా మనకిష్టమైనన్ని పేజీలు రాసుకోవచ్చు. మనం రాసిన కథను మార్చే వాడే ఉండడు.”
“సరిగ్గా నా నోట్లో మాట చెప్పావు..కాక పోతే ఓ పది లక్షలు కావాలి. మీ నాన్న ని ఆ ఊరి బయటి సైటు తనది కాదనుకొనమను ”
“అబ్బో.. ఆ పాత డొక్కు స్కూటర్ అమ్మినందుకే మా నాన్న నా మీద గుర్రు గా ఉన్నాడు రా. అయినా,ఒక్క సారి మా నాన్న తో మాట్లాడతా!”    “సరే రా, మీ నాన్న తో మాట్లాడి, రేపు నాతో చెప్పు.ఈ మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ లోబిజీ గా ఉంటున్నాను.వస్తా మరి“
*********
లిఖిత్ వాళ్ళ నాన్న అహోబల రావు కి వాడి మాటలు విని అరికాలి మంట నోట్లో కొచ్చింది.
“స్కూటర్ ని అమ్మింది కాక, సైట్ అమ్ముతానంటావా? తోలు తీస్తా వెధవా..అయినా కోటి విద్యలూ కూటి కోసమేనోయ్..కథలూ కాకరకాయలూ….”
“..కూడు పెట్టవు..ఇంకా ఆపు నాన్నా, ఈ డయలాగ్ వినీ వినీ బోర్ కొట్టింది”
“కూడు అంటే అన్నం మెతుకులు మాత్రమే కాదు రా బడుధ్ధాయ్..! కూడు అంటే డబ్బూ..దర్పమూ..మీ ఫ్రెండ్ శంకర్ ని చూసి బుధ్ధి తెచ్చుకోరా..మొన్నటి దాకా స్లిప్పర్ లు వేసుకొని, కాళ్ళీడ్చుకొంటూ తిరిగేవాడు..ఇప్పుడు స్కూటర్ కూడా కొనేశాడు.నువ్వూ ఉన్నావ్ ఎందుకు? బంగారమంటి బజాజ్ స్కూటర్ ని అమ్మేశావ్! ఇక పుస్తకాలూ, రచనలూ అన్నావంటే కాళ్ళు విరిచి గాస్ పొయ్యి లో పెడతా. నా స్నేహితుడొకడికి కోఠీ లో బిజినెస్ ఉంది. వాడు దాంట్లో ఓ సూపర్వైజర్ ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకొన్నాడు.బుధ్ధి గా వెళ్ళి రేపటి నుంచీ ఉద్యోగం చేసుకో. లేక పోతే ఇంట్లో నుంచీ బయటికి నడువ్”, అని హెచ్చరించాడు అహోబల రావు.
“నాన్నా..తరువాత ‘వాసు’ సినిమా లో వెంకటేష్ తండ్రి లా నీ తప్పు నువ్వు తెలుసుకొంటావు..ఎప్పటికైనా ఆంధ్రుల ఆరాధ్య రచయిత ను కాక పోను”, అనుకొన్నాడు లిఖిత్.
*************
“ఒరేయ్ శంకర్, పత్రిక పెట్టటం మనవల్ల కాదు రా! సైట్ అమ్మమంటే, మా నాన్న నాకు బాగా మడ్డి కూడు పెట్టాడు”.
“ఏమీ దిగాలు పడకు రా. ఆ..ఒక అయిడియా..నువ్వే ఓ వెయ్యి పోస్టర్లు అచ్చు వేయించి నగరం అంతా అంటించెయ్ రా! “
“ఎక్కడ అచ్చేయిద్దాం..?”
“ఇంకెక్కడా..! నా ఫ్రెండ్ నరేష్ గాడికి ఒక ప్రెస్ ఉంది లే..మనకైతే తక్కువకే వేస్తాడు. మహా ఐతే ఆరేడు వందలు అవుతాయి..నే మాట్లాడతాలే!ఓ వంద అడ్వాన్స్ కొట్టు ముందు”
“ఒరే.., నువ్వు కమీషన్ నొక్కేయటం లేదు కదా?”
“చ..భలే వాడివి..ఆ పరాంకుశం గాడు ఏదో అన్నాడని..నువ్వు నమ్మేయటమేనా?”
*************
రోడ్ పక్కన, లిఖిత్ తన రాబోయే పత్రిక “అక్షరం” గురించి పోస్టర్ అంటించుకొంటున్నాడు.పక్కనే ఫస్ట్ షో జనాలు ఇళ్ళకు పోతున్నారు. ఇంత లో వెనుక గా ఎవరో కార్ హారన్ మోగించిన చప్పుడు వినపడించి. లిఖిత్ తల తిప్పి చూశాడు. కార్ లో శంకర్ ఉన్నాడు. “పోస్టర్ ల కు  బాగానే మైదా పెడుతున్నావే..రాయి రాయి..”కష్టే ఫలి”,పాపులర్ రచయితవవ్వాలంటే ఇవన్నీ తప్పవు మరి. అన్నట్లు ఈ నెల పదిన నా పెళ్ళి..నువ్వు తప్పకుండా రావాలి”, అని శుభలేఖ లిఖిత్ చేతి కందించి రయ్యిన తన కారు లో బిజీ గా వెళ్ళిపోయారు శంకర్ గారు.
వెనుక గా అతని సైకిల్ స్టాండ్ పై పోస్టర్లు దొంతర గా ఉన్నాయి. ఎన్నిచోట్ల అంటించినా అవి తరగటం లేదు.
“ఈ పత్రిక మాటేమిటో కానీ, ఇవి అంటించలేక తల ప్రాణం తోకకి వస్తోంది”, అనుకొన్నాడు.
“బాబూ ఒక్క సారి ఇలా వస్తా..చిన్న పని.. మా డైరక్టర్ గారు రమ్మంటున్నారు”,ఓ అరవై యేళ్ళ ముసలాయన పిలిచాడు.
“ఏమైన రాసి పెట్టాలా?”
“ఆ అదే అనుకొంటా..”
ముసలాయన సినిమా హాలు ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
“మా పోస్టర్లు అతికించే కుర్రాడు మానేశాడు..పోస్టర్లకు మైదా రాసే పని ఉంది.కిటికీ లోంచీ చూశా.బాగానే రాస్తున్నావ్.రేపట్నుంచీ వచ్చి పని లో  చేరిపో”
లిఖిత్ కి కళ్ళు తిరగ సాగినయ్. వడి వడి గా వచ్చి, పోస్టర్ల దొంతర లాగి పారేసి, సైకిల్ ఎక్కి ఇంటికి పోనిచ్చాడు.
“నాన్నా..రేపు ఆ సూపర్-వైజర్ జాబ్ లో చేరిపోతున్నాను. మీ ఫ్రెండ్ కి చెప్పేయ్”, అన్నాడు లిఖిత్ అహోబల రావు తో.
ఆ విధం గా ఆంధ్ర దేశం ఒక కాబోయే “ఆల్-ఇన్-వన్ రచయిత” ని కోల్పోయింది

One thought on ““ఆల్-ఇన్-వన్ రచయిత” అనబడు లిఖిత్ ప్రయత్నాల పోరాటాల కథ”

వ్యాఖ్యానించండి