ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-35

శ్రీధర్ కి వాళ్ళ మామ గారి నుండీ ఫోన్ వచ్చింది. “సరళ కి లేబర్ పెయిన్స్ వచ్చాయి. ఆమె ను హాస్పిటల్లో జాయిన్ చేశాం.”
శ్రీధర్ లో ఆదుర్దా పెరిగింది. చెన్నై కి టికెట్లు బుక్ చేదామని బయలు దేరాడు. ఈ లోగా ఇంకో కాల్.  మళ్ళీ మామ గారే,” కంగ్రాట్యులేషన్స్. సరళ మగ పిల్లాడిని ప్రసవించింది. నార్మల్ డెలివరీ నే. తల్లీ పిల్లాడూ ఇద్దరూ ఆరోగ్యం గా ఉన్నారు”.
శ్రీధర్ కి ఒక సహజమైన అవసరం తీరిన ఆనందం కలిగింది. రోజు వారి జీవితం లో లేనటువంటి ఒక గర్వం కలిగింది అతనికి. అతని ఆనందానికి ఏవో భౌతికమైన కారణాలు ఉండి ఉండాలి.
*************
ఇంకో ఆర్నెల్లకి సరళ కి బెంగుళూరు లో ఉద్యోగం వచ్చింది. బాబు తో సహా ఆమె బెంగళూరు కు వచ్చేసింది. చెన్నై లో ఉన్న వాళ్ళ ఇంటిని అద్దెకి ఇచ్చారు. వాళ్ళ తమిళ నాడు కారు ని నియమాల ప్రకారం చెల్లించవలసిన లంచాలు చెల్లించి బెంగళూరు కు తీసుకొని వచ్చారు. వాళ్ళ అపార్ట్ మెంట్ సరళ ఆఫీస్ కి దగ్గర గా ఉండేటట్లు తీసుకొన్నారు. దీని వలన శ్రీధర్ వాళ్ళ ఆఫీస్ ఇంటి నుంచీ బాగా దూరమైపోయింది. శ్రీధర్ పొద్దున్నే బయలుదేరేటప్పటికి బాబు లేవను కూడా లేవడు.  మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి కనీసం రాత్రి తొమ్మిది అవుతుంది. అప్పటికి బాబు నిద్ర పోతూ ఉంటాడు. ఇక వాడి తో ఆడు కోవటం వీకెండ్స్ లో నే. అప్పుడు కూడా వీక్ డేస్ లో చాలని నిద్ర, దాడి చేయకుండా ఉంటే. పగలు సరళ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆఫీస్ కి దగ్గర లో ఉన్న ‘క్రెష్’ లో బాబు ని వదిలి పెట్టి వెళ్తుంది.  సాయంత్రం ఆఫీస్ నుంచీ వచ్చేటప్పుడు మళ్ళీ వాడిని తీసుకొచ్చుకొంటుంది.
వాళ్ళ అపార్ట్ మెంట్  సముదాయం పేరు “గ్రీన్ వాలీ.”  అది చూడటానికి శుభ్రం గా లాండ్ స్కేపింగ్ తొ సహా నీటు గా ఉంటుంది. మొదట ఆ బిల్డర్ అక్కడ ఉన్న పచ్చని తోటలనూ, పొదలనూ వాటి మీద ఆధారపడి ఉండే జీవావరణాన్నీ ప్రొక్లైనర్ల తో తొలగింఛాడు. తరవాత అక్కడ ఒక కాంక్రీట్ వనాన్ని కట్టాడు.  ఆ కాంక్రీట్ అడవి లో పేలికలలాగా చిన్న ప్రదేశాన్ని లాండ్ స్కేపింగ్ చేసి దానికి “గ్రీన్ వాలీ” అని పేరు పెట్టాడు. ఆ పైన వాటిని మతి పోయే లాభానికి మతి తప్పిన కోడ్ కూలీ లకి అమ్మాడు. బాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాటిని కొన్న కోడ్ కూలీలు రిసెషన్ దెబ్బకి “ఈ ఎం ఐ ” లు కట్టగలమా అనే సందేహం లోపడ్డారు.
శ్రీధర్ వాళ్ళ కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది. బిడ్డ పుట్టిన తరువాత బిడ్డ నాన్న ఊరిలో వాడికి అన్నప్రాసన చేయాలి. కానీ శ్రీధరూ సరళలకి సెలవలు దొరకలేదు. బాస్ కి ఇష్టం లేకుండా సెలవు పెట్టి వెళ్తే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడతాడో అని భయం. చంద్రమ్మ ఫోన్ లో శ్రీధర్ తో అంది, “మన కుటుబం లో ఈ ఆచారాన్ని పాటించక పోవటం ఇదే మొదటి సారి. నీ చిన్నప్పుడు మీ నాన్న ఊరంతటినీ భోజనాలకి పిలిచారు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసీ లాభంలేకుండా పోయింది.”
****************
బాబు కి అక్షయ్ అని పేరు పెట్టారు. వాడి మొదటి పుట్టిన రోజు ఘనం గా చేశాడు శ్రీధర్. బాబు తన చిన్న చేతులని ఊపినప్పుడల్లా శ్రీధర్ ఎదంతా ఏదో తెలియని గర్వం తో నిండిపోయేది. చంద్రమ్మా కృష్ణా రావూ రాలేదు.వాళ్ళకి కోపం వచ్చింది వాడి అన్నప్రాసన ఊళ్ళో చెయ్యలేదని. పైగా కృష్ణా రావు అననే అన్నాడు, “అన్నప్రాసన కి టైం లేదు కానీ, అదేదీ…ఆ.. బర్త డే కి టైం దొరికింది వీడికి” అని. ఫంక్షన్ లో ఎవరో అడిగారు సరళ ని మీ అత్తా మామలేరని, “వాళ్ళు రాలేదు” అందామె.మళ్ళీ ఆ అడిగిన వాళ్ళే అన్నారు,”ఎందుకు రాలేదు?”.
“ఏమో తెలియదు”, అని లోల్లోపల ఆ అడిగిన వాళ్ళ మీద చాలా గింజుకొంది సరళ.
అక్షయ్ చురుకు గానే ఉంటున్నాడు కానీ, శ్రీధర్ కి ఒక విషయం దిగులు గా ఉంది. వాడు ఇంకా చిన్న చిన్న మాటలు కూడా చెప్పటంలేదు. వాడిని పేడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు శ్రీధర్.
డాక్టర్ “బాబు రోజూ చేసే పనుల” గురించి అడిగాడు. శ్రీధర్ వాళ్ళమ్మ క్రెష్ ళొ ఒదిలిపెడుతుందని చెప్పాడు.
డాక్టర్ అన్నాడు, క్రెష్ లో ఏమి చేస్తారు?”
శ్రీధర్ కి తెలియదు. తరువాతి సోమ వారం సెలవు పెట్టి శ్రీధర్ క్రెష్ కు వెళ్ళాడు, బాబు ఏమి చేస్తున్నాడో చూడటానికి. క్రెష్ గేట్ తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఒక  పదిహేడేళ్ళ కుర్రాడు గేట్ తీశాడు. లోపల పిల్లలు బొమ్మలతో ఆడుతున్నారు. ఒక మధ్య వయసు ఉన్న ఆమె వచ్చి పిల్లలు బయటికి వెళ్ళకుండా గేట్ తాళం పెట్టాము అని చెప్పింది.  గేట్ బయట వాహనాలన్నీ పొగలు కక్కుకొంటూ వెళ్తున్నాయి.
కొంతమంది పిల్లలు టీవీ లో కార్టూన్ మూవీ చూస్తున్నారు.
“అక్షయ్ క్రెష్ లో ఎలా ఉంటాడు?”,అని అడిగాడు శ్రీధర్ ఆ మధ్య వయసామెని.
“బాగానే ఉంటాడు సార్.ఒక్కొక్క సారి వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తాడు. లేకపోతే పరవాలేదు”
అక్షయ్ ని తీసుకొని ఇంటికి వచ్చేశాడు శ్రీధర్. అపార్ట్మెంట్లో అందరూ వాళ్ళ ఆఫీస్ లకి వెళ్ళిపోయారు.నిర్మానుష్యం గా ఉంది. సాయంత్రమే మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేది. మిగతా సమయమంతా మరుసటి రోజు కి తయారవ్వటం లోనే సరిపోతుంది వాళ్ళకి. వీకేండ్స్ వచ్చాయంటే,వీక్ డేస్ లో పడిన శ్రమ నుంచీ ఒత్తిడి నుంచీ రిలాక్స్ అవ్వటానికే సరిపోతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి కూడా తీరిక ఉండదు.
శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. ఒక వార్తా చానల్లో నగరంలో కిడ్నాప్ అయ్యిన ఒక చిన్నమ్మాయి గురించి చూపిస్తున్నాడు. ఇంకోచానల్ లో వివిధ నగరాల లో ని పొల్యూషన్ లెవల్స్ గురించి చెప్తున్నాడు. అతనికి మొదటి సారిగా తన కొడుకు భవిష్యత్తు గురించి భయం వేసింది. వాడి రా బోయే రోజులు ఆనందం గా ఉండవేమో అనిపించింది శ్రీధర్ కి. శ్రీధర్ కి తన బాల్యం గుర్తుకు రాసాగింది. ” తన నాయనమ్మ చెప్పిన కధలూ..ఆ కధలు చెప్తూ ఆమె పాడిన పద్యాలూ…ఊళ్ళో ఏ భయమూ లేకుండా గాలికి తిరిన రోజులూ…చెరువు లో పట్టిన చేపలూ…వాటిని మళ్ళీ వదిలేసిన గుంటలూ…అప్పటి అమాయకత్వం…కాలువల్లో ఈతలూ…మామిడి తోటల్లో ఆటలూ…అభం శుభం తెలిసీ తెలియని వయసూ..”
శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నా ఎప్పుడూ దిగులు పడలేదు ఊళ్ళొ వాడు క్షేమం గా ఉంటాడో లేదోనని. ముందు గా మనిషి ప్రకృతి లో భాగం గా ఉండి ఉంటాడు. తరువాత సమాజం ఏర్పడి,సమాజం వాడికి నీతి నియమాలని నేర్పి ఉంటుంది. దీని వలన మనిషి ప్రకృతి నుంచీ కొంత దూరం గా జరిగి సమాజనికి కొంత దగ్గరయ్యి ఉంటాడు.  ఇప్పుడు ఈ ఆధునికత వచ్చి వ్యక్తిని సమాజం నుంచీ వేరు చేస్తున్నట్లుంది. ఈ ప్రక్రియ పాశ్చాత్య సమాజం లో ఇప్పటికే జరుగుతోంది. అక్కడ ప్రతి ఒక్కరూ సముద్రం లోఉన్న ఒక ద్వీపం లాంటి వారే.”
సరళా శ్రీధరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ శ్రీధర్ చిన్నప్పుడు అనుభవించిన బాల్యం ఇప్పుడు అతని కొడుకుకి ఇవ్వటానికి ఎంత ఖర్చవుతుంది? అతని కొడుకు బాల్యం చాలా చప్ప గా ఉండేటట్లుంది. ఇంట్లో వాడికి తోడు గా ఇంకొక చిన్న పిల్లాడో, పిల్లో ఉంటె వాడు కొంచెం సంతోషం గా పెరుగుతాడేమో.
ఆ రోజు రాత్రి శ్రీధర్ సరళ ని అడిగాడు,”మనం ఇంకొక బిడ్డ ని కందామా?” అని.
ఆమె అంది, “ఇక్కడికి వీణ్ణి పెంచటానికే మనం కష్ట పడ వలసి వస్తోంది. ఇంకొకరి ని ఎలా పెంచ గలం. ఒక్కడైతే మనకొచ్చేడబ్బులతో వీడికి ఏమీ కొదవ లేకుండా పెంచ వచ్చు. ఇద్దరిని మనం భరించ గలమా? ఐనా నేను ఇంకో కానుపుకి సిధ్ధం గా లేను. పిల్లల్ని కనటం అనేది చాలా ఒత్తిడి తో కూడుకొన్న పని. మీ మగాళ్ళకు ఈ విషయం చెప్పినా అర్ధం కాదు”
శ్రీధర్ అనుకొన్నాడు,”ఆశ్చర్యం గా ఉందే! మామ్మా నాన్నా సన్నకారు రైతులై ఉండీ మమ్ముల్ని ఇద్దర్ని సంతోషం గా పెంచారు. కానీ అధికాదాయం వచ్చే ఉద్యోగాలు చేస్తూ మేమిద్దరం ఇంకొకరిని పెంచలేక పోతున్నామే?”

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

వ్యాఖ్యానించండి